Share News

మోదకొండమ్మ ఉత్సవాల పందిరి రాట ప్రతిష్ఠ

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:29 AM

వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించే స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలకు సంబంధించి పందిరి రాట ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం వైభవంగా నిర్వహించారు.

మోదకొండమ్మ ఉత్సవాల పందిరి రాట ప్రతిష్ఠ
పాడేరులో ప్రతిష్ఠించిన మోదకొండమ్మ ఉత్సవాల పందిరి రాట

పాడేరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించే స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలకు సంబంధించి పందిరి రాట ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, తదితరులు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇక్కడ నుంచి పసుపు, కుంకుమలను శతకంపట్టు పందిరి నిర్మించే ప్రదేశానికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపు మేళతాళాలు, కోలాటాలు, డప్పుల మోతలతో ఉత్సాహంగా జరిగింది. అక్కడ ప్రధానార్చకుడు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరి రాటను ప్రతిష్ఠ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విలేకరులతో మాట్లాడుతూ... మే 10, 11, 12 తేదీల్లో మోదకొండమ్మ ఉత్సవాలను గతేడాది కంటే వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కూడ సురేశ్‌కుమార్‌, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు, ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:29 AM