Share News

నామినేషన్ల సందడి

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:38 PM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల సందడి బుధవారం మొదలైంది.

నామినేషన్ల సందడి
పాడేరులో నామినేషన్‌ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

తొలి రోజు జడ్పీటీసీలకు 6, ఎంపీటీసీ స్థానాలకు 72 నామినేషన్లు

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

పాడేరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల సందడి బుధవారం మొదలైంది. జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ, జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు చేపడుతుండగా, మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను అక్కడి రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తున్నారు. దీంతో తొలి రోజు జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3, కాంగ్రెస్‌ నుంచి 1 నామినేషన్‌ దాఖలైంది. జిల్లాలోని చింతపల్లి జడ్పీటీసీ స్థానానికి కోరాబు అనుషాదేవి(వైసీపీ), పులిమెట్ల రమణకుమారి(వైసీపీ), జీకేవీధి స్థానానికి రొబ్బా పుష్పలక్ష్మి(బీజేపీ), సీదరి సింహాచలం(బీజేపీ), కొయ్యూరు స్థానానికి బచ్చలి అన్నపూర్ణ(బీజేపీ), డుంబ్రిగుడ స్థానానికి కొర్రా పరశురామ్‌(కాంగ్రెస్‌)తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. వారి నుంచి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీటీసీ స్థానాలకు 72 మంది నామినేషన్‌

జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజు 72 మంది నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలో పాడేరులో 6, పెదబయలులో 10, ముంచంగిపుట్టులో 12, కొయ్యూరులో 2, జీకేవీధిలో 11, జి.మాడుగులలో 1, డుంబ్రిగుడలో 8, చింతపల్లిలో 10, అనంతగిరిలో 7, అరకులోయలో 5 నామినేషన్లను దాఖలు చేశారు. అలాగే హుకుంపేట మండలంలో తొలి రోజు ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడం విశేషం. జిల్లాలో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ పరిశీలించారు. ఆయన అనంతగిరి, అరకులోయ, డుంబిగ్రుడ మండలాల్లోని నామినేషన్‌ కేంద్రాలను సందర్శించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి జిల్లా కేంద్రం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రాన్ని, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌ అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేటలోని నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో బుధవారం నుంచి నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించే స్థానిక ఐటీడీఏ కార్యాలయం, ఎంపీటీసీ సాన్థాల నామినేషన్లను స్వీకరించే మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే నామినేషన్‌ వేసే అభ్యర్థి, అతనికి మద్దతు ఇచ్చే మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్‌ సెంటర్‌ లోపలకు అనుమతిస్తున్నారు. నామినేషన్‌ సెంటర్‌కు 200 మీటర్ల దూరం వరకు ఎవరూ గుంపులుగా ఉండకుండా, ఎటువంటి వాహనాలను నిలపకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది.

Updated Date - Oct 21 , 2026 | 11:38 PM