పర్యాటకుల కోలాహలం
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:30 PM
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పురావడంతో లంబసింగి , పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
చింతపల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పురావడంతో లంబసింగి , పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆదివారం లంబసింగి ప్రకృతిని ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
అరకులోయలో..
అరకులోయ: స్థానిక పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డులోని కాఫీ తోటలు, ఉడెన్ బ్రిడ్జి వద్ద పర్యాటకుల రద్దీ కనిపించింది. పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఫొటోలు దిగి ఎంజాయ్ చేశారు.