నామినేషన్ల కోలాహలం
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:03 AM
జిల్లాలో తొలిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు పదవులకు నావినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. జిల్లాలోని అనకాపల్లి, కశింకోట, పరవాడ, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికలకు చివరి రోజున భారీ ఎత్తున దాఖలు
ఊరేగింపులతో అట్టహాసంగా కేంద్రాలకు తరలివచ్చిన అభ్యర్థులు, మద్దతుదారులు
ఎనిమిది మండలాల్లో సర్పంచ్ పదవులకు 1,360, వార్డులకు 6,398 నామినేషన్లు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలో తొలిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు పదవులకు నావినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. జిల్లాలోని అనకాపల్లి, కశింకోట, పరవాడ, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎనిమిది మండలాల్లో 217 పంచాయతీల సర్పంచ్ పదవులకు, 2,156 వార్డు పదవులకు ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనున్నది. మొదటి రోజు సర్పంచ్ పదవులకు 183, వార్డు పదవులకు 527, రెండో రోజు సర్పంచ్ పదవులకు 695, వార్డు పదవులకు 2,968 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో రోజైన మంగళవారం దాఖలైన నామినేషన్లతో కలిపి సర్పంచ్ పదవులకు 1,360, వార్డులకు 6,398 నామినేషన్లు దాఖలయ్యాయి. పలు కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటల సమయానికి అభ్యర్థులు అధిక సంఖ్యలో వుండడంతో గడువు ముగిసిన తరువాత కూడా నామినేషన్లను స్వీకరించారు. దీంతో రావికమతం, బుచ్చెయ్యపేట, అనకాపల్లి మండలాల్లో నామినేషన్ల వివరాలను వెల్లడించడంలో జాప్యం జరిగింది. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం వుంటుంది.
పరవాడ మండలంలోని 14 పంచాయతీల్లో చివరి రోజైన మంగళవారం సర్పంచ్ పదవులకు 33 మంది, వార్డు పదవులకు 145 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏవీ మల్లికార్జునరావు తెలిపారు. మొత్తం మూడు రోజులకు కలిపి సర్పంచ్ పదవులకు 100, వార్డులకు 503 నామనేషన్లు దాఖలయ్యాయని ఆయన వెల్లడించారు. ఇదిలావుండగా వెన్నెలపాలెం పంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి బలపరిచిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవీలత నామినేషన్ దాఖలు చేశారు.
సబ్బవరం మండలంలోని 19 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు చివరి రోజున 47 మంది, వార్డు పదవులకు 334 మంది నామనేషన్లు దాఖలు చేశారు. మొత్తం మూడు రోజులు కలిపి సర్పంచ్ పదవులకు 173, వార్డులకు 748 నామనేషన్లు దాఖలైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.పద్మజ తెలిపారు.. మొగలిపురం సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కోడలు గండి రోషిణి నామినేషన్ దాఖలు చేశారు.
రోలుగుంట మండలంలోని 24 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 136, వార్డు పదవులకు 798 నామినేషన్లు దాఖలు అయినట్టు ఎన్నికల అధికారి నాగేశ్వరరావు తెలిపారు. తెలిపారు. మండంలోని 24 పంచాయతీలు, 228 వార్డులకు నామినేషన్లు దాఖలు అయిన వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం మండలంలో మేజరు పంచాయతీ కొత్తకోట సర్పంచ్ పదవికి చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు సతీమణి సునీత నామినేషన్ దాఖలు చేశారు.
------------------------------------
రావికమతం మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం?
రావికమతం నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు పదవులు ఏకగ్రీవం కానున్నాయి. పంచాయతీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల ప్రజలు, పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయా పంచాయతీల సర్పంచ్, వార్డు పదవులకు కూటమి తరపున టీడీపీ మద్దతుతో ఒక్కొక్కరే నామినేషన్లు వేసినట్టు చెబుతున్నారు. దొండపూడి పంచాయతీ సర్పంచ్ పదవికి వెదురుపర్తి వెంకట ఆచారి, జడ్.కొత్తపట్నానికి లాలం రాజిబాబు, గంపవానిపాలేనికి మాకిరెడ్డి గంగా భవానీ, ధర్మవరానికి ఈదల జయంతి నామినేషన్లు వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన అనంతరం వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించనున్నారు.
బుచ్చెయ్యపేట మండలంలో నాలుగు...
బుచ్చెయ్యపేట నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): మండలంలో నాలుగు పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం వుంది. కోమళ్లపూడి సర్పంచ్ పదవికి గేదెల సత్యవతి (ఎంపీపీ అభ్యర్థి గేదెల సత్యనారాయణ భార్య) పేరును గ్రామ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిసింది. దీంతో ఆమె నామినేషన్ వేశారు. ఇంకా తురకలపూడి, ఎల్.సింగవరం, ఎల్బీ పురఆగ్రహారం పంచాయతీల సర్పంచ్ పదవులు కూడా కూటమి మద్దతుదారులతో ఏకగ్రీవం అయ్యే అవకాశం వుందని సమాచారం.
------------------------------------------------------------------------
మొదటి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో దాఖలైన నామినేష్ల వివరాలు..
మండలం తొలి రోజు రెండో రోజు మూడో రోజు మొత్తం
సర్పంచ్ వార్డులు సర్పంచ్ వార్డులు సర్పంచ్ వార్డులు సర్పంచ్ వార్డులు
అనకాపల్లి 18 63 120 390 100 514 238 967
కశింకోట 24 96 84 406 56 311 164 813
పరవాడ 19 62 48 296 33 145 100 503
సబ్బవరం 30 58 96 356 47 334 173 748
చోడవరం 23 68 117 323 71 434 211 825
బుచ్చెయ్యపేట 36 94 115 431 54 416 205 941
రావికమతం 23 58 55 284 55 461 133 803
రోలుగుంట 10 28 83 373 40 397 136 798
------------------------------------------------------------------------
నేటి నుంచి రెండో దశకు నామినేషన్లు
213 సర్పంచ్, 2,072 వార్డు పదవులకు ఎన్నికలు
ఎనిమిది మండలాల్లో 66 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ
అనకాపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది. కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి మండలాల్లోని 213 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులకు, 2,072 వార్డు పదవులకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. కోటవురట్ల మండలంలో 25 పంచాయతీలకు 7 కేంద్రాలు, నక్కపల్లి మండలంలో 33 పంచాయతీలకు 8, పాయకరావుపేట మండలంలో 24 పంచాయతీలకు 8, ఎస్.రాయవరం మండలంలో 28 పంచాయతీలకు 8, అచ్యుతాపురం మండలంలో 34 పంచాయతీలకు 11, మునగపాక మండలంలో 26 పంచాయతీలకు 8, రాంబిల్లి మండలంలో 26 పంచాయతీలకు 8, ఎలమంచిలి మండలంలో 17 పంచాయతీలకు 8 చోట్ల నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు.