రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:33 AM
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సమీపాన సముద్రంలో బోటు బోల్తాపడడంతో ఒక మత్స్యకారుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
మత్స్యకారుడి మృతి
సింహాద్రి భార్యకు ఫోన్‌లో హోం మంత్రి పరామర్శ
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన అనిత
ఎస్.రాయవరం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సమీపాన సముద్రంలో బోటు బోల్తాపడడంతో ఒక మత్స్యకారుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తరేవుపోలవరం గ్రామానికి చెందిన చోడిపల్లి సింహాద్రి (49), అర్జిల్లి చిన్న, అర్జిల్లి రమణ, సూరాడ బంగారి సోమవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో రేవుపోలవరం తీరం నుంచి బోటుపై చేపల వేటకు బయలుదేరారు. కొద్దిసేపటికే కెరటాల ఉధృతికి బోటు సముద్రంలో బోల్తాపడింది. దీంతో నలుగురిలో ముగ్గురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, చోడిపల్లి సింహాద్రి గల్లంతయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు పలువురు వెంటనే సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. బోల్తాపడిన బోటును ఒడ్డుకు తీసుకువచ్చారు. ఉదయం ఎనిమిది గంటల సమయానికి సమీపంలో ఉన్న బంగారమ్మపాలెం తీరంలో సింహాద్రి మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై మృతుడి కుటుంబీకులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
సింహాద్రి భార్యకు ఫోన్‌లో మంత్రి అనిత పరామర్శ
మండలంలోని రేవుపోలవరం సముద్రతీరంలో జరిగిన బోల్తా ప్రమాదంలో మృతిచెందిన చోడిపల్లి సింహాద్రి భార్య జగదీశ్వకి హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం రాత్రి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, మృతిచెందిన సింహాద్రి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఆమె ఆదేశాల మేరకు సింహాద్రి అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల నగదును టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, కొరుప్రోలు పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి గుర్రం రామకృష్ణ, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ఎన్.వెంకటరాజు చేతుల మీదగా జగదీశ్వరికి అందజేశారు.