Share News

కేజీహెచ్‌లో కలెక్టర్‌ తనిఖీలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:16 AM

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ శనివారం కింగ్‌ జార్జి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కేజీహెచ్‌లో కలెక్టర్‌ తనిఖీలు

కట్టు వేయడానికి లంచం తీసుకున్నారని రోగి ఫిర్యాదు

విచారణ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశం

సాయంత్రానికి ఉద్యోగి తొలగింపు

విశాఖపట్నం/మహారాణిపేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ శనివారం కింగ్‌ జార్జి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జి.మాడుగులకు చెందిన గిరిజన మహిళకు పోస్టుమార్టం నిర్వహణ, పార్థివదేహం తరలింపునకు ‘మహాప్రస్థానం’ అంబులెన్స్‌ సమకూర్చడంలో జాప్యం జరిగిందని మీడియాలో వార్తలు రావడంతో కలెక్టర్‌ ఆస్పత్రిలో పరిస్థితులు తెలుసుకోవడానికి తనిఖీలు చేపట్టారు. మంటల్లో గాయపడిన వారికి చికిత్స చేసే బర్న్స్‌ వార్డ్‌, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాలకు వెళ్లి రోగులు, వారి బంధువులతో అందుతున్న చికిత్స, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఓ రోగి బంధువు తమకు కట్టు కట్టడానికి ఉద్యోగి ఒకరు రూ.100 లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఉచిత సేవలు అందించాల్సిన ఆస్పత్రిలో లంచాలు తీసుకోవడం ఏమిటని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణిని నిలదీశారు. తక్షణమే దీనిపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో లంచాలు తీసుకోకూడదని, ఉచితంగానే సేవలు అందుతాయని ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మళ్లీ ఎవరైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆగమేఘాలపై విచారణ

కలెక్టర్‌ ఆదేశాలతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి విచారణ చేపట్టారు. ముంబైకు చెందిన క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ తరపున అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పారిశుధ్య కార్మికుడిగా సిరిపురపు మధు పనిచేస్తున్నాడు. రోగి బంధువుల నుంచి మధు లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఆ విషయం సంస్థకు తెలియజేశారు. దాంతో సదరు ఉద్యోగి మధును ఆ సంస్థ జోనల్‌ ఇన్‌చార్జి ఎం.రామసుబ్బారావు విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాటి కాపీలను కలెక్టర్‌కు, సూపరింటెండెంట్‌కు పంపించారు.

కట్లు కట్టేది పారిశుధ్య కార్మికులా..?

కేజీహెచ్‌లో రోగులకు కట్లు పారిశుధ్య కార్మికులు కడుతున్నారనే విషయం కలెక్టర్‌ ఆకస్మిక పర్యటనతో వెలుగులోకి వచ్చింది. రోగుల గాయాలను శుభ్రం చేసి, బ్యాండేజీలు కట్టేందుకు వేరే సిబ్బంది ఉన్నారు. వారు అందుబాటులో లేకపోవడంతో పారిశుధ్య కార్మికుడే ఆ పని చేసినట్టు తేలింది. శనివారం ఒక్కరోజే ఇలా జరిగిందా?, రోజూ అక్కడ అలాగే జరుగుతోందా?...అనే అనుమానాలు కలుగుతున్నాయి. మిగిలిన వార్డుల్లో కూడా అలాగే జరుగుతున్నదేమో విచారించి, తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.


ఆరోగ్య కేంద్రాలకు ‘ఎన్‌క్వాస్‌’ గుర్తింపు

జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పది విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌

25 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సర్టిఫికెట్లు

అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రికి కూడా...

ఓపీ, ఐపీ సేవలు, మౌలిక సదుపాయాలు, మందుల అందుబాటు, పరిసరాల పరిశుభ్రత, తదితర అంశాల ఆధారంగా ఎంపిక

రూ.1.2 లక్షల నుంచి రూ.మూడు లక్షల వరకూ ప్రోత్సాహకం

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వాస్‌) గుర్తింపు పొందాయి. రోగులకు అందించే సేవలు, పరిశుభ్రత, ఓపీ, ఐపీ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఎన్‌క్వాస్‌’ సంస్థ ఈ గుర్తింపు ఇచ్చింది. గడచిన ఏడాది (2025)కిగాను జిల్లాలో 38 ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కించుకున్నాయి. వీటిలో ఒక ప్రాంతీయ ఆస్పత్రి, మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పది విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, 25 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ కేంద్రాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3 లక్షలు చొప్పున, పది విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు రూ.1.2 లక్షలు, 25 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌కు రెండు లక్షల చొప్పున అందించనుంది. ఈ మొత్తాన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు, అదనపు సౌకర్యాల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది.

ఈ సేవలను గుర్తించి..

ఆస్పత్రుల్లో అందించే సేవలు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘ఎన్‌క్వాస్‌’ గుర్తింపు కేంద్రం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా చేసుకుని కేంద్రం నియమించిన నిపుణుల బృందం నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తుంది. వంద మార్కులకుగాను 80కుపైగా సాధించిన ఆరోగ్య కేంద్రాలకు ఈ గుర్తింపు లభిస్తుంది. ఓపీ, ఐపీ సేవలు, మౌలిక సదుపాయాలు, మందుల అందుబాటు, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిర్వహించే పరీక్షలు, ఆన్‌లైన్‌ నమోదు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహణ, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, చికిత్స పొందిన రోగుల అభిప్రాయాల ఆధారంగా ఎన్‌క్వాస్‌ సంస్థ ఈ సర్టిఫికెట్లను జారీచేస్తుంది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ గుర్తింపు ఇస్తుందని జిల్లా క్వాలిటీ మేనేజర్‌ డాక్టర్‌ రావాడ భాస్కర్‌ చెప్పారు.

వీటికి గుర్తింపు..

మధురవాడ, గాజువాక, దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మజ్జివలస, మూలకుద్దు, రాంపురం, చిప్పాడ, టి.నగరంపాలెం, గంధవరం, తునివలస, పెదగాడి, వెల్లంకి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రి, మరో 26 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కించుకున్నాయి.

మరిన్ని గుర్తింపు పొందేలా..

జిల్లాలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, గడచిన ఏడాది మూడు ఆరోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభించింది. అలాగే 54 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఉండగా పదింటికి, 66 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌కుగాను 25 కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్‌ దక్కింది. ఈ ఏడాది మిగిలిన వాటికి కూడా గుర్తింపు వచ్చేందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించింది. ఈ ఏడాదిలో కనీసం 50 కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 01:16 AM