Share News

కమిషనర్‌ ఆదేశాలు బేఖాతరు!

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:31 AM

నగరంలోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల వద్ద ఏర్పాటుచేసిన సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘రాసా’ సంస్థపై జీవీఎంసీ అధికారులు ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు.

కమిషనర్‌ ఆదేశాలు బేఖాతరు!

సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమైన ‘రాసా’ నుంచి రూ.81 లక్షల రికవరీకి చాలాకాలం కిందట ఆదేశాలు

పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

రూ.56 లక్షలు మాత్రమే రికవరీ చేసేలా తాజాగా ఫైల్‌

వచ్చే ఏడాదికి కూడా వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు సిఫారసు

ఆగ్రహం వ్యక్తంచేసిన కమిషనర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల వద్ద ఏర్పాటుచేసిన సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘రాసా’ సంస్థపై జీవీఎంసీ అధికారులు ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. క్లాప్‌ వాహనాలు నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి సమీపంలోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (జీటీఎస్‌)కు తరలిస్తాయి. ఆ చెత్తను అక్కడ ఏర్పాటుచేసిన క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాల ద్వారా కంప్రెస్‌ చేసి ట్యాంకర్‌ మాదిరిగా ఉండే కంటెయినర్‌ హుక్‌ లోడర్‌లోకి లోడ్‌ చేస్తే, కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్వాసన వెదజల్లడం, పర్యావరణం కాలుష్యం కావడం వంటివి ఉండవు. జీవీఎంసీ పరిధిలో భీమిలి, ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లి (అనకాపల్లి)లో సీసీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, వాటి నిర్వహణ బాధ్యతను టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఒక్కో ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం కాంట్రాక్టర్లకు జీవీఎంసీ వాహనాలు, ఇంధనాన్ని సమకూర్చడంతోపాటు ఏడాదికి సగటున రూ.రెండు కోట్లు వరకూ చెల్లిస్తోంది. అందులో టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లి సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఆయా జీటీఎస్‌ కేంద్రాల నుంచి కాపులుప్పాడకు చెత్త తరలింపు సక్రమంగా జరగకపోవడంతో నిల్వలు కొండల్లా పేరుకుపోయాయి. దీనివల్ల దోమల వ్యాప్తి, దుర్వాసన వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆయా జీటీఎస్‌ కేంద్రాల పరిసర ప్రాంతాలవారు తరచూ ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీంతో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ కొన్నాళ్ల కిందట టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లి సీసీఎస్‌ ప్రాజెక్టుల పనితీరును తనిఖీ చేశారు. అక్కడ కొన్ని యంత్రాలు పనిచేయకపోవడంతోపాటు చెత్తను నిత్యం కాపులుప్పాడ తరలించాల్సిన హుక్‌ లోడర్లు సైతం కనిపించకపోవడంతో బాధ్యతలు చూస్తున్న ‘రాసా’ సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. బిల్లు తీసుకుంటూ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనాలు తిరగకపోయినా జీవీఎంసీ నుంచి డీజిల్‌ భారీగా డ్రా చేసినట్టు తేలడంతో వారి నుంచి మూడు జోన్‌లలో సుమారు రూ.81 లక్షలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం ఎందుచేతనో కమిషనర్‌ ఆదేశాలను అమలు చేయడంలో తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు. పైగా వచ్చే ఏడాది సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణకు టెండర్లు పిలవగా, టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ మళ్లీ ‘రాసా’కే దక్కేలా చక్రంతిప్పారు. సదరు సంస్థ నుంచి రూ.81 లక్షల రికవరీ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని పక్కనపెట్టేసి, పెండింగ్‌ బిల్లు చెల్లించడంతోపాటు ఇటీవల పిలిచిన టెండర్లలో రెండు సీసీఎస్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపాలని కోరుతూ కమిషనర్‌కు ఫైల్‌ పంపించారు. ఆ ఫైళ్లను పరిశీలించిన కమిషనర్‌ రాసా నుంచి రూ.81 లక్షలు రికవరీ చేయాల్సి ఉంటే కేవలం రూ.56 లక్షలు మాత్రమే రికవరీ చేసేలా ఫైల్‌ పెట్టడంతోపాటు ఎంబుక్‌పై కాంట్రాక్టర్‌తో సంతకాలు పెట్టించకుండా పెండింగ్‌ బిల్లు మొత్తం చెల్లించాలని కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తక్షణం పూర్తిస్థాయిలో రికవరీ చేసేలా ఎంబుక్‌ మీద కాంట్రాక్టర్‌తో సంతకాలు చేయించి తనకు ఫైల్‌ పెట్టాలని, తర్వాత టెండర్‌ అప్పగింతపై నిబంధనలు పరిశీలించి ముందుకువెళదామని ఆదేశించినట్టు తెలిసింది. కమిషనర్‌ ఆదేశాలను ఈసారైనా అధికారులు అమలు చేస్తారో లేదో చూడాలి.

Updated Date - Jan 03 , 2026 | 12:31 AM