Share News

నత్తనడకన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:30 AM

జాతీయ రహదారిని అనుసంధానించేలా వీఎంఆర్‌డీఏ చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణంలో జాప్యంపై ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు.

నత్తనడకన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం

‘డీఆర్‌సీ’ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేల తీవ్ర అసంతృప్తి

ఇప్పటివరకూ కొన్ని రోడ్లకు భూసేకరణే పూర్తికాలేదు

భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చేసరికి రోడ్లు పూర్తికాకపోతే ఇబ్బందే: ఎంపీ శ్రీభరత్‌

కనెక్టవిటీ రోడ్లు పూర్తయ్యేంత వరకూ విజయవాడ, హైదరాబాద్‌లకు మరో రెండు వందేభారత్‌ రైళ్లు నడపండి: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

రహదారుల పనులు వేగంగా పూర్తి చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులకు ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశం

విశాఖ నగర ప్రతిష్ఠ మరింత పెంచేలా అభివృద్ధికి కార్యాచరణ

నగరంలో కాలుష్యం తగ్గించాలి

జిల్లా సమీక్షా సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ

విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిని అనుసంధానించేలా వీఎంఆర్‌డీఏ చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణంలో జాప్యంపై ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాది మే నెలాఖరుకల్లా రోడ్లు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారని, అయితే కొన్నిరోడ్లకు ఇంతవరకూ భూసేకరణే పూర్తికాలేదన్నారు. మరికొన్ని రోడ్ల నిర్మాణం నత్తనడకగా సాగుతోందని వ్యాఖ్యానించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల పురోగతిపై వీఎంఆర్‌డీఎ కమిషనర్‌ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మేకల్లా చాలావరకూ మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్యెల్యేలు విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు తదితరులు స్పందిస్తూ వీఎంఆర్‌డీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తోందని, అప్పటిలోగా రోడ్లు పూర్తికాకపోతే ఇబ్బందులు తప్పవని ఎంపీ ఆందోళన వ్యక్తంచేశారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు పూర్తికాకపోతే భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. అవి అయ్యేంత వరకూ విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికుల కోసం రెండు వందేభారత్‌ రైళ్లు నడిపేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీని కోరారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు నత్తనడకగా సాగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ విశాఖ నగర ప్రతిష్ఠ మరింత పెంచేలా సమ్మిళిత అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గ్లోబల్‌ నగరంగా పేరుపొందిన విశాఖలో వసతులు మరింత పెంచాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చేసరికి మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు పూర్తిచేయాలన్నారు. నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్‌కు సూచించారు. గ్రామ, పట్టణ పరిధిలో భూముల సర్వే పక్కాగా నిర్వహించాలని, రైతులకు స్కెచ్‌లు, పాస్‌ పుస్తకాలు అందజేయాలన్నారు. వీధి దీపాల నిర్వహణపై శ్రద్ధ వహించాలని, సచివాలయాల్లో వసతులు పెంచాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, దీనిపై సీఎం, మునిసిపల్‌ మంత్రికి నివేదిక ఇస్తానన్నారు. పోలవరం నీరు వచ్చేలోగా నీటి నిల్వ సామర్థ్యం పెంపుదలకు ప్రణాళికలు రూపొందించాలని, కొండవాలు ప్రాంతాల్లో ఇనుప విద్యుత్‌ స్తంభాల స్థానంలో సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటుచేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని, ఇందుకు ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ భవనాల రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు.

ఆరోగ్యశాఖపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ మాతా, శిశు మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకోవాలని, సిజేరియన్‌ కేసులు తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు వివరాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్యుల కొరత లేకుండా చూడాలన్నారు. కాలుష్యం తగ్గించి, గాలి నాణ్యత పెంచాలని, లేకపోతే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు. నగరంలో హిజ్రాలకు జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో ఉద్యోగాలు ఇచ్చినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలలో మెజారిటీ అంశాలు పరిష్కారం కావడంతో మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు.

శిశు మరణాలు తగ్గించాలి: ఎంపీ భరత్‌

మాతా, శిశు మరణాలు తగ్గించేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించాలి. సిజేరియన్ల కంటే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి. దీనివల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారనే విషయం ప్రజలకు తెలియజేయాలి. మాతా, శిశు మరణాలు, సిజేరియన్లు, సాధారణ ప్రసవాలపై పూర్తి వివరాలతో అధికారులు నివేదికలు ఇవ్వాలి. నగరంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి.

పాఠశాల భవనాలకు మరమ్మతులు: ఎమ్మెల్యే గణబాబు

పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయాలి. పాఠశాలల పర్యవేక్షణ విద్యా శాఖ చూస్తున్నా భవనాల నిర్వహణ జీవీఎంసీదేనని అధికారులు తెలుసుకోవాలి. ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఆర్వోబీ పనులు వెంటనే పూర్తిచేయాలి. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యం పెరగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

పటిష్టంగా భూముల క్రమబద్ధీకరణ: ఎమ్మెల్యే పల్లా

గాజువాకలో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 296ను పటిష్టంగా అమలు చేయాలి. గెడ్డల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలి. ఏపీఐఐసీ స్థలాలను సక్రమంగా వినియోగించాలి. స్టీల్‌ప్లాంటులో ఉన్న ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వినియోగంపై స్పష్టత ఇస్తూ బోర్డులు ఏర్పాటుచేయాలి.

పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలి: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

ఉత్తర నియోజకవర్గంలోని పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులతో గస్తీ ఏర్పాటుచేయాలి. టిడ్కో ఇళ్లు నిర్మాణాల్లో వేగం పెంచాలి.

‘సౌత్‌’లో రైతుబజారు ఏర్పాటుచేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

దక్షిణ నియోజకవర్గంలో రైతుబజారు ఏర్పాటుచేయాలి. ఎక్కువగా పేదవర్గాలు ఉంటున్న ఈ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందించాలి. వన్‌టౌన్‌లో లైబ్రరీ ఏర్పాటుచేయాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రొటోకాల్‌ పాటించడం లేదు.

కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు: ఎమ్మెల్యే పంచకర్ల

నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి. మాస్టర్‌ప్లార్‌ రోడ్ల విషయంలో భూములు కోల్పోయిన రైతులతో అధికారులు మాట్లాడాలి. రైతుల డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత వరకూ న్యాయం చేయాలి.

Updated Date - Jan 10 , 2026 | 01:30 AM