Share News

నిప్పుల కొలిమిలా నగరం

ABN , Publish Date - May 17 , 2026 | 12:42 AM

ఒకప్పుడు వేసవి విడిది కేంద్రంగా పేరొందిన విశాఖపట్నం రానురాను వేడెక్కుతోంది.

నిప్పుల కొలిమిలా నగరం

ఏడాది ఏడాదికి పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతలు

మండుతున్న పారిశ్రామిక ప్రాంతం

గాజువాక, స్టీల్‌ప్లాంటు, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో హీట్‌ ఐలాండ్లు

కాంక్రీట్‌ నిర్మాణాలు, వాహనాలు విపరీతంగా పెరగడం, పచ్చదనం తగ్గడం కారణం

వర్షపాతం నమోదులో అసాధారణ తేడాలు

ఒకే నెలలో 135 నుంచి 158 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం

ఏయూ, త్రిపుల్‌ ఐటీ కొట్టాయం నిపుణుల అధ్యయనంలో వెల్లడి

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

ఒకప్పుడు వేసవి విడిది కేంద్రంగా పేరొందిన విశాఖపట్నం రానురాను వేడెక్కుతోంది. నగరీకరణ, పరిశ్రమల విస్తరణ, లక్షలకు చేరిన వాహనాలు...ఇలా అనేక అంశాలతో పెరిగిన కాలుష్యం కారణంగా ఏడాదిలో ఎక్కువ రోజులు వేడి వాతావరణం నెలకొంటోంది. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతోనే వర్షపాతంలో అసాధారణ తేడాలు నమోదవుతున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఇంజనీరింగ్‌ విభాగం, కొట్టాయం త్రిఫుల్‌ ఐటీకి చెందిన ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు కలిసి చేసిన అధ్యయనంలో నిర్ధారణ అయ్యింది. అధ్యయన వివరాలు తాజాగా పలు పరిశోధక జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

నగరంలో వాతావరణ మార్పులు తీవ్రరూపం దాల్చుతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇందుకోసం ఏయూ, కొట్టాయం త్రిఫుల్‌ ఐటీ నిపుణులు 1991 నుంచి 2019 వరకు సుమారు 30 సంవత్సరాల వివరాలు సేకరించి విశ్లేషణ చేశారు. వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1 నుంచి 28.1 డిగ్రీల వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో నగరంలో ‘హీట్‌ ఐలాండ్‌’ల సంఖ్య పెరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. కాంక్రీట్‌ నిర్మాణాలు, మట్టి రోడ్లు బదులు సిమెంట్‌ రోడ్లు, పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, భూ వినియోగ మార్పులు, తీరప్రాంతంలో భౌగోళిక లక్షణాలు కలిసి నగరంలో ప్రత్యేకమైన సూక్ష్మ వాతావరణ (మైక్రో క్లైమేట్‌) మార్పులను తీసుకువస్తున్నాయని గుర్తించారు. దీని ప్రభావంతో పగటిపూటే కాకుండా రాత్రిపూట వాతావరణం చల్లబడకుండా ఉండేలా మార్పులు చెందుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.

గాజువాక, స్టీల్‌ప్లాంటు, ఎయిర్‌పోర్టు ప్రాంతాలు ప్రధాన హీట్‌ ఐలాండ్లుగా మారాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలుగా మారుతున్నారుు. దీనికి విరుద్ధంగా పద్మనాభం వంటి గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఉష్ణోగ్రతలతో చల్లగా ఉంటున్నాయి. ఈ అధ్యయనం నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య వాతావరణంలో మార్పులను తెలియజేస్తోంది. వర్షపాతం విషయంలోనూ గణనీయమైన మార్పులు వచ్చినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఒకే నెలలో 135 నుంచి 158 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. భారీవర్షం కురిసిన సమయంలో మురుగు కాల్వలు పొంగి పొర్లి లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలతో పాటు తేమ కూడా పెరిగినట్టయితే ప్రజల్లో ఆరోగ్య సమస్యలు (ముఖ్యంగా వృద్ధులు, పిల్లల్లో) తలెత్తే అవకాశం ఉందని గుర్తించారు. పెరుగుతున్న నగరీకరణ, పరిశ్రమలు, భూ వినియోగ మార్పులతో పట్టణంలో వరదలు, వడగాడ్పులు, నీటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. పరిశోధనల్లో ఏయూ జియో ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యుడు గుర్రం మురళీకృష్ణతోపాటు సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ శివపార్వతి, అంజు యజ్జల, రాజేశ్వరి ఎరసాలలో భాగస్వామ్యులయ్యారు.

పెరుగుతున్న వాతావరణ మార్పులను తట్టుకునేలా చర్యలు

ఆచార్య గుర్రం మురళీకృష్ణ, ఏయూ జియో ఇంజనీరింగ్‌ విభాగం

వాతావరణ మార్పులు ఇప్పటికే నగరంపై ప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. గడచిన మూడు దశాబ్దాలుగా కాంక్రీట్‌ నిర్మాణాలు, పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, కాలనీల విస్తరణ, పచ్చదనం తగ్గడంతో వాతావరణం వేడెక్కుతుంది. దీంతో ఉష్ణాన్ని నిల్వ చేసుకునే గుణం పెరిగి ఆకస్మికంగా భారీవర్షాలకు నగరం ప్రభావితమవుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పచ్చదనం పెంపు, సుస్థిర పట్టణ ప్రణాళిక అమలు, వర్షపు నీటి నిర్వహణ, హీట్‌ మిటిగేషన్‌ చర్యలు తక్షణమే అమలు చేయాలి.

Updated Date - May 17 , 2026 | 12:42 AM