రక్తమోడిన రహదారి
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:25 AM
నగరంలోని బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద ఆదివారం వేర్వేరు సమయాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.
బీహెచ్‌పీవీ జంక్షన్‌లో ఒకేరోజు రెండు ప్రమాదాలు
ఉదయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాలర్ లారీ బీభత్సం
ముందుకున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో కాబోయే పెళ్లికుమారుడు, మరో వ్యక్తి దుర్మరణం
పలువురికి గాయాలు
మధ్యాహ్నం అదుపుతప్పిన ద్విచక్ర వాహనం
ఒక విద్యార్థిని మృతి, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
నగరంలోని బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద ఆదివారం వేర్వేరు సమయాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగివున్న వాహనాలపైకి వెనుక నుంచి వస్తున్న ట్రాలర్ లారీ దూసుకుపోవడంతో కాబోయే పెళ్లికుమారుడు, టెన్త్ చదువుతున్న బాలిక తండ్రి దుర్మరణం పాలయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
వచ్చే నెల 11న పెళ్లి.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు..
కుమార్తెకు టెన్త్ పరీక్షలు.. అప్పన్నకు పూజలు చేయడానికి వెళుతూ తండ్రి మృతి
అక్కిరెడ్డిపాలెం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
ఆ యువకుడికి వచ్చే నెలలో వివాహ ముహూర్తం నిశ్చమైంది. పెళ్లి విషయాలకు సంబంధించి అత్తింటి వారితో మాట్లాడి, ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఇదే సమయంలో మరో వ్యక్తి పదో తరగతి చదువుతున్న కుమార్తెను ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించడానికి ద్విచక్ర వాహనంపై తీసుకెళుతున్నాడు. బీహెచ్‌పీవీ జంక్షన్‌లో సిగ్నల్ పడడంతో ఆగిన వీరి వాహనాలతోపాటు అక్కడ వున్న పలు వాహనాలపైకి వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రాలర్ లారీ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వచ్చే నెలలో వివాహం కానున్న యువకుడితోపాటు కుమార్తెను ఆలయానికి తీసుకెళుతున్న మరో వ్యక్తి మృతిచెందారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. బీహెచ్‌పీవీ జంక్షన్‌లో కొంతసేపు భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నగరంలోని మారికవలసకు చెందిన బొబ్బిలి సతీశ్ (30) ఒక ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గాజువాకకు చెందిన ఒక యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. వచ్చే నెల 11వ తేదీన వివాహం చేయాలని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి కాబోయే అత్తింటి వారితో మాట్లాడడానికి సతీశ్ శనివారం గాజువాక వచ్చాడు. రాత్రికి ఇక్కడే వుండి ఆదివారం ఉదయం తిరిగి ద్విచక్ర వాహనంపై మారికవలస బయలుదేరాడు. దారిలో బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగాడు. మరోవైపు గాజువాక శ్రీనగర్‌కు చెందిన కోరాడ రామకృష్ణ (50) స్థానిక వరుణ్ మోటర్స్ కంపెనీలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం కుమార్తె అనుపమ పదో తరగతి పరీక్షకు హాజరు కానుండడంతో సింహాచలం వెళ్లి వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజ చేయిద్దామని కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఇదే సమయంలో గంగవరం పోర్టు నుంచి మెటీరియల్ లోడుతో షీలానగర్ వైపు వెళుతున్న ట్రాలర్ లారీ బీహెచ్‌పీవీ జంక్షన్‌లో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ఆగకుండా ముందుకు వచ్చి, అప్పటికే ఆగి వున్న మూడు ద్విచక్ర వాహనాలను, ఇన్నోవాను బలంగా ఢీకొని, సుమారు వంద మీటర్ల దూరం వెళ్లింది. ద్విచక్రవాహనంపై వున్న రామకృష్ణ కుడివైపునకు, కుమార్తె అనుపమ ఎడమవైపునకు పడిపోయారు. దీంతో రామకృష్ణ మీద నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే సమయంలో మరొక ద్విచక్ర వాహనంపై వున్న బొబ్బిలి సతీశ్ (30) మీద నుంచి కూడా లారీ వెళ్లడంతో మృతిచెందాడు. ఈ ప్రమాదంతో రామకృష్ణ కుమార్తె అనుపమ, మరో ద్విచక్ర వాహనంపై వున్న గాజువాకకు చెందిన రవికుమార్, ఇన్నోవా కారులో వున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు
కాగా ఈ ప్రమాదం జరిగే సమయంలో బొబ్బిలి సతీశ్ తండ్రి ఈశ్వరరావు గాజువాక ప్రాంతంలోనే వున్నారు. కొద్దిసేపటికి మారకవలస వెళుతూ.. దారిలో బీహెచ్‌పీవీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఆగారు. అక్కడ కుమారుడి బైక్ కనిపించడంతో ఆందోళన చెందారు. సతీశ్ మృతదేహం రోడ్డుపై కనిపించడంతో భోరున విలపించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడిని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయారు. ఈశ్వరరావు కన్నీరుమున్నీరు కావడం అక్కడ వున్న వారి హృదయాలను ద్రవింపజేసింది.
కళ్ల ముందే తండ్రి మృతి
ఈ ప్రమాదంలో కోరాడ రామకృష్ణ కుమార్తె అనుపమ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కళ్లెదుట తండ్రి మీదుగా లారీ వెళ్లడం, శరీరం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడాన్ని చూసి షాక్‌కు గురైంది. కొద్దిసేపటి తరువాత తేరుకొని కన్నీరుమున్నీరైంది. రామకృష్ణ భార్య రాజ్యలక్ష్మి స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు.
కాగా రోడ్డు ప్రమాదంతో గాజువాక వైపు నుంచి ఎన్‌ఏడీ వైపు వెళ్లే వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సంఘటన జరిగిన అర్ధగంటలో పోలీసులు పంచనామా పూర్తిచేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గాజువాక పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం
ఒక విద్యార్థిని మృతి, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
అక్కిరెడ్డిపాలెం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిపై బీహెచ్‌పీవీ జంక్షన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతిచెందగా మరో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఆడారి మహాలక్ష్మి (20), పార్వతీపురానికి చెందిన చిప్పాడ అనూష కాకినాడలో డిప్లొమా (పాలిటెక్నిక్) చదువుతున్నారు. కొద్ది రోజుల నుంచి విశాఖలోని ‘భెల్-హెచ్‌పీవీపీ’లో (బీహెచ్‌పీవీ) మహాలక్ష్మి ఫైనాన్స్ విభాగంలో, అనూష మార్కెటింగ్ విభాగంలోఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. నాతయ్యపాలెంలో రూమ్ అద్దెకు తీసుకుని వుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం అనూష బంధువు ఒకరు స్కూటీపై వీరి వద్దకు వచ్చారు. అతనిని ఇంటి వద్ద వుంచి, వీరిరువురు స్కూటీపై గాజువాక వెళ్లేందుకు బయలుదేరారు. దారిలో బీహెచ్‌పీవీ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌పై వున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొన్నారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహాలక్ష్మి చికిత్స పొందుతూ మృతిచెందింది. అనూష్ పరిస్థితి ఆందోళనకరంగానే వుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.