ఐటీ విభాగంలో వసూల్‌రాజా!
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:12 AM
జీవీఎంసీలోని కొన్ని విభాగాలు అవినీతికి కేంద్రాలుగా మారాయి.
బిల్లులకు బడ్జెట్ కోడ్ మార్చాలంటే రూ.పది వేలు డిమాండ్
ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్ల ఫిర్యాదు?
...అయినా మారని తీరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలోని కొన్ని విభాగాలు అవినీతికి కేంద్రాలుగా మారాయి. ఇటీవల ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుని కాంట్రాక్టర్ అవతారం ఎత్తడంతోపాటు బిల్లులు అధికంగా తీసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో డీఈఈ సహా ఐదుగురిని కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ విషయంపై చర్చ జరుగుతుండగానే ఐటీ విభాగంలో పనిచేస్తున్న మరొక ఉద్యోగి వసూలు బాగోతం వెలుగుచూసింది.
జీవీఎంసీ పరిధిలో ఏటా రూ.500 కోట్లకుపైగా విలువైన పనులు జరుగుతుంటాయి. వార్షిక బడ్జెట్ తయారు చేసినప్పుడే ఏ పనికి ఎంత ఖర్చవుతుందో (హెడ్‌లు) అంచనాలను తయారుచేసి, ఆయా మొత్తాలను హెడ్‌ల వారీగా పొందుపరుస్తారు. బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా హెడ్‌లలో పొందుపరిచిన మొత్తం నుంచి పనులకు టెండర్లు పిలుస్తారు. ఏ హెడ్ నుంచి పనులకు టెండరు పిలిస్తే అదే హెడ్ నుంచి కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా హెడ్‌లో బడ్జెట్ పూర్తిగా ఖర్చయిపోతే, దాని కింద పిలిచిన పనులకు బిల్లులు చెల్లించాలన్నా, కొత్త వర్కును మరొక హెడ్ నుంచి పిలవాలన్నా సరే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత బడ్జెట్ హెడ్‌ను మార్చాల్సి ఉంటుంది. సాధారణంగా జీవీఎంసీ పరిధిలో ఒక్కోసారి కొన్ని హెడ్‌లలో కేటాయించిన మొత్తం వేగంగా ఖర్చయిపోతుంది. అలాంటప్పుడు బడ్జెట్ మిగిలి ఉన్న మరొక హెడ్ నుంచి నిధులను వాడుతుంటారు. కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం, వసతుల కల్పన వంటి పనులకు అదే హెడ్ నుంచి బిల్లులు చెల్లించాలి.
బడ్జెట్ హెడ్ మార్చాలంటే రూ.పది వేలు ఇవ్వాల్సిందే..
ఇంజనీరింగ్ విభాగంలో ఒక హెడ్ నుంచి టెండర్లు పిలిచిన తర్వాత పనులు పూర్తయ్యి...బిల్లు ఫైల్ ఆడిట్‌కు వెళ్లే ముందు సంబంధిత డీబీలో బడ్జెట్ అందుబాటు గురించి పరిశీలిస్తారు. నిధులు లేవని గుర్తిస్తే హెడ్‌ను మార్చాలని ఐటీ విభాగానికి పంపిస్తారు. అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగి ...బడ్జెట్ హెడ్ మార్చడం చాలా పెద్ద పని అని, అందుకు చాలామంది నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటూ కాంట్రాక్టర్‌లకు చెప్పి, పరోక్షంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇంతవరకూ రూ.వెయ్యి ఇస్తే బడ్జెట్ హెడ్ మార్చే ప్రక్రియ జరిగిపోయేది. కానీ ఇటీవల కాలంలో జీవీఎంసీలో ఇతర అధికారులు తీసుకునే మొత్తాలు పెంచేశారని, అకౌంట్స్ విభాగంలోని కొందరు ఉద్యోగులు, ఫైనాన్స్ అడ్వయిజర్ పేషీలోని సిబ్బంది అడుగుతున్నారంటూ రూ.పది వేలు వరకు డిమాండ్ చేస్తున్నట్టు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, ఫోన్ చేసి ఐటీ ఉద్యోగిని హెచ్చరించినట్టు సమాచారం. అయినప్పటికీ ‘వాళ్లు లంచాలు తీసుకోవడం లేదా?, నాకు ఎందుకు ఇవ్వరు? ఇచ్చే వరకూ ఆ పని పెండింగ్‌లోనే ఉంటుందని’ సదరు ఉద్యోగి బహిరంగంగానే చెబుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించి ఐటీ విభాగంలో చాలాకాలంగా తిష్ఠ వేసుకుని కూర్చున్న వసూల్‌రాజాను సాగనంపాలని వేడుకుంటున్నారు.