Share News

పీఎం జన్‌మన్‌తో మారుతున్న గిరి పల్లెల రూపురేఖలు

ABN , Publish Date - May 27 , 2026 | 11:50 PM

పీఎం జన్‌మన్‌ పథకంతో మన్యంలోని గిరి పల్లెల రూపురేఖలు మారుతున్నాయని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌ అన్నారు.

పీఎం జన్‌మన్‌తో మారుతున్న గిరి పల్లెల రూపురేఖలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లంక దినకర్‌

20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌

అరకులోయ, మే 27 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్‌ పథకంతో మన్యంలోని గిరి పల్లెల రూపురేఖలు మారుతున్నాయని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌ అన్నారు. అరకులోయలోని హరితవేలీ రిసార్టులో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకులోయ, అనంతగిరి మండలాల పరిధిలో ఉన్న సిమిలిగుడ, పైనంపాడు, కాకరపాడు గ్రామాల్లో గిరిజనులు నిర్మించుకుంటున్న ఇళ్లను పరిశీలించానన్నారు. అరకులోయ మండలం సిమిలిగుడ గ్రామంలో 38 ఇళ్లు మంజూరుకాగా, పది ఇళ్లు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ కాకరపాడు గ్రామంలో 36 ఇళ్లు మంజూరు కాగా, ఆరు ఇళ్లు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో మొదటి విడతగా 28,690 ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో 5,563 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. డిసెంబరు నాటికి మిగతావి పూర్తవుతాయని చెప్పారు. జిల్లాలో రహదారుల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్‌ డీఈఈ రామం, పీఆర్‌ డీఈ (ప్రాజెక్టులు) రవికుమార్‌, ఏఈఈ సాంబశివరావు, హౌసింగ్‌ డీఈఈ రాంబాబు, ఏఈఈ ఎస్‌.కాంతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 11:50 PM