Share News

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ తనిఖీలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:54 AM

సూపర్‌ బజార్‌ ప్రాంగణంలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ తనిఖీలు

పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశం

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):

సూపర్‌ బజార్‌ ప్రాంగణంలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ విధానం, డాక్యుమెంట్ల నమోదు, స్టాంపు డ్యూటీ లెక్కింపు, ఫీజుల వసూళ్లు వంటి అంశాలన్నీ సమగ్రంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్లకు అనుసరిస్తున్న స్లాట్‌ విధానం, అందులో ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. సేవల్లో లోపం ఉండకూడదని, పారదర్శకంగా పనులు జరగాలని, అందరినీ సమానంగా చూడాలని, దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్‌ పనులు జరగాలని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-2 కనకరత్నానికి సూచించారు. సిబ్బంది హాజరు, వారి పనితీరుపైనా దృష్టి పెట్టాలన్నారు. రిజిస్ట్రేషన్ల పనులపై అక్కడకు వచ్చిన వారితో మాట్లాడి అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహార శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా రిజిస్ట్రార్‌ ఉపేంద్ర కూడా పాల్గొన్నారు.


కార్పొరేటర్లకు రూ.25 వేల కూపన్లు!

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం సందర్భంగా పంపిణీ

కొందరికి రెండు, మూడు కూపన్లు ఇచ్చారని ఆరోపణలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం సందర్భంగా కార్పొరేటర్లకు రూ.25 వేల విలువైన కూపన్లను కానుకగా అందజేశారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. బడ్జెట్‌ సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు, జీవీఎంసీలోని ఉన్నతాధికారులకు ఏటా బహుమతులు అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది రూ.25 వేల విలువైన కూపన్లను అందజేయాలని మేయర్‌ ఆదేశించారు. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు కో-అప్షన్‌ సభ్యులు, అధికారులు...మొత్తం 200 మందికి కూపన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కూపన్లను ఇప్పటికే కార్పొరేటర్లు, అధికారులకు పంపిణీ చేశారు. అయితే మేయర్‌ పేరుతో ఐదు, డిప్యూటీ మేయర్లు ఇద్దరి పేరుతో మూడేసి, స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు రెండేసి చొప్పున కూపన్లు ఇచ్చారని ఆరోపిస్తూ కొందరు కార్పొరేటర్లు సిబ్బందితో వాదనకు దిగడం జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా తమకు ఇచ్చిన కూపన్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు ప్రకటించారు. మూర్తియాదవ్‌ తన కూపన్‌ను ఏడీసీ వర్మకు తిరిగి అందజేయగా, గంగారావు బుధవారం తిరిగి ఇస్తానని తెలిపారు.


వెయ్యి కిలోల రేషన్‌ బియ్యం స్వాధీనం

మల్కాపురం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ప్రకాశ్‌నగర్‌ పరిధిలోని బాపూజీ కాలనీలో గల ఓ ఇంట్లో పోలీసులు మంగళవారం పెద్దఎత్తున రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. ఇరవై ఐదు కిలోల బరువు కలిగిన 40 బ్యాగ్‌లను (సుమారు వెయ్యి కిలోలు) గుర్తించారు. బియ్యం గురించి ఇంటి యజమానిని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో వాటిని స్టేషన్‌కు తరలించారు. రేషన్‌ బియ్యం పంపిణీ మొదలుపెట్టి రెండు రోజులు కాకముందే ఇంత పెద్దఎత్తున పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈ బియ్యం ఏ డిపో నుంచి వచ్చాయి?, ఎవరు తీసుకువచ్చారనే వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


నో హెల్మెట్‌, నో పెట్రోల్‌...

బంక్‌ల యజమానులకు గాజువాక ట్రాఫిక్‌ సీఐ సూచన

గాజువాక, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):

హెల్మెట్‌ ధరించని వాహనచోదకులకు పెట్రోల్‌ పోయవద్దని బంకుల యజమానులను గాజువాక ట్రాఫిక్‌ సీఐ షేక్‌ హుస్సేన్‌ కోరారు. ఆయన మంగళవారం పెట్రోల్‌ బంక్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నో హెల్మెట్‌, నో పెట్రోల్‌...నిబంధనను పక్కాగా అమలు చేయాలని సూచించారు. హెల్మెట్‌ ధరించడం వల్ల కలిగే లాభాలపై బంకుల్లో ఫెక్ల్సీలు ఏర్పాటుచేయాలని సూచించారు. అదేవిధంగా పెట్రోల్‌ బంక్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా నో హెల్మెట్‌, నో పెట్రోల్‌...ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శాంతారాం, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:54 AM