స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభల సందడి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:42 AM
గ్రామ పంచాయతీల బలోపేతంతో పాటు పల్లెల్లోని పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ సంక్రాంతి’ గ్రామసభలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహణ
10 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
పాడేరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల బలోపేతంతో పాటు పల్లెల్లోని పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ సంక్రాంతి’ గ్రామసభలు నిర్వహించారు. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల్లోనూ ఈ గ్రామసభలను నిర్వహించారు. ప్రధానంగా పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలనేది ఈ గ్రామసభల ప్రధాన ఉద్దేశం. అలాగే పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన తీర్మానాలు, ఆదాయం పెంపు వంటివి ఈ గ్రామసభల్లో చర్చకు వచ్చాయి. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా గత ఏడాది డిసెంబరు నుంచి ఈ నెల 4 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, దానిని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ క్రమంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా ఉత్తమ పారిశుధ్య నిర్వహణ చేపట్టిన మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణలో ముందున్న మూడు గ్రామ పంచాయతీలకు ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.