న‘గరం గరం’!
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:21 AM
నగరం గరం గరంగా మారుతోంది.
కాలుష్యం కారణంగా వేడెక్కుతున్న విశాఖ
మార్చి ప్రారంభం నుంచే ఠారెత్తిస్తున్న ఎండలు
శీతాకాలం మినహా వేడి వాతావరణమే
పెరిగిపోతున్న వాహనాలు
సెగ పుట్టిస్తున్న పరిశ్రమల కాలుష్యం
నగరమంతటా హీట్ ఐల్యాండ్లు
నేడు ప్రపంచ వాతావరణ దినోత్సవం
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
నగరం గరం గరంగా మారుతోంది. పెరిగిపోతున్న వాహనాలు, భవన నిర్మాణాలకు తోడు పరిశ్రమల నుంచి విచ్చలవిడిగా కాలుష్యం వెలువడుతుండడంతో కేవలం శీతాకాలం మినహా ఏడాది పొడవునా వేడి వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే చల్లన తీరంగా పేర్గాంచిన విశాఖ నిత్యం మండు వేసవిని తలపించేలా మంటలెక్కించనుంది. నేడు ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
సాధారణంగా మార్చి నుంచి ఎండలు ప్రారంభమవుతాయి. ఈఏడాది ఫిబ్రవరి మూడోవారం నుంచి మొదలయ్యాయి. అంతేకాదు పగలు ఎండ, రాత్రి చలితో విచిత్రమైన వాతావరణం నెలకొంది. నగరంలో శీతాకాలం మినహా మిగిలిన అన్ని నెలల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతోంది. భారత వాతావరణశాఖ పరిఽధిలో వాల్తేర్, ఎయిర్‌పోర్టులో రోజువారీ వాతావరణ వివరాలు నమోదువుతుంటాయి. వాల్తేర్‌లోని తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో 1973 నుంచి 2021 వరకు ఏడాది సగటు కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలు, సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9గా నమోదైంది. అంతకుముందు సగటు ఉష్ణోగ్రతల కంటే కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎయిర్‌పోర్టులో 1969 నుంచి 2021 వరకు సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 24.1, సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 32.9గా నమోదైంది. ఇదిలావుండగా విశాఖ ఎయిర్‌పోర్టులో 1967 ఫిబ్రవరి 22న 38 డిగ్రీలు, 1982 మార్చి 28న 39.3, 1965 ఏప్రిల్ 29న 40.5, 1978లో మే 20న 44.9 డిగ్రీలు. 2013 మే 25న 47.0, 2015 మే 25న 45 డిగ్రీలు నమోదైంది. వాల్తేర్ తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో 1979 మార్చి 26న 36.7, అదే ఏడాది ఏప్రిల్ 21న 36.5, 1978 మే 19న 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్లోబల్‌వార్మింగ్‌తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో 2013 మే 25న 47.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పంది. పలుమార్లు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవడం విశాఖలో వేడి వాతావరణానికి సంకేతమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్గుతున్న వర్షపాతం
గతంలో నగరం, పరిసరాల్లో ప్రతిరోజు వర్షం కురిసేదని వృద్ధులు చెబుతుంటారు. కాగా ప్రస్తుతం అటువంటి వాతావరణం మాయమై చివరకు వర్షాకాలంలోనూ అప్పుడప్పుడు వర్షం కురవడంలేదు.
గత ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టులో 32.7 మి..మీ.లు, మార్చిలో 12.5 మి.మీ.ల వర్షం కురవాలి. ఈనెలలో రెండురోజుల క్రితం తేలికపాటి వర్షం కురిసింది. విశాఖలో సాలీనా 1120 మి.మీ.లు వర్షపాతం నమోదుకావాలి. ఎయిర్‌పోర్టులో 1033.2, వాల్తేర్‌లో 1015.9 మి.మీ. ల వర్షం పడాలి. కాగా వాల్తేర్ తుఫాన్‌హెచ్చరిక కేంద్రంలో నమోదైన వర్షపాతం వివరాలు పరిశీలిస్తే ప్రీమాన్‌సూన్ సీజన్ (మార్చి నుంచి మే), నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుంచి సెప్టెంబరు) వరకు వర్షపాతం పెరిగి అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తగ్గుతోంది. ఎయిర్‌పోర్టులో సెప్టెంబరులో వర్షపాతం పెరుగుతుంది. రుతుపవనాలు, ప్రీమాన్‌సూన్ సీజన్‌లలో తగ్గుతున్నాయి. రోజంతా వర్షం, ముసురు వాతావరణం క్రమంగా మాయమైపోతోంది. వేసవిలో వర్షపాతం తగ్గడం వేడి వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
15 లక్షలకు చేరిన వాహనాలు
నగర జనాభా సుమారు 25 లక్షలు. ఏటా పెరుగుతూనే ఉంది. విశాఖలో ప్రస్తుతం 15 లక్షల వాహనాలున్నాయని రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 20 శాతం కాలం తీరినవే. గ్రీన్‌టాక్స్ కట్టి నడుపుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో సొంత వాహనం లేదా ఆటోపై ఆధారపడుతున్నారు. దీంతో వాహన కాలుష్యం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రధాన కూడళ్లలో కాలుష్యంతో హీట్‌ఐలాండ్స్‌గా మారి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సత్యం జంక్షన్, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ, గాజువాక, వెంకోజీపాలెం, జగదాంబజంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలు, డాబాగార్డెన్స్ తదితర కూడళ్లు వాహనాల రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వీటికితోడు పారిశ్రామిక కాలుష్యం హద్దులు దాటిపోయింది. పోర్టు నుంచి రేగుతున్న ధూళి కాలుష్యం వాతావరణం మార్పులకు కారణమవుతోంది.
ఏసీ అనివార్యం..
చల్లగా ఉండే నగరంలో ఇప్పుడు ఏసీ తప్పనిసరిగా మారింది. రెండు దశాబ్దాల క్రితం ఫ్యాను సరిపోయేది. కానీ ఇప్పుడు ఏసీ నిత్యావసరమయింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఏసీలు ఏర్పాటుచేశారు. మాల్స్, దుకాణాలు, సినిమా థియేటర్లన్నీ ఏసీతోనే నడుస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు ఇదో మచ్చుతునక. భవిష్యత్తులో వాతావరణం మరింత వేడెక్కుతుందని, ఈ క్రమంలో ఎల్‌నినో ప్రభావం చూపుతుందని, దీంతో జూలై వరకు వేసవి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.