రక్తమోడుతున్న జాతీయ రహదారి
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:33 AM
జాతీయ రహదారి రక్తమోడుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం జరగడం సర్వసాధారణంగా మారిపోయింది.
హైవేపైనే అత్యధిక ప్రమాదాలు
గత ఏడాది 440 ప్రమాదాలు, 157 మంది మృతి
భారీవాహనాల రాకపోకలు పెరగడమే కారణం
ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా నిర్మించిన రహదారిలోకి మళ్లిస్తే చాలావరకూ సమస్య పరిష్కారం
పట్టించుకోని పోలీస్ అధికారులు
హైవే తరువాత స్థానంలో బీఆర్‌టీఎస్ కారిడార్, బీచ్‌రోడ్డు...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జాతీయ రహదారి రక్తమోడుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. నగరంలో జరుగుతున్న ప్రమాదాల్లో దాదాపు సగం జాతీయ రహదారిపైనే జరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏటా సగటున 1,100కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 360 మంది వరకూ ప్రాణాలు కోల్పోతుండగా, మరో 1,100 మంది గాయపడుతున్నారు. ప్రధానంగా నగరం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుండడం ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. గత ఏడాది పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,119 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 356 మంది ప్రాణాలు కోల్పోగా, 1,063 మంది గాయపడ్డారు. అందులో 440 ప్రమాదాలు తగరపువలస నుంచి లంకెలపాలెం వరకూ గల జాతీయ రహదారిపైనే జరిగాయి. వాటిల్లో 157 మంది మృత్యువాతపడగా, 405 మంది గాయపడ్డారు. అంటే నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలతోపాటు నమోదైన మరణాల్లో సగం జాతీయ రహదారిపైనే జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ రహదారి తర్వాత బీఆర్‌టీఎస్ రోడ్డుపై 117 ప్రమాదాలు జరగ్గా, 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 122 మంది గాయపడ్డారు. తర్వాత బీచ్‌రోడ్డులో అత్యధికంగా 54 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 12 మంది మృతిచెందగా, 70 మంది గాయపడ్డారు. నగరంలోని ఇతర రోడ్లపై 415 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 108 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 380 మంది గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలన్నీ నగరం మధ్య నుంచి ఉన్న జాతీయ రహదారిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాల వల్ల కూడళ్ల వద్ద ట్రాఫిక్‌జామ్ అవ్వడంతోపాటు వాటిపై యంత్రాలు, కంటెయినర్లు వంటి ఎత్తైన లోడ్‌లు ఉండడంతో పక్క నుంచి వచ్చే వాహనాలను ఇతర వాహన చోదకులు గుర్తించే అవకాశం ఉండడం లేదు. ఇది ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా అనకాపల్లికి కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చినప్పటికీ భారీ వాహనాలు నగరంలో నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఆనందపురం వద్ద నుంచి భారీ వాహనాలను పెందుర్తి మీదుగా అనకాపల్లి వైపు మళ్లించగలిగితే నగరంలో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ దిశగా ఎందుచేతనో పోలీసులు ఆలోచించడం లేదు.
ఇక నగర పరిధిలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కృషిచేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్‌పై దృష్టిపెట్టకుండా రోడ్డుపక్కన చాటుగా నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వారిని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడం, పెండింగ్ చలాన్‌లను వసూలుచేయడానికి గుంపుగా ఒకచోట చేరిపోవడం చేస్తున్నారు. దీనివల్ల కూడళ్ల వద్ద కొంతమంది వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించి ముందుకువెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు
రహదారి వర్గీకరణ ప్రమాదాలు మృతులు గాయపడినవారు
ఎన్‌హెచ్-16 440 157 405
స్టేట్ హైవే 30 13 38
బీఆర్‌టీఎస్ 120 38 122
పోర్టు రోడ్డు 34 17 27
స్టీల్‌ప్లాంట్ రోడ్డు 16 3 15
బీచ్‌రోడ్డు 54 12 70
ఫ్లైఓవర్ బ్రిడ్జి 10 8 6
ఇతర రోడ్లు 415 108 380
మొత్తం 1119 356 1063