Share News

ఇటుకల పండుగ సందడి

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:34 PM

ప్రస్తుతం మన్యంలో ఇటుకల పండుగ సందడి నెలకొంది. ఏజెన్సీలో ప్రతి ఏడాది చైౖత్ర మాసంలో గిరిజనులు ఇటుకల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇటుకల పండుగ సందడి
డుంబ్రిగుడ మండలం కుసుమగూడలో వాహనదారులను పండుగ చందా అడుగుతున్న యువతులు

ఏజెన్సీలో కొనసాగుతున్న హడావిడి

గిరిజన పల్లెల్లో పండుగ గేట్లు, ప్రత్యేక పూజలు, ధింసా నృత్యాలతో కోలాహలం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం మన్యంలో ఇటుకల పండుగ సందడి నెలకొంది. ఏజెన్సీలో ప్రతి ఏడాది చైౖత్ర మాసంలో గిరిజనులు ఇటుకల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల 20న పండుగ ప్రారంభంకాగా, ఈ నెల 19 వరకు గిరిజన పల్లెల్లో సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడికక్కడ గేట్లు పెట్టి మహిళలు పండుగ చందాలు వసూలు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

గిరిజన పూర్వీకులు ఇటుకల పండుగను ఘనంగా నిర్వహించేవారు. చైౖత్రమాసం ప్రారంభం రోజున గిరిజనులు పండించే పంటల విత్తనాలను, పని ముట్లను గ్రామ పొలిమేరలో ఉండే సంకు దేవుడి వద్ద పెట్టి, కోడిని కోసి పూజలు చేసేవారు. తమ పంటలు బాగా పండాలని దేవుడికి మొక్కుకుని, పూజలో ఉంచిన విత్తనాలను తమ పంట పొలాల్లో చల్లేవారు. ఇలా చేయడం వల్ల తమ పంటలు బాగా పండుతాయనేది గిరిజనుల విశ్వాసం. అలాగే గిరిజనులు తమ గ్రామం నుంచి బయటకు వెళ్లినా, బయట నుంచి గ్రామానికి వచ్చినా పొలిమేరలో ఉన్న సంకుదేవుడికి సమస్కరించడాన్ని కచ్చితంగా పాటిస్తారు.

పండుగలో మహిళల కీలకపాత్ర

పండుగకు సంబంఽధించిన అన్ని వ్యవహారాల్లో మహిళలదే కీలకపాత్ర. ఆఖరికి పండుగలో భాగంగా వేటకు వెళ్లే క్రమంలో మొత్తం నిర్ణయమంతా మహిళలదే కావడం విశేషం. పురుషులు అడవికి వేటకు వెళ్లి ఏదైనా జంతువును వేటాడి తీసుకువస్తేనే గ్రామంలోకి ప్రవేశించాలి. లేకుంటే గ్రామంలోకి రాకూడదనేది నిబంధన ఉంది. దీంతో వేటలో జంతువులు చిక్కే వరకు పురుషులు గ్రామాలకు వచ్చేవారు కాదు. అలాగే ఇటుకల పండుగ జరిగే సమయంలో పురుషులు ఎవరూ పల్లెల్లో ఉండకూడదనే మరొక నిబంధన ఉంది. దానినిఅతిక్రమించి గ్రామాల్లోకి వచ్చేవారికి గ్రామ కట్టుబాటు ప్రకారం జరిమానా విధించేందుకే ఊరి పొలిమేరలో గేటు పెట్టి, అలా వచ్చేవారి నుంచి కొంత డబ్బులు వసూలు చేసేవారు. ఆ డబ్బులతో పండుగకు అవసరమైనవి కొనుగోలు చేసి ఊరంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇలా చైౖత్రమాసంలో ఏదో ఒక వారం, ఒక ప్రాంతంలోని గిరిజనులు ఇటుకల పండుగను ఆచరిస్తారు. అలాగే పండుగ సందర్భంగా సాయంత్రం వేళల్లో గిరిజన మహిళలు ధింసా నృత్యాలతో అలరిస్తారు. గ్రామాల్లో పిల్లల కోసం ఊయ్యాలను కడతారు. అయితే మారుతున్న కాలంతో పాటు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు కూడా మారుతున్నాయి. సంప్రదాయ వేట, గ్రామాల్లో గేట్లు పెట్టే సంప్రదాయం పోయి, మెయిన్‌ రోడ్లపై గేట్లు(తాళ్లు కట్టి) పెట్టి డబ్బులు వసూలు చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటుకల పండుగ అంటే కేవలం గేట్లు పెట్టడం, డబ్బులు వసూలు చేయడం అన్నట్టుగా కొత్త తరానికి అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Apr 09 , 2026 | 11:34 PM