నగరం అస్తవ్యస్తం
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:18 AM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం అస్తవ్యస్తమైంది.
భారీవర్షాలు, గాలులకు కూలిన చెట్లు, అపార్టుమెంట్‌ల ప్రహరీ గోడలు
ఆరిలోవ, సీతకొండ వద్ద జారిపడిన కొండచరియలు
15 చోట్ల పొంగిన గెడ్డలు
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ల పర్యటన
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం అస్తవ్యస్తమైంది. గెడ్డలు పొంగి రోడ్లపై వర్షం నీరు ప్రవహించింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల అపార్టుమెంట్ల, పాఠశాలల ప్రహరీ గోడలు వర్షానికి బాగా నాని కూలిపోయాయి. నగరంలో కొన్నిచోట్ల చెట్లు రోడ్లపై కూలడంతో సహాయక బృందాలు వాటిని తొలగించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పరిస్థితిని అంచనా వేసి బాధితులకు సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ స్వయంగా సందర్శించారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్ కూడా తమ నియోజకవర్గాల పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. సహాయక చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారు.
ఫేకర్ లేఅవుట్‌లోని అపార్టుమెంట్ ప్రహరీ గోడ బుధవారం అర్ధరాత్రి కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే అర్ధరాత్రి సమయమైనప్పటికీ జీవీఎంసీ కమిషనర్ అక్కడకు వెళ్లి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి తక్షణ భద్రతాచర్యలపై ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా మధురవాడలోని రాకాన్ అపార్టుమెంట్ వద్ద వర్షం నీరు నిలిచిపోవడంతో అపార్టుమెంట్ ప్రహరీగోడ కూలిపోయింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు వెళ్లి అపార్టుమెంట్‌లోని 15 కుటుంబాలకు చెందిన 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మధురవాడ డీమార్ట్ వెనుక ప్రాంతంలో భారీగా వర్షం నీరు చేరడంతో ఒక ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. వరదలో చిక్కుకున్న నలుగురిని సహాయసిబ్బంది రక్షించారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ హౌసింగ్ కాలనీ జలమయమైంది. ఇళ్లలోకి వర్షం నీరు చేరిపోయింది. షీలానగర్ సమీపంలోని జగ్గయ్యపాలెంలో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బీచ్‌రోడ్డులో సీతకొండ వద్ద కొండచరియలు విరిగి రోడ్డుపై పడడంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో రోడ్డుని మూసేసి వాహనాలు వెళ్లకుండా నియంత్రించారు. జేసీబీలతో కొండచరియలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. జ్ఞానాపురం ఎఫ్‌సీఐ గోడౌన్ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. సహాయక బృందాలు వర్షం నీటిని బయటకు పంపించే పనులు చేపట్టారు. ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ జ్ఞానాపురంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఆంథోని నగర్‌లోని సెయింట్ ఆంథోని పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఎంవీపీ కాలనీలో ఒక అపార్టుమెంట్‌లోకి కొండచిలువ చొరబడగా, స్థానికులు ఒడుపుగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీ, ఆరిలోవ ప్రియదర్శిని కాలనీ వంటి ప్రాంతాల్లో కొండచరియలు జారిపోవడంతో కొండవాలు ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆయా ప్రాంతాలకు వెళ్లి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. పలుప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 130 వరకు విజ్ఞాపనలు/ఫిర్యాదులు జీవీఎంసీ అధికారులకు అందగా వాటిలో నూట పద్దెనిమిదింటిని తక్షణ సహాయక బృందాలు పరిష్కరించాయి. జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయగా, అందులో 38 మందిని ఉంచారు. నగరవ్యాప్తంగా 81 చెట్లు కూలిపోగా, 14 ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. 15 గెడ్డల్లో వర్షంనీరు పొంగిరోడ్డుపైకి ప్రవహించింది. 11 చోట్ల ప్రహరీ గోడలు కూలిపోగా, ఆరు చోట్ల కొండచరియలు జారిపోయాయి.
రికార్డు స్థాయి వర్షపాతం
12 గంటల్లో తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో 280 మి.మీ.నమోదు
ఇప్పటివరకూ సెప్టెంబరు నెలలో ఇదే అత్యధికం
జిల్లాలో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 319.3 మి.మీ. వర్షపాతం
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వాల్తేరులోని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో బుధవారం సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు 280 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఎండాడలో 277.8 మి.మీ. కురిసింది. విశాఖ జిల్లాలో మొత్తం 53 ప్రాంతాల్లో 200 మి.మీ., అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో వందచోట్ల 100 నుంచి 200 మి.మీ. మధ్య కురిసింది.
భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం 2005 సెప్టెంబరు 20వ తేదీన విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రంలో 195.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకూ అదే రికార్డు. దానిని అధిగమించి ఈ ఏడాది సెప్టెంబరు 24వ తేదీన 280 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టులో 2005 సెప్టెంబరు 20న 161.2 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, ఈనెల 24న (గడచిన 24 గంటల వ్యవధి) 200 మి.మీ. వర్షపాతం కురిసింది. కాగా ఎండాడలో 277.8 మి.మీ., విశాఖ రూరల్ తహశీల్దారు కార్యాలయంలో 271.2 మి.మీ. కురిసినా అక్కడ గతంలో అత్యధిక వర్షపాతం వివరాలు అందుబాటులో లేవు.
నైరుతి రుతుపవనాల సీజన్ అంటే జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు విశాఖ జిల్లాలో 588 మి.మీ. వర్షపాతం నమోదుకావాలి. జూన్ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 544.5 మి.మీ. వర్షపాతం నమోదు కావల్సి ఉండగా, 540 మి.మీ. వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు 224.7 మి.మీ. వర్షపాతం కురవగా, 21వ తేదీ నుంచి గురువారం వరకూ 319.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 21వ తేదీ నుంచి 24 వరకు, బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లాలో కురిసిన వర్షపాతం ఒక రికార్డుగా పరిగణించవచ్చునని జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాసరావు తెలిపారు.