కమిషనర్ ఆదేశాలూ బేఖాతరు!
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:20 AM
జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను కూడా ఇంజనీరింగ్ విభాగం అధికారులు బేఖాతరు చేశారు.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో 148 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను అంతర్గత బదిలీలు చేయాలని కేతన్‌గార్గ్ ఆదేశం
జాబితా సిద్ధమైనా ఉత్తర్వులు వెలువడని వైనం
రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రచారం
కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లపై తీవ్ర ఆరోపణలు
బినామీలతో కాంట్రాక్టులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను కూడా ఇంజనీరింగ్ విభాగం అధికారులు బేఖాతరు చేశారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయాలన్న ఆయన నిర్ణయాన్ని అమలుపరచకుండా తాత్సారం చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని భావించిన కమిషనర్ కేతన్‌గార్గ్...అందులో పనిచేస్తున్న 148 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను అంతర్గత బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఒక జాబితాను తయారుచేశారు. కానీ బదిలీ ఉత్తర్వులు జారీచేయడంలో జాప్యం చేస్తున్నారు. బదిలీలను నిలిపివేయాలని కొందరు ప్రజా ప్రతినిధులు ఒత్తిడే అందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.
ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లే కీలకపాత్ర పోషిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ప్రతిపాదిత పనులకు అంచనాలు తయారుచేసేందుకు కొలతలు వేయడం, సామగ్రి లెక్కించడం వంటి పనులు చేస్తుంటారు. అలాగే పని జరుగుతున్నప్పుడు నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూడడం, పూర్తయిన తర్వాత ఎంబుక్‌లో నమోదు సమయంలో ఏఈకి సహకరించడం చేయాలి. ఇందుకోసం ఇంజనీరింగ్ విభాగంలోని పబ్లిక్‌వర్క్స్ విభాగంలో సుమారు 148 మంది అవుట్‌సోర్సింగ్, పర్మనెంట్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది గత 15, 20 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. దీంతో వారే బినామీలతో పనులు చేయించడం, కుటుంబ సభ్యులను కాంట్రాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసి టెండర్లు వేయడం చేస్తున్నారు. తాము అంచనాలు తయారుచేసిన పనికి తామే టెండర్ వేసి, పని చేసి, కొలతలు తీసి ఎంబుక్‌లో రికార్డు చేసి బిల్లులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జీవీఎంసీకి నష్టం కలిగిస్తూ...వాళ్లు లాభపడుతున్నారు. ఒకవేళ తాము అనుకున్న వర్క్‌ను వేరొక కాంట్రాక్టర్ దక్కించుకుంటే...నిబంధనలు, నాణ్యత పేరుతో వారికి చుక్కలు చూపించి, అందులో నష్టపోయేలా చేస్తున్నారు. దీనిపై కాంట్రాక్టర్లు కొందరు చాలాకాలంగా జీవీఎంసీ కమిషనర్లుగా పనిచేస్తున్న అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కొంతమంది వర్క్ ఇన్‌స్పెక్టర్ల దందాపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో కమిషనర్ కేతన్‌గార్గ్ స్పందించారు. పబ్లిక్ వర్క్ప్ విభాగంలో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లందరినీ అంతర్గత బదిలీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో వర్క్ ఇన్‌స్పెక్టర్ల జాబితాను తయారుచేశారు. కానీ ఏమైందో గానీ ఇంతవరకూ బదిలీలు చేయలేదు. ఎక్కడివారు అక్కడే విధులు నిర్వస్తున్నారు. అయితే వర్క్ ఇన్‌స్పెక్టర్లు కొందరు బదిలీని ఎలాగైనా ఆపుకోవాలనే ఉద్దేశంతో ప్రజా ప్రతినిధులను కలిసి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని, అందుకే ఉత్తర్వులు వెలువడలేదనే ప్రచారం జరుగుతోంది.
పార్కులు, స్టేడియాల్లో ఉచితంగానే ప్రవేశం
ఫీజులు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీకి చెందిన పార్కులు, స్టేడియాల్లో ఉచితంగానే వాకింగ్/వ్యాయామం చేసుకోవచ్చునని కమిషనర్ కేతన్‌గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్కులు, స్టేడియాల్లో ఉదయం, సాయంత్రం నడక కోసం జీవీఎంసీ ఫీజు వసూలు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ఖండించారు. సుమారు 180 పార్కులను స్వయంగా, కొన్నిచోట్ల నివాసిత సంఘాలతో కలిసి జీవీఎంసీ నిర్వహిస్తోందన్నారు. అన్ని పార్కుల్లోనూ ప్రజలు ఉచితంగా వ్యాయామం చేసుకునే సదుపాయం కల్పించిందన్నారు. గాజువాక ప్రాంతంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను రూ.పది కోట్లు వ్యయంతో, స్వర్ణభారతి స్టేడియాన్ని రూ.16 కోట్ల వ్యయంతో, ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంను రూ.పది కోట్ల వ్యయంతో ఇటీవలే ఆధునీకరించామన్నారు. ఆ స్టేడియాల్లో కూడా ప్రవేశం ఉచితమేనన్నారు. నడకపై జీవీఎంసీ పన్ను విధిస్తోందంటూ కొంతమంది కావాలనే అసత్యప్రచారం చేస్తున్నారని, అలాంటివాటిని ప్రజలు నమ్మొద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.