Share News

మన్యంపై చలి పులి పంజా

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:46 PM

మన్యంపై చలి పులి పంజా విసిరింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత అధికమైంది. దీంతో జనం గజగజ వణుకుతున్నారు.

మన్యంపై చలి పులి పంజా
పాడేరు పట్టణంపై కమ్మేసిన పొగమంచు

వణుకుతున్న గిరిజనం

జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

చలి మంటలు కాగుతున్న ప్రజలు

పాడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మన్యంపై చలి పులి పంజా విసిరింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత అధికమైంది. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. ఆదివారం జి.మాడుగులలో 3.5 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 3.8, చింతపల్లిలో 3.9, ముంచంగిపుట్టులో 4.3, పెదబయలులో 4.8, హుకుంపేటలో 6.6, కొయ్యూరులో 11.2, అనంతగిరిలో 15.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో కొన్నాళ్లుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో గిరిజనులు వణుకుతున్నారు. అలాగే ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు పొగ మంచు కురవడం, మధ్యాహ్నం మాత్రమే అరకొరగా ఎండ కాస్తుండడంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జి.మాడుగులలో..

మండలంలోని చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా సంక్రాంతి తరువాత చలి తగ్గిపోతుందని అందరూ భావించారు. అయితే దానికి భిన్న్గంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ చతి తీవ్రత అధికమవుతోంది. మండలంలో ఆదివారం 3.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఫలితంగా విపరీతంగా మంచు కురిసింది. కొన్నిచోట్ల మంచు గడ్డలు ఏర్పడ్డాయి. ఉదయం మంచుతో కూడిన చలి ధాటికి జనాలకు ఇక్కట్లు తప్పడం లేదు.

చింతపల్లిలో..

గిరిజన ప్రాంత ప్రజల వెన్నులో చలి పుడుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదుకావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఆదివారం చింతపల్లిలో 3.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజులుగా గిరిజన ప్రాంతంలో ఐదు కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ప్రజలు 24గంటలు ఉన్ని దుస్తులను ధరించి కనిపిస్తున్నారు. ప్రతి ఇంటిలోను చలి మంటలు వెలుగుతున్నాయి. కాగా రాగల ఐదు రోజుల్లో గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 10:46 PM