సదస్సు సూపర్ సక్సెస్
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:13 AM
నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు సూపర్ సక్సెస్ అయింది.
పెట్టుబడులకు రెండు రోజుల్లో రూ.9.89 లక్షల కోట్ల మేర ఒప్పందాలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 ప్రాజెక్టులకు ఎంవోయూలు
అనకాపల్లిలో అత్యధికం
విశాఖపై పర్యాటక సంస్థల ఆసక్తి
గాజువాకలో ఐటీఐల క్లస్టర్ అభివృద్ధికి రెన్యూ ఆసక్తి
వచ్చే ఏడాది కూడా విశాఖలోనే నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు సూపర్ సక్సెస్ అయింది. తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలకు విశాఖపట్నం వేదికగా మారింది. ముందస్తు ప్రణాళికతో అధికారులు ఏర్పాట్లు చేయడంతో నగరంలో మూడు రోజులు ఉత్సవ సందడి కనిపించింది. దీనిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముచ్చటపడి మూడో సదస్సును కూడా వచ్చే ఏడాది విశాఖపట్నంలోనే నిర్వహిస్తామని ప్రకటించడం విశేషం.
పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా రెండు రోజుల్లో మొత్తం 109 ఒప్పందాలు చేసుకోగా అందులో 15 శాతం సంస్థలు తమ పెట్టుబడులకు ఉమ్మడి విశాఖ జిల్లాను ఎంచుకున్నాయి. పునరుత్పాదక ఇంధన సంస్థలు, పెద్ద మొత్తంలో భూములు అవసరమైన పరిశ్రమలు అనకాపల్లి జిల్లాను ఎంపిక చేసుకోగా, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు విశాఖ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ప్రపంచం దృష్టిని ఆకర్షించగా, ఇప్పుడు గ్రీన్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను రూ.67 వేల కోట్లతో అనకాపల్లిలో ఏర్పాటు చేయడానికి రెన్యు ఎనర్జీ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని సామర్థ్యం ఒక గిగావాట్.
డేటా సెంటర్ల కేంద్రంగా అనకాపల్లి
విశాఖతో పాటు అనకాపల్లి జిల్లా కూడా ఇప్పుడు డేటా సెంటర్ల కేంద్రంగా మారుతోంది. ఇదే రెన్యు ఎనర్జీ సంస్థ పాలీ సిలికాన్, మెటలార్జికల్ సిలికాన్ తయారీ కేంద్రాన్ని కూడా అనకాపల్లిలో రూ.5 వేల కోట్లతో ఏర్పాటుచేస్తామని సంతకాలు చేసింది. రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా శాశ్వత అయస్కాంత తయారీ కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో రాంబిల్లిలో ఏర్పాటుచేయనున్నారు. పీఎం సేతు పథకం కింద విశాఖపట్నంలోని ఐదు ఐటీఐలతో కూడిన గాజువాక క్లస్టర్‌ను ‘రెన్యూ సెంటర్ ఫర్ టెక్నికల్ ఎక్స్‌లెన్స్’ గా అభివృద్ధి చేయడానికి రెన్యు ఎనర్జీ ముందుకు వచ్చింది. దీని ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రీవెన్ గ్రూప్, పీఆర్ హోటల్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్, ఎంటీజే ప్రైవేటు లిమిటెడ్, శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రా టెక్ అండ్ సర్వీసెస్‌లు ఒప్పందం చేశాయి.
పారిశ్రామికవేత్తలకు రక్షణ
‘‘రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చిన పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా కల్పిస్తాం. వారి రక్షణకు చట్టం తీసుకువస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులందరికీ ఈ చట్టం రక్షణగా ఉంటుంది. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించి పార్లమెంటులో ఆమోదించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అయితే, ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఆయా సంస్థలు నిర్ణీత కాలంలో పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తి ప్రారంభించాలి. ఎంవోయూల పురోగతిపై ప్రతి ఏడాది ఆడిట్ రిపోర్టు విడుదల చేస్తాం. ఏదైనా సంస్థ సకాలంలో పరిశ్రమ నెలకొల్పలేకపోతే వారి విషయంలో సమీక్షిస్తాం’’
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం
మీడియా సిటీ ఏర్పాటు
రేర్ ఎర్త్ మినరల్స్ హబ్‌గా నగరం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
విశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరాల వర్షం కురిపించారు. శుక్రవారం సాయంత్రం పెట్టుబడుల సదస్సు ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ, పరిసరాల్లో సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా నగరంలో మీడియా సిటీని నిర్మిస్తామన్నారు. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. న్యూక్లియర్ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తుల తయారీకి ఈ హబ్ దోహదపడుతుందన్నారు. ఇప్పటికే నగరంలో ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నామని సీఎం తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటును ఆదుకున్నామన్నారు. విశాఖ నుంచి వివిధ దేశాలకు సబ్ సీ కేబుళ్లు వేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖకు వచ్చే ప్రతినిధులు నగర వాతావరణం, ప్రజల ఆతిథ్యంతో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్-2026లో పది లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల్లో విశాఖ ప్రథమ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు.
అధికారులకు సీఎం ప్రశంసలు
అవార్డులు ప్రదానం
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. సమన్వయంతో సభను నిర్వహించిన తీరు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. సభ ముగింపు సందర్భంగా పలువురు అధికారులకు అవార్డులను ప్రధానం చేసి అభినందనలు తెలియజేశారు. స్థానిక ఎన్నికలతోపాటు ఆర్నబ్, మురసు తుఫాన్‌లు వచ్చినప్పుడు రాత్రి, పగలు పనిచేయడంతోపాటు మళ్లీ సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు శ్రమించిన ప్రతి ఉద్యోగినీ ఆయన అభినందించారు. అంతా కలిసి టీమ్ స్పిరిట్‌తో పనిచేసి సదస్సును విజయవంతం చేశారని కితాబునిచ్చారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. సదస్సు విజయవంతం చేయడంలో బెంచ్ మార్క్‌ను సృష్టించారన్న ఆయన...నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కృషిచేసిన పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. అభినందన సభలో మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సీఎం నుంచి అవార్డులు అందుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు ఎన్.యువరాజ్, కాటంనేని భాస్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తోపాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.
ఇవీ ఒప్పందాలు, పెట్టుబడులు, ఉద్యోగాలు
సెయింట్ గోబిన్ రూ.1,750 కోట్లు 500
ఫైజర్ హెల్త్ రూ.983 కోట్లు 150
ట్రైఫాస్ పవర్ రూ. 500 కోట్లు 200
విశాఖ బిల్డింగ్ మెటల్స్ రూ.300 కోట్లు 1,000
కాసా గ్రాండ్ రూ.250 కోట్లు 300
రుశ్కివ్ క్రయోజెనిక్స్ రూ.150 కోట్లు 400
ది పార్క్ హోటల్ రూ.115 కోట్లు 150
ప్రీమియర్ ఎనర్జీస్ రూ.100 కోట్లు 75
హెచ్‌టీఎల్ మెటల్ రూ.500 కోట్లు 750
వినాయగర్ బయోటెక్ రూ.75 కోట్లు 100
సస్టెయినబుల్ పార్క్ రూ.85 కోట్లు 450
దేవేంద్ర లెదర్ కంఫర్ట్స్ రూ.50 కోట్లు 200
రెహాబ్ టెక్నాలజీస్ రూ.45 కోట్లు 183