Share News

మన్యమంతటా మోగనున్న సెల్‌

ABN , Publish Date - May 12 , 2026 | 12:31 AM

మన్యంలో సమాచార వ్యవస్థపరంగా ఓ విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఏజెన్సీలో సెల్‌ సేవల విస్తరణలో భాగంగా 1,584 సెల్‌ టవర్ల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1,267 టవర్లు అందుబాటులోకి రాగా, మిగిలిన 317 టవర్లు వివిధ దశల్లో ఉన్నాయి.

మన్యమంతటా మోగనున్న సెల్‌
పాడేరు మండలం నందిగరువు గ్రామంలో అందుబాటులోకి వచ్చిన సెల్‌ సేవలు

ఏజెన్సీ వ్యాప్తంగా 1,584 సెల్‌ టవర్ల నిర్మాణానికి చర్యలు

ఇప్పటికే 1,267 అందుబాటులోకి..

వివిధ దశల్లో మిగతా 317

మరో ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి రానున్న సేవలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో సమాచార వ్యవస్థపరంగా ఓ విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఏజెన్సీలో సెల్‌ సేవల విస్తరణలో భాగంగా 1,584 సెల్‌ టవర్ల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1,267 టవర్లు అందుబాటులోకి రాగా, మిగిలిన 317 టవర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా పనులు లక్ష్యం మేరకు పూర్తయితే మరో ఏడాది కాలంలో ఏజెన్సీలో మారుమూల ప్రాంతంలో సైతం సెల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఏజెన్సీ 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గిరిజన పల్లెలున్నాయి. వాటిలో 1,150 గ్రామాలకు సెల్‌ కనెక్టవిటీ ఉండగా, మిగిలిన 2,653 గ్రామాలకు ఎటువంటి సెల్‌ సేవలు అందుబాటులో లేవు. కాగా 2021లో అప్పటి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మన్యంలోని గ్రామాలకు రోడ్డు, రవాణా, సెల్‌, తాగునీరు, విద్యుత్‌ తదితర 42 రకాల సదుపాయాలపై ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సర్వే చేయించారు. ఆ సర్వే ఆధారంగా ఏజెన్సీలో ప్రతి పల్లెలో ఉన్న సదుపాయాలు, ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదికను రూపొందించారు. దాని ఆధారంగా ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న గిరిజన పల్లెలకు రోడ్డు, సెల్‌ కనెక్టవిటీ, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో అప్పట్లో ‘మిషన్‌ కనెక్ట్‌ పాడేరు’ పేరిట వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు.

గతంలో 30 శాతం పల్లెలకే సెల్‌ కనెక్టవిటీ

మన్యంలో సదుపాయాలపై జరిగిన సర్వేలో ఏజెన్సీ వ్యాప్తంగా 2021లో చేపట్టిన సర్వే ఆధారంగా కేవలం 30 శాతం గ్రామాలకు మాత్రమే సెల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తించారు. అనంతగిరి మండలంలో 27 శాతం, అరకులోయలో 40, డుంబ్రిగుడలో 22, హుకుంపేటలో 39, ముంచంగిపుట్టులో 23, పెదబయలులో 14, చింతపల్లిలో 55, జీకేవీధిలో 9, జి.మాడుగులలో 32, కొయ్యూరులో 36, పాడేరు మండలంలో 42 శాతం గ్రామాలకు మాత్రమే సెల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ‘మిషన్‌ కనెక్ట్‌ పాడేరు’లో భాగంగా ఏజెన్సీలో అధిక సంఖ్యలో సెల్‌ టవర్ల ఏర్పాటుకు కృషి చేయాలని 2021లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. అందుకు గాను వివిధ సెల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలతో చర్చలు, సమావేశాలు నిర్వహించి, ఊహించని విధంగా ఫలితాన్ని సాధించారు. ఏజెన్సీ వ్యాప్తంగా ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 62, జియో 73.. మొత్తం 135 సెల్‌ టవర్లు మాత్రమే ఉన్నాయి. కలెక్టర్‌, ఐటీడీఏ పీవో కృషితో ఏజెన్సీకి మొత్తం 1,584 సెల్‌ టవర్లు ఒకేసారి మంజూరు కావడం విశేషం. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా 936 బీఎస్‌ఎన్‌ఎల్‌, 509 జియో, 139 ఎయిర్‌టెల్‌ సెల్‌ టవర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గత నాలుగేళ్లుగా ఏజెన్సీ వ్యాప్తంగా సెల్‌ టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం మొత్తం 1,584 టవర్లకు గాను ఇప్పటికే 1,267 టవర్ల నిర్మాణం పూర్తికాగా, మిగిలిన 317 టవర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో ఏడాదిలో దాదాపుగా అన్ని టవర్ల నిర్మాణం పూర్తయితే లక్ష్యం మేరకు మారుమూల పల్లెలకు సైతం సెల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సెల్‌ టవర్ల పనుల్లో జాప్యాన్ని అధిగమించాలి

ఏజెన్సీలో సెల్‌ టవర్ల నిర్మాణంలో ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత మూడేళ్లుగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ, పూర్తి స్థాయిలో అన్ని టవర్ల నిర్మాణానికి ఇంకా మరో ఏడాది పైబడి సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రతీ వారం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ పథఽకానికి సంబంధించిన అంశాలు జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికుల హాజరు సైతం ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో సెల్‌ టవర్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2026 | 12:31 AM