Share News

కలెక్టర్‌ కొరడా

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:47 AM

ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిన పది మంది అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మెమోలు జారీచేశారు.

కలెక్టర్‌ కొరడా

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిన 10 మందికి మెమోలు

రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం

పీజీఆర్‌కు 164, రెవెన్యూ క్లినిక్‌లో 86 అర్జీలు

విశాఖపట్నం/మహారాణిపేట, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిన పది మంది అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మెమోలు జారీచేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీల పరిష్కారంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌ సంస్థలో ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారం కోసం తూతూమంత్రంగా ఎండార్స్‌మెంట్‌ ఇవ్వడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవీఎంసీలో 2, 4, 5, 6, 8 జోన్‌ల పరిధిలో అర్జీల పరిష్కారంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తంచేశారు. అందుకే ప్రజలు పదేపదే అర్జీలు ఇస్తున్నారని పేర్కొంటూ సంబంధిత జోనల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, డీఈ, ఏఎస్‌వోలకు మెమోలు జారీచేశారు. దీనిపై 48 గంటల్లో వివరణ తీసుకోవాలని పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి పి.శేషశైలజను ఆదేశించారు.

అర్జీలు సకాలంలో నాణ్యమైన పరిష్కారం ఇవ్వండి: కలెక్టర్‌

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అన్నారు. ఏ వారంలో వచ్చిన వినతులను ఆ వారంలో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో ఇటీవల వచ్చిన వినతులతోపాటు గత ఏడాదికాలంలో వచ్చిన వాటిపై ఆయన విశ్లేషణ చేశారు. అధికారులు ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌, ప్రీ ఆడిట్‌ విధానం, ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలను సవిరంగా పరిశీలించారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌అశోక్‌, హౌసింగ్‌ పీడీ సత్తిబాబు, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 164 వినతులు వచ్చాయి. కాగా కలెక్టరేట్‌ వీసీ హాలులో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్‌, సంగీత్‌మాధుర్‌, డిప్యూటీ కలెక్టర్లు సత్యసుధ, జ్ఞానవేణి, మధుసూదనరావు, కలెక్టరేట్‌ ఏవో బీవీ రాణి, 11 మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్‌లో 86 అర్జీలు వచ్చాయి.

చింతగట్ల వాసుల ఫిర్యాదు

పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కొందరు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో గ్రామ సర్పంచ్‌ జి.వెంకటలక్ష్మి నేతృత్వంలో ఫిర్యాదు అందజేశారు. ప్రజలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల దన్ను ఉందని చెబుతూ బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో నిర్మించిన ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు రాకుండా, పంచాయతీ పన్నులు వేయకుండా అధికారులను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని నాయకుల ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరారు.

Updated Date - Jan 13 , 2026 | 01:47 AM