Share News

నగరం కకావికలం

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:14 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ విశాఖను కకావికలం చేసింది. సముద్ర తీరం ఛిన్నాభిన్నం అయింది. పర్యాటక ప్రాంతాలు దెబ్బతిన్నాయి.

నగరం కకావికలం

తుఫాన్‌తో అతలాకుతలం

దెబ్బతిన్న పర్యాటక ప్రాంతాలు

నేలకూలిన మహా వృక్షాలు

విద్యుత్‌, తాగునీటి సరఫరాకు అంతరాయం

అధికారుల సమన్వయంతో కోలుకుంటున్న వైనం

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఆర్నబ్‌ తుఫాన్‌ విశాఖను కకావికలం చేసింది. సముద్ర తీరం ఛిన్నాభిన్నం అయింది. పర్యాటక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మహా వృక్షాలు సైతం నేలకూలాయి. జిల్లాలో మొత్తం 410 విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. విద్యుత్‌ సరఫరా దాదాపు స్తంభించిపోయింది. తాగునీటి సరఫరా కూడా కొన్ని ప్రాంతాలకు ఆగింది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి దగ్గరుండి తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించి సూచనలు చేయడంతో నగరం చాలావరకూ కోలుకుంది. కూలిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి అన్ని మార్గాల్లో రాకపోకలకు అవకాశం కల్పించారు. విద్యుత్‌ సరఫరా గురువారం రాత్రి తొమ్మిది గంటలకు 100 శాతం పునరుద్ధరణ జరిగింది. తాగునీటి సరఫరా కూడా పూర్తిస్థాయిలో జరిగినట్టు జీవీఎంసీ యంత్రాంగం వెల్లడించింది.

కైలాసగిరి మొత్తం ఆకులే

తుఫాన్‌ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో వీచిన గాలులకు కైలాసగిరిపై పలు చెట్లు కూలిపోయాయి. భారీవృక్షాల ఆకులు రాలిపోయాయి. వ్యూ పాయింట్లలో పర్యాటకులు పడిపోకుండా ఏర్పాటుచేసిన రెయిలింగ్‌లు వంకర్లు తిరిగాయి. రహదారులు దెబ్బతిన్నాయి. బీచ్‌ రోడ్డులో వీఎంఆర్‌డీఏకు చెందిన టీయూ-142 విమాన మ్యూజియం నుంచి పలు భాగాలు ఊడి కిందిపడ్డాయి. కురుసుర సబ్‌మెరైన్‌ వద్ద తీరం కోతకు గురైంది. తెన్నేటి పార్కులో వ్యూపాయింట్‌ పూర్తిగా దెబ్బతింది. బీచ్‌లోకి వెళ్లే మెట్లమార్గం పాడైంది.

సాగర్‌నగర్‌ బీచ్‌లో లక్షల రూపాయలు ఖర్చు చేసి వాహనాల పార్కింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ సముద్రం పాలయ్యాయి. అక్కడికి అలలు వస్తాయని తెలిసినా, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రాళ్లు తెచ్చి పోసి పార్కింగ్‌కు చదును చేయగా, తాజాగా కురిసిన వర్షాలకు అవన్నీ కొట్టుకుపోయాయి.

మహావృక్షాలు నేలకొరిగాయి

నగరంలో ఈసారి పెద్ద పెద్ద వృక్షాలు వేళ్లతో సహా నేలకు ఒరిగిపోయాయి. దీనిపై ఏయూకు చెందిన పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ, ఈ వేసవిలో చుక్కనీరు లేక భూమి మొత్తం ఎండిపోయి లోపల అంతా గుల్లగా మారిపోయిందని, ఇప్పుడు కురిసిన వర్షపు నీరు ఆ గుల్ల లోపలికి చొచ్చుకు వెళ్లడంతో మట్టి నానిపోయి, ఆ బరువును పట్టుకొని నిలపలేకపోవడంతో చెట్లు నేలకు వాలిపోయాయని వివరించారు.

