Share News

నగరం... సమస్యలతో సతమతం

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:01 AM

ఆసియాలో అతి పెద్ద డేటా సెంటర్ల హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తోంది.

నగరం... సమస్యలతో సతమతం

ట్రాఫిక్‌ సమస్య జటిలం

ఫ్లైవోవర్ల నిర్మాణమే పరిష్కారం

అడుగంటిన భూగర్భ జలం...గొంతెండుతున్న జనం

మరోవైపు పెరుగుతున్న కాలుష్యం

విశాఖ అగ్రస్థానాన ఉండాలంటే మౌలిక వసతులు అవసరం

ప్రణాళికల కంటే కార్యాచరణ ముఖ్యం

ముఖ్యమంత్రిపైనే ఆశలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆసియాలో అతి పెద్ద డేటా సెంటర్ల హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తోంది. మరోపక్క పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పెద్ద యజ్ఞం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు తగిన వనరులు, వసతులు లేవు. ఎన్నడూ లేనంత తాగునీటి సమస్య, కాలుష్యం, ట్రాఫిక్‌ చిక్కులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వీటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించి తగిన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత విశాఖలో ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలమైంది. ఇది ముందే ఊహించినది. మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల విస్తరణ వల్ల ఒనగూరిన ప్రయోజనం చాలా తక్కువ. జాతీయ రహదారిపై కీలకమైన 12 జంక్షన్లలో కేంద్రం మంజూరుచేసిన ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. కానీ, ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో తెలియని మెట్రో రైలు ప్రాజెక్టుతో ముడిపెట్టి జాప్యం చేస్తోంది. మెట్రో రైలుతో సంబంధం లేకుండా ఫ్లైఓవర్లు నిర్మిస్తే తప్ప ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కాదు. ఇది వాస్తవం. ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి అనకాపల్లి నుంచి వచ్చే జాతీయ రహదారిని కలుపుతూ ఒక ప్రత్యేక నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఆ పనులు మొదలెట్టలేదు. ఇక భోగాపురం వెళ్లే విమాన ప్రయాణికుల కోసం నగరంలో తొమ్మిది చోట్ల ఏసీ లాంజ్‌లు నిర్మిస్తామని జీఎంఆర్‌ యాజమాన్యం ప్రకటించింది. చివరికి నిధులు లేవని చేతులు ఎత్తేసింది.

ఢిల్లీని మించి కాలుష్యం

వాయు కాలుష్యం అనగానే ఢిల్లీనే అందరికీ గుర్తుకు వస్తుంది. ఏడాది కాలంగా ఢిల్లీని మించిన వాయు కాలుష్యం విశాఖలో నమోదవుతోంది. అధికారులు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా కంటితుడుపుగానే ఉంటున్నాయి. పరిశ్రమలు స్వయం నియంత్రణ పాటించడం లేదు. ఆయా కంపెనీలు ఇచ్చే సీఎస్‌ఆర్‌ నిధులతోనే అధికారులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నందున వారిపై కఠిన చర్యలు చేపట్టలేకపోతున్నారు.

తాగునీటి కనెక్షన్లు ఇవ్వలేని జీవీఎంసీ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయి. దీంతో విశాఖలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 500 అడుగుల లోతున బోరు తవ్వితే తప్ప నీరు లభించడం లేదు. ఎండాడ, మధురవాడ, పీఎం పాలెం, సాగర్‌నగర్‌, కొమ్మాది ప్రాంతాల్లోని బోర్లలో నీరు రావడం లేదు. అంతా జీవీఎంసీ సరఫరా చేసే ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి. 1,400 కుటుంబాలు ఉన్న ఎంవీవీ సిటీ మహిళలు ఇటీవల అర్ధరాత్రి పూట రోడ్డుపైకి వచ్చి నిత్యావసరాలకు నీటిని అందించాలని డిమాండ్‌ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అన్ని గేటెడ్‌ కమ్యూనిటీలదీ అదే పరిస్థితి. ఈ ఏడాది జనవరి నుంచి జీవీఎంసీ ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు కూడా ఇవ్వలేకపోతోంది. తాగడానికి నీరు ఇవ్వలేని ప్రభుత్వం డేటా సెంటర్లకు ఎలా నీరు ఇస్తుందని ప్రజలు అనుమానపడుతున్నారు.

డేటా సెంటర్లపై అవగాహన ఏదీ?

డేటా సెంటర్లు వస్తే నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కొద్దికాలంగా కొన్ని సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని ఐటీ మంత్రి లోకేశ్‌ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ దిశగా వారు చేసిన ప్రయత్నం ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకొని డేటా సెంటర్లపై అనుమానాలు తొలగిపోయేలా షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది.

Updated Date - Sep 19 , 2026 | 01:01 AM