Share News

ప్రాదేశిక ఎన్నికల సందడి

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:20 AM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం ప్రకటించింది.

ప్రాదేశిక ఎన్నికల సందడి
పాడేరు జడ్పీ కార్యాలయం

ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన ఎస్‌ఈసీ

21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ, 27న అభ్యర్థుల ప్రకటన

నవంబరు 3న ఎన్నికలు, 5న ఓట్ల లెక్కింపు, సాయంత్రం ఫలితాల ప్రకటన

జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు, 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలు

మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

పాడేరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం ప్రకటించింది. దీంతో మండల పరిషత్‌ కార్యాలయాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ పత్రాలను ప్రదర్శించడంతో సందడి ప్రారంభమైంది.

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా, మండల స్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి వంటివి సిద్ధం చేశారు. ప్రతి మండలానికి రిటర్నింగ్‌ అధికారులుగా నియమించి, 616 పోలింగ్‌ కేంద్రాలకు 1,300 బ్యాలెట్‌ బాక్సులు, సుమారుగా 5 వేల మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేశారు.

ఎంపీడీవో కార్యాలయాల్లో మొదలైన హడావిడి

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో సందడి నెలకొంది. జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కేంద్రం పాడేరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లోనే నామినేషన్లను సమర్పించాలి. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రదర్శనతో సోమవారం నుంచే ఎంపీడీవో కార్యాలయంలో సందడి మొదలైంది. అలాగే 21 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుండడంతో ఎంపీడీవో కార్యాలయాల ముందు అభ్యర్థులు, వారి ప్రతిపాదితులు వేచి ఉండేందుకు గాను షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణను ప్రారంభిస్తారు.

జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలున్నాయి. మొత్తం 11 మండలాలు కాగా మండలానికి ఒకటి చొప్పున మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలు, వాటి పరిధిలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అనంతగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, అరకులోయలో 16, చింతపల్లిలో 20, డుంబ్రిగుడలో 14, జి.మాడుగులలో 15, జీకేవీధిలో 18, హుకుంపేటలో 15, కొయ్యూరులో 14, ముంచంగిపుట్టులో 14, పాడేరులో 17, పెదబయలు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అలాగే మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలోని 172 ఎంపీటీసీ స్థానాలకు 612 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం 4,98,467 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు.

Updated Date - Oct 20 , 2026 | 12:20 AM