67 బృందాలతో విద్యుత్‌ పనులు

విశాఖపట్నం సర్కిల్‌లో తుఫాన్‌ గాలులకు 410 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వేయికి పైగా చెట్లు కూలిపోయాయి. ముందుగా చెట్లను తొలగించే పనులు చేపట్టి, ఆ తరువాత విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి వేశారు. ఈ పనుల కోసం 670 మందితో 67 బృందాలను ఏర్పాటుచేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. సీతమ్మధార ఏపీఎస్‌ఈబీ కాలనీలో తొమ్మిది స్తంభాలు కూలిపోగా బుధవారం అర్ధరాత్రి వరకు పనులు చేసి, మళ్లీ గురువారం ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి ఉదయం 11 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా విశాఖ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ సింహాచలంనాయుడు మాట్లాడుతూ, 100 శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని, ఈ విషయంలో సీఎండీ పృథ్వీతేజ్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, కమిషనర్‌ కేతన్‌ గార్డ్‌ పలు సూచనలు చేశారన్నారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను కూడా గుర్తించి, వాటిని కూడా తొలగించి కొత్తవి వేశామన్నారు.

గూగుల్‌ డేటా సెంటర్‌ మార్గం కోత

ఆనందపురం మండలం తర్లువాడలో జాతీయ రహదారి నుంచి గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణ స్థలం వరకూ నిర్మించిన రహదారి, వంతెన తుఫాన్‌ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇప్పుడు అక్కడకు నేరుగా వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది.


విద్యుత్‌ వ్యవస్థకు రూ.26.69 కోట్ల నష్టం

4,765 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

‘ఆర్నబ్‌’ తుఫాన్‌ వల్ల విద్యుత్‌ వ్యవస్థకు రూ.26.69 కోట్ల నష్టం వాటిల్లింది. తుఫాన్‌ సమయంలో వీచిన ఈదురు గాలులకు 5,400 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి కొన్ని ప్రాంతాల్లో, సబ్‌స్టేషన్లలో లోపాలు తలెత్తి మరికొన్ని ప్రాంతాల్లో, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయి ఇంకొన్నిచోట్ల విద్యుత్‌ ఆగిపోయింది. అధికారులు, సిబ్బంది 4,765 గ్రామాల్లో సరఫరా పునరుద్ధరించారు. తుఫాన్‌ తీవ్రత అధికంగా ఉన్న కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 635 గ్రామాల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని 11 జిల్లాల్లో 551 కేవీ సబ్‌స్టేషన్ల (33/11)లో సాంకేతిక సమస్యలు ఏర్పడగా వాటిలో 485 సబ్‌ స్టేషన్లకు మరమ్మతులు చేసి సేవలకు సిద్ధం చేశారు. అలాగే 33 కేవీ ఫీడర్లు 508 ప్రభావితం కాగా వాటిలో 464 బుధవారం సాయంత్రానికి పునరుద్ధరించారు.


ఆర్టీసీకి దెబ్బ

730 బస్సులు రద్దు

రూ.4.19 కోట్ల ఆదాయానికి గండి

ఆస్తులకు రూ.15 లక్షలు నష్టం

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు తుఫాన్‌ దెబ్బ గట్టిగా తగిలింది. నాలుగు రోజుల్లో 730 బస్సులు పూర్తిగా, మరో 200 బస్సులు పాక్షికంగా రద్దు చేయాల్సి వచ్చింది. తిరిగిన బస్సులకు కూడా సగటు ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా నమోదయ్యింది. ఈ కారణాల వల్ల నాలుగు రోజుల్లో రూ.4.19 కోట్ల ఆదాయానికి గండిపడింది. అదేవిధంగా రీజియన్‌లోని ఐదు డిపోల ప్రహరీ గోడలు పాక్షికంగా కూలడంతో రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.

తుఫాన్‌ వల్ల సోమవారం వంద బస్సులు రద్దు చేశారు. దాంతో రోజువారీ ఆదాయం కేవలం రూ.28 లక్షలు వచ్చింది. మంగళవారం 180 బస్సులను పూర్తిగా, మరో 80 బస్సులను మధ్యాహ్నం నుంచి రద్దు చేశారు. ఆరోజు ఆదాయం రూ.25 లక్షలు మాత్రమే వచ్చింది. బుధవారం 280 బస్సులను పూర్తిగా, 100 బస్సులను మధ్యాహ్నం నుంచి రద్దు చేయడంతో ఆదాయం రూ.20 లక్షలకు పడిపోయింది. గురువారం 130 బస్సులను పూర్తిగా, మరో ఇరవై బస్సులను మధ్యాహ్నం రద్దుచేశారు. రోజువారీ ఆదాయం రూ.28 లక్షలు వచ్చింది. రీజియన్‌లోని ఏడు డిపోలకు చెందిన 710 బస్సులు 72 శాతం సగటు ఆక్యుపెన్సీ రేషియోతో తిరిగినప్పుడు రోజువారీ ఆదాయం రూ.1.3 కోట్లు వచ్చేది. ఈ లెక్కన నాలుగు రోజులకు గాను రూ.5.2 కోట్లు రావలసి ఉంది. కానీ రూ.1.01 కోట్లు మాత్రమే వచ్చింది.

