Share News

సందర్శకుల సందడి

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:31 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి కొనసాగుతున్నది. దసరా సెలవులు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

సందర్శకుల సందడి
జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద సందడి

మన్యంలో కొనసాగుతున్న రద్దీ

పర్యాటక ప్రాంతాలు కిటకిట

పాడేరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి కొనసాగుతున్నది. దసరా సెలవులు కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆదివారం మన్యంలో ఎక్కడ చూసినా సందర్శకుల సందడి కనిపించింది.

అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి కొనసాగుతున్నది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, యర్రవరం జలపాతం, తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. దీంతో పాడేరు, అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం కనిపించింది.

వంజంగి మేఘాల కొండ వద్ద..

పాడేరురూరల్‌: పాడేరు మండలం వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం వంజంగి మేఘాల కొండకు 700 మంది పర్యాటకులు రాగా, ఎకో టూరిజమ్‌కు రూ.43 వేల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. అలాగే జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి 705 మంది పర్యాటకులు రాగా, రూ.51,240 ఆదాయం వచ్చిందని నిర్వాహకుడు అభి తెలిపారు.

లంబసింగిలో...

చింతపల్లి: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారవుంం ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, తాజంగి జలాశయం, చెరువులవేనం వ్యూపాయింట్‌లో సందర్శకుల సందడి మొదలైంది. ఉదయం పదకొండు గంటల వరకు చెరువులవేనం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు.

డుడుమ జలపాతం వద్ద..

ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గల డుడుమ జలపాతం వ్యూపాయింట్‌ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. డుడుమ జలపాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో గల ప్రకృతి అందాలను చూసేందుకు స్థానికులతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో జలపాతం వ్యూపాయింట్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టు పరిసరాలు పర్యాటకులతో కిటకిటలాడాయి.

బొర్రా గుహలు వద్ద..

అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఆదివారం 6,000 మంది పర్యాటకులు రాగా, రూ.5.5 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీశంకర్‌ తెలిపారు.

Updated Date - Oct 18 , 2026 | 11:31 PM