ఉడికిన నగరం
ABN , Publish Date - May 24 , 2026 | 12:39 AM
వేడి గాలులకు శనివారం నగరం ఉడికిపోయింది.
మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యం
మహారాణిపేట, విశాఖ రూరల్‌లో 42.8 డిగ్రీలు
రుతుపవనాలు వచ్చేంత వరకూ ఇదే వాతావరణం
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
వేడి గాలులకు శనివారం నగరం ఉడికిపోయింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో నిప్పుల కొలిమిలా మారింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం వల్ల ఉదయం కొద్దిసేపు చల్లగా ఉన్న వాతావరణం పది గంటల తరువాత మారిపోయింది. ఎండ తీవ్రత క్రమేపీ పెరిగింది. వడగాడ్పులు వీచాయి. ఇళ్లలో ఏసీలు పనిచేయకపోతే ఉండలేని పరిస్థితి నెలకొంది. రాత్రి తొమ్మిది గంటలకు కూడా వాతావరణం చల్లబడలేదు సరికదా ఉక్కపోత మరింత ఎక్కువైంది. శనివారం మహారాణిపేట, విశాఖ రూరల్ మండలాల్లో 42.8 డిగ్రీలు నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పద్మనాభంలో 40.9, సీతమ్మధారలో 39.8, పెందుర్తిలో 39.7, పెదగంట్యాడ, ములగాడలో 39.4 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు వేడి వాతావరణం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు ఎండలు, గాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఒకవేళ వాతావరణ అనిశ్చితి ప్రభావంతో రుతుపవన ముందస్తు వర్షాలు కురిస్తే తాత్కాలికంగా ఒకరోజు ఉపశమనం ఉంటుందన్నారు.
మూడోసారి పెట్రో బాదుడు
లీటరు పెట్రోల్ రూ.113.52,
డీజిల్ రూ.101.26
వారం వ్యవధిలో పెట్రోల్‌పై రూ.5.18,
డీజిల్‌పై రూ.4.04 పెంపు
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలపై కేంద్రం భారీగా ఇంధన భారం మోపుతుంది. ఒక్కసారిగా పెంచితే వ్యతిరేకత వస్తుందని, దఫదఫాలుగా వడ్డిస్తూ వస్తోంది. శనివారం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు మరో రూ.95 పైసలు పెంచింది. పెరిగిన ధరలతో లీటరు పెట్రోల్ ధర రూ.113.52, డీజిల్ రూ.101.26 పైసలకు చేరింది. ఈనెల 15వ తేదీన పెట్రోల్‌పై రూ.3.28 పైసలు, డీజిల్‌పై రూ.3.14, 19న రూ.95 పైసలు, తాజాగా శనివారం 95 పైసలు పెంచింది. వారం రోజుల వ్యవధిలో పెట్రోల్‌పై రూ.5.18, డీజిల్‌పై రూ.4.04 పెంచినట్టయ్యింది. త్వరలో రేట్లు ఇంకా పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
51 చోరీ కేసుల్లో 60 మంది అరెస్టు
రూ.1.04 కోట్లు విలువైన సొత్తు స్వాధీనం
రికవరీ మేళాలో బాధితులకు అందజేసిన సీపీ శంఖబ్రత బాగ్చీ
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 60 చోరీ కేసులు నమోదు కాగా, 51 కేసులను పోలీసులు ఛేదించారు. అరవై మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1,04,62,906 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏర్పాటుచేసిన క్రైమ్‌మేళాలో రికవరీ చేసిన చోరీ సొత్తును బాధితులకు సీపీ శంఖబ్రతబాగ్చి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించామన్నారు. వారి నుంచి 924.14 గ్రాముల బంగారం, 4.5 కిలోల వెండి, రూ.12 లక్షలు నగదు, 12 మోటారు సైకిళ్లు, మూడు ఆటోలు, మూడు ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో చోరీల నియంత్రణకు గత నెలలో 502 సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు 190 అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. క్రైమ్ రికవరీ మేళా పేరుతో గత రెండేళ్లలో 9,202 మంది బాధితులకు రూ.21.98 కోట్లు విలువైన సొత్తును అందజేశామన్నారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ లతాకుమారి, క్రైమ్ ఏసీపీ బి.భవ్య తదితరులు పాల్గొన్నారు.
వార్డుల పునర్విభజనపై 420 అభ్యంతరాలు
సరిహద్దులపై కొన్ని, 150కు పెంచాలని మరికొన్ని...
మరో రెండు రోజులు సమయం
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులుగా విభజిస్తూ విడుదల చేసిన ప్రాథమిక ముసాయిదా నోటిఫికేషన్‌పై టౌన్‌ప్లానింగ్ అధికారులకు శనివారం సాయంత్రానికి 420 అభ్యంతరాలు అందాయి. కొత్తగా ఏర్పాటుచేసిన వార్డుల సరిహద్దులను నిర్ణయిస్తూ జీవీఎంసీ కమిషనర్ ఈనెల 18న ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వివరాలను జీవీఎంసీ వెబ్‌సైట్‌తోపాటు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు 25వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఈ నేపత్యంలో వార్డుల సరిహద్దుల నిర్ణయం సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు, వార్డుల సంఖ్యను 150కి పెంచాలని మరికొందరు, ఒకవార్డులో చేర్చిన కాలనీలను మరొక వార్డుకి మార్చాలని విజ్ఞప్తి చేస్తూ ఇంకొందరు వినతిపత్రాలను అందజేశారు. మరో రెండు రోజులు సమయం ఉన్నందున మరో 350 వరకు అభ్యంతరాలు అందవచ్చునని జీవీఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. వాటన్నింటినీ పరిశించిన తర్వాత పరిగణనలోకి తీసుకోదగిన వాటిని వేరు చేసి వార్డుల పునర్విభజన ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేసి తుది ముసాయిదాను ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ పంపిస్తారు. అభ్యంతరాలు అందజేసిన వారందరికీ వారి విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ జీవీఎంసీ అధికారులు సమాధానం పంపించాల్సి ఉంటుంది.