కూలిన ప్రహరీగోడలు

తుఫాన్‌ కారణంగా వీచిన బలమైన గాలులకు గాజువాక, విశాఖపట్నం, మద్దిలపాలెం, స్టీల్‌ సిటీ, వాల్తేరు, సింహాచలం డిపోల ప్రహరీగోడలు పాక్షికంగా కూలిపోయాయి. దీనివల్ల సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్కలు కట్టారు. ఇది రీజియన్‌కు కోలుకోలేని దెబ్బగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కొనసాగిన రైళ్ల రద్దు

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు కొనసాగుతోంది. రేక్‌లు అందుబాటులోకి రాకపోవడంతో గురువారం కూడా పలు రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. విశాఖ-భువనేశ్వర్‌ వందేభారత్‌ (20842), విశాఖ-డిఘా ఎక్స్‌ప్రెస్‌ (22874), విశాఖ-బ్రహ్మపూర్‌ పాసింజర్‌ (58532), విశాఖ-బ్రహ్మపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18526), భువనేశ్వర్‌-విశాఖ వందేభారత్‌ (20841), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12704), బ్రహ్మపూర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18525), బ్రహ్మపూర్‌-విశాఖ పాసింజర్‌ (58531) రద్దయ్యాయి.


తుఫాన్‌ నష్టం రూ.14.3 కోట్లు జీవీఎంసీకి రూ.13.97 కోట్లు

18 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు

18 కిలోమీటర్ల డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు కూడా..

ఆర్‌అండ్‌బీకి రూ.29 లక్షలు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.రెండు లక్షలు నష్టం

ప్రాథమిక నివేదిక తయారుచేసిన అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

‘ఆర్నబ్‌’ తుఫాన్‌ వల్ల జిల్లావ్యాప్తంగా రూ.14.3 కోట్ల నష్టం వాటిల్లింది. జీవీఎంసీ పరిధిలో రహదారులు, డ్రైనేజీలు, వాటర్‌పైప్‌లైన్‌లు దెబ్బతినడంతో వాటిని పునరుద్ధరించడానికి రూ.13.96 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అలాగే జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినడం వల్ల రూ.29 లక్షలు, పంచాయతీరాజ్‌ రోడ్లు దెబ్బతినడం వల్ల రూ.రెండు లక్షలు వరకు నష్టంవాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఐదు ఇళ్లు పూర్తిగా, 14 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 34 హెక్టార్లలో వరి, 54 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు.

నగర పాలక సంస్థకు...

ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా జీవీఎంసీకి రూ.13.97 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. జీవీఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాలు తుఫాన్‌ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 18 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని నివేదికలో పొందుపరిచారు. రోడ్లను తాత్కాలికంగా సరిచేయడానికి రూ.3.54 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.5.37 కోట్లు అవుతుందని అంచనా వేశారు. నగరంలో ఎనిమిది కిలోమీటర్ల పొడవున డ్రైనేజీలు దెబ్బతిన్నాయని గుర్తించారు. వాటిని పునరుద్ధరించేందుకు రూ.1.25 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు తయారుచేశారు. అలాగే 16.84 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించేందుకు రూ.4.89 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. 14 చోట్ల వీధి దీపాలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు రూ.2.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇవికాకుండా 35 ప్రాంతాల్లో పారిశుధ్యపరమైన సమస్య తలెత్తిందని, దీని పరిష్కారానికి రూ.2.45 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. నష్టానికి సంబంధించిన తుది అంచనాలు ఇంకా రావాల్సి ఉన్నందున, మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 01:14 AM