Share News

రక్తమోడిన రహదారి

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:51 AM

జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలతోసహా ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటనల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

రక్తమోడిన రహదారి

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద బైక్‌ను ఢీకొన్న లారీ

తల్లీకూతురు దుర్మరణం

కుమార్తెకు వివాహమై మూడు నెలలే!

ధర్మసాగరం జంక్షన్‌ వద్ద కారు, బైక్‌ ఢీ

కారులో ప్రయాణిస్తున్న యువకుడి మృతి

------

జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలతోసహా ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటనల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

-----

నక్కపల్లి/ఎస్‌.రాయవరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతిచెందారు. కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహమైంది. మృతులిద్దరూ చినతీనార్లకు చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

చినతీనార్లకు చెందిన వాసుపల్లి రత్నకుమారి (26)కి, ఇదే గ్రామానికి చెందిన సమీప బంధువు వరుపుల నారాయణతో మూడు నెలల క్రితం వివాహమైంది. నారాయణ శనివారం ఉదయం భార్య రత్నకుమారితోపాటు అత్త వాసుపల్లి నూకతల్లి (51)ని బైక్‌పై ఎక్కించుకొని రాంబిల్లి బయలుదేరారు. సుమారు పది నిమిషాలు ప్రయాణించిన తరువాత ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో ఫైఓవర్‌ దిగిన తరువాత వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో బైక్‌ నడుపుతున్న నారాయణ ఎడమవైపున, అతని భార్య రత్నకుమారి, అత్త నూకతల్లి కుడివైపున పడిపోయారు. రెప్పపాటులో అదే లారీ వెనుకటైర్లు వీరిద్దరి మీదుగా వెళ్లడంతో శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందారు. నారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రోడ్డు ప్రమాదలో తల్లీకూతురు మృతిచెందడంతో చినతీనార్లలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలకు నక్కపల్లి సీహెచ్‌సీ మార్చురీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు నెలల క్రితం వివాహమై సంతోషంగా గడుపుతున్నామని, ఇంతలోనే లారీ రూపంలో వచ్చిన మృత్యువు తన కళ్లేదుటే భార్యతోపాటు అత్తను కూడా కబళించిందని నారాయణరావు వాపోయారు.

ధర్మసాగరం జంక్షన్‌ సమీపంలో...

నర్సీపట్నం అర్బన్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మసాగరం జంక్షన్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. నర్సీపట్నం రూరల్‌ ఎస్‌ఐ పి.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం..

నాతవరం మండలం వై.డి.పట్నం పంచాయతీ శివారు కొత్త యల్లవరం గ్రామానికి చెందిన అవిడి దుర్గాప్రసాద్‌ (19), అతని స్నేహితుడు కార్తీక్‌ కలిసి కారులో శనివారం ఉదయం కోటవురట్ల మండలం జల్లూరు వెళ్లారు. అక్కడ పనిముగించుకొని తిరిగి నర్సీపట్నం వస్తున్నారు. కార్తీక్‌ కారు నడుపుతుండగా, దుర్గాప్రసాద్‌ పక్క సీట్లో కూర్చున్నాడు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం జంక్షన్‌ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుకు ఎడమ పక్కన వున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవింగ్‌ చేస్తున్న కార్తీక్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా బైకుపై ప్రయాణిస్తున్న కోటవురట్ల మండలం సన్యాసిరాజుపాలెం గ్రామానికి చెందిన సుర్ల అప్పలరాజు, సుర్ల రామునాయుడు, రామచంద్రపురం గ్రామానికి చెందిన ఎస్‌.రమణలకు తీవ్రగాయాలయ్యాయి. వీరినిఇ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో విశాఖపట్నం పంపారు. మృతుడి తండ్రి వరహాలు ప్రసాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రూరల్‌ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

----------------------------------------

కొత్తపోలవరం రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతులు

ఎస్‌.రాయవరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపోలవరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయలైన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మండలంలోని గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో రేవుపోలవరం సముద్రతీరం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా కొత్తపోలవరం వద్ద ప్రమాదానికి గురై ఇద్దరు యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కురందాసు దుర్గాప్రసాద్‌ (19) పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్టు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు. దుర్గాప్రసాద్‌ నక్కపల్లి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

గేదెను కాపాడబోయి...

బురదలో కూరుకుపోయి యువకుడి మృతి

కొత్తూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చెరువలో దిగబడిపోయిన గేదెను కాపాడే యత్రంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గొలగాంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

అనకాపల్లి మండలం గొలగాం గ్రామానికి చెందిన శెలపరెడ్డి మణికంఠ (25) డిగ్రీ పూర్తి చేశాడు. ఒకవైపు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, మరోవైపు వ్యవసాయం, పశుపోషణలో కుటుంబానికి చేదోడువాదోడుగా వుంటున్నాడు. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గేదె చెరువులో దిగి, బురదలో ఇరుక్కుపోయింది. దీనిని గమనించిన మణికంఠ... గేదెను బయటకు తీసుకువచ్చేందుకు చెరువులో దిగాడు. ఈ క్రమంలో ఇతను కూడా బురదలో కూరుకుపోయి నీటిలో మునిగిపోతూ.. కాపాడంటూ పెద్దగా కేకలు వేశారు. కొద్ది దూరంలో వున్న రైతులు చెరువు వద్దకు వెళ్లేసరికి మణికంఠ పూర్తిగా నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని అనకాపల్లి రూరల్‌ పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి తెలియపరిచారు. మణికంఠ తల్లిదండ్రులు నాగరాజు, అనంత, మృతుడు తమ్ముడు జశ్వంత్‌ చెరువు వద్దకు చేరుకొని బోరున విలపించారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి చనిపోయిన గేదెను, మణికంఠ మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 15 , 2026 | 12:51 AM