Share News

మండిన నగరం

ABN , Publish Date - May 22 , 2026 | 12:23 AM

వాయువ్య దిశ నుంచి వీచిన వడగాడ్పులకు గురువారం నగరం ఉడికిపోయింది.

మండిన నగరం

  • వడగాడ్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

  • మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యం

  • బీచ్‌రోడ్డులోనూ వడగాడ్పులు

  • ములగాడలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • విశాఖ రూరల్‌లో 44.6, పద్మనాభంలో 44.1...

విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

వాయువ్య దిశ నుంచి వీచిన వడగాడ్పులకు గురువారం నగరం ఉడికిపోయింది. గాలిలో తేమ శాతం 80 వరకు నమోదుకావడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సూర్యోదయం నుంచే ఎండ చుర్రుమనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ తీవ్రత పెరిగి వడగాడ్పులు వీచాయి. పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రత, గాడ్పుల ప్రభావం క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా నగరవాసులు వేసవి ప్రభావానికి గురయ్యారు. రోడ్లపైకి వస్తే వేడిగాలులు తగలడంతో ఠారెత్తిపోయారు.

ఎండ తీవ్రత కారణంగా ఉదయం 11 గంటల తరువాత రోడ్లపై జన సంచారం తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయాల్లో ఉద్యోగులు వేడికి తాళలేకపోయారు. ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏసీలు ఉదయం నుంచి ఆన్‌లో ఉంచారు.

జూలో జంతువులు ఎండకు విలవిలలాడిపోయాయి. తెల్ల పులులతో సహా అన్నీ ఉష్ణ తాపానికి తట్టుకోలేక ఎన్‌క్లోజర్‌లలో గల నీటి తొట్టెల్లోకి చేరాయి. ఎండ నుంచి ఉపశమనం కోసం జంతువులకు నీటి సరఫరా పెంచారు. కొన్నిచోట్ల కొబ్బరి ఆకులు, తాటాకులతో పందిళ్లు వేసి నీటిని చల్లారు. ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

కాగా జిల్లాలోని 11 మండలాల్లో పద్మనాభం, విశాఖ రూరల్‌లో తీవ్ర వడగాడ్పులు, ములగాడ, మహారాణిపేట, గోపాలపట్నం, సీతమ్మధార, పెందుర్తి, పెదగంట్యాడ మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అత్యధికంగా ములగాడలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ రూరల్‌లో 44.6, పద్మనాభంలో 44.1, పెదగంట్యాడ, మహారాణిపేట, సీతమ్మధారల్లో 41.1, పెందుర్తిలో 41, ఆనందపురంలో 40.3, భీమిలిలో 39.2, గాజువాకలో 38 డిగ్రీలు నమోదయ్యాయి.


కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

వడగాడ్పుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశారు. వడదెబ్బకు గురయ్యేవారికి చికిత్స కోసం ఆస్పత్రుల్లో బెడ్లు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 33 మంది వడదెబ్బకు గురయ్యారని, ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.

Updated Date - May 22 , 2026 | 12:23 AM