Share News

సత్తాచాటిన రైతు బిడ్డలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:06 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బుధవారం విడుదల చేసిన గ్రూప్‌-2 తుది ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. దాదాపు అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కుటుంబాల వారే. రావికమతం మండలం నుంచి ఏకంగా నలుగురు ఉద్యోగాలు సాధించడం విశేషం.

సత్తాచాటిన రైతు బిడ్డలు

గ్రూప్‌-2 ఉద్యోగాలు సాధించిన పలువురు అభ్యర్థులు

తొలి ప్రయత్నంలోనే విజయబావుటా

రావికమతం మండలం నుంచి నలుగురికి కొలువులు

--

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ బుధవారం విడుదల చేసిన గ్రూప్‌-2 తుది ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. దాదాపు అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కుటుంబాల వారే. రావికమతం మండలం నుంచి ఏకంగా నలుగురు ఉద్యోగాలు సాధించడం విశేషం.

---

రావికమతం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తాజాగా విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ఫలితాల్లో రావికమతం మండలానికి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ఇద్దరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐలుగా, ఒకరు డిప్యూటీ ఎంపీడీవోగా, మరొకరు ఏఎస్‌ఓ (జీఏడీ)గా ఎంపికయ్యారు.

ఎక్సైజ్‌ ఎస్‌ఐగా..

రావికమతం మండలం గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన సిద్దా రవి ప్రసాద్‌ ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2లో ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు. ఇతని తల్లిదండ్రులు సత్యారావు, వరలక్ష్మి వ్యవసాయదారులు. పదో తరగతి వరకు చినపాచిలలో, తరువాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ చదివాడు. తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో చేరాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యాడు. గ్రూప్‌-2 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాడు.

డిప్యూటీ ఎంపీడీఓగా...

రావికమతం మండలం మర్రివలసకు చెందిన ఎలిశెట్టి రవి గ్రూప్‌-2లో అర్హత సాధించి డిప్యూటీ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఏడో తరగతి వరకు మర్రివలసలో, ఆ తరువాత ఇంటర వరకు కొత్తకోట, డిగ్రీ నర్సీపట్నంలో పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-2 ఉద్యోగం సాధించాడు. ఇతని తల్లిదండ్రులు వరహాలు, పాప వ్యవసాయదారులు.

ఎక్సైజ్‌ ఎస్‌ఐగా..

రావికమతం గ్రామానికి చెందిన కాకర శ్రీను ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2లో ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు. డిగ్రీ వరకు చదివిన ఇతను ఉద్యోగ పోటీ పరీక్షల కోసం విశాఖ, హైదరాబాద్‌లలో శిక్షణ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. శ్రీను తండ్రి సత్తిబాబు మూడేళ్ల క్రితం చనిపోయారు. తల్లి చిన్నమ్మలు అన్నీ తానై కుమారుడి ఉద్యోగ సాధనకు అండగా నిలిచింది.

ఏఎస్‌వోగా..

రావికమతం మండలం దొండపూడికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్‌-2లో అర్హత సాధించి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ) పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం మాకవరపాలెం రెవిన్యూ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తొలిప్రయత్నంలోనే గ్రూప్‌-2 ఉద్యోగం సాధించారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రురాలైన ఈమె సొంతూరు నర్సీపట్నం మండలం సుబ్బరాయుడుపాలెం. భర్త గట్రెడ్డి గోపి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఉద్యోగ సోపానంలో మరో మెట్టు ఎక్కిన కన్నతల్లి

దేవరాపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి కన్నతల్లి ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసిన గ్రూప్‌-2 ఫలితాల్లో సత్తా చాటి, జీఏడీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికైంది. తల్లిదండ్రులు ఆదిరెడ్డి నాయుడు, మహలక్ష్మి నిరక్షరాస్యులైనప్పటికీ కన్నతల్లితోపాటు మొత్తం ముగ్గురు కుమార్తెలను చదువులో ప్రోత్సహించారు. దీంతో వీరు బాగా చదువుకొని పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమార్తె విజయరామలక్ష్మి డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారిగా, రెండో కుమార్తె సంధ్య డిప్యూటీ తహశీల్దారుగా, మూడో కుమార్తె అయిన కన్నతల్లి జౌళిశాఖ ప్రధాన కార్యాలయం (మంగళగిరి)లో అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. కన్నతల్లి ఇప్పుడు గ్రూప్‌-2 ద్వారా మరింత మెరుగైన ఉద్యోగం సాధించారు. తన గురువు, ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మార్గదర్శకంలో భవిష్యత్తులో గ్రూప్‌-1లో కూడా ప్రతిభ చూపి, డిప్యూటీ కలెక్టర్‌ కావడమే తన లక్ష్యమని ఆ సందర్భంగా ఆమె చెప్పారు.

గణపర్తి అభ్యర్థికి సబ్‌ట్రెజరీలో కొలువు

మునగపాక, జనవరి 28 (ఆంధ్రజ్యోతి)ః మండలంలో గణపర్తి గ్రామానికి చెందిన కె.జయరాజు గ్రూప్‌-2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇతను పదో తరగతి వరకు గణపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ అనకాపల్లిలో చదివాడు. బీటెక్‌ పూర్తిచేసిన అనంతరం గ్రామ సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అచ్యుతాపురం మండలం చోడపల్లి సచివాలయంలో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన గ్రూప్‌-2 ఫలితాల్లో సబ్‌ ట్రెజరీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు.

గ్రూప్‌-2లో విజేతగా నిలిచిన పంచాయతీ కార్యదర్శి

నాతవరం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎంబీపట్నం పంచాయతీ గ్రేడ్‌-3 కార్యదర్శిగా పనిచేస్తున్న వై.రమణ ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా (ఆర్థిక శాఖ) ఎంపికయ్యాడు. విశాఖలోని ఆదర్శనగర్‌కు చెందిన ఇతను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. మరింత మెరుగైన ఉద్యోగం కోసం రెండేళ్లపాటు సెలవుపెట్టి గ్రూప్‌-2కు ప్రిపేర్‌ అయ్యాడు. 2024లో ప్రిలిమ్స్‌, గత ఏడాది మెయిన్‌ పరీక్షలు పూర్తయిన అనంతరం తిరిగి విధుల్లో చేరాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఏఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యాడు.

Updated Date - Jan 29 , 2026 | 01:06 AM