Share News

నగర వనాలకు నిర్లక్ష్యపు చీడ!

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:53 AM

పట్టణ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన నగర వనాల ఏర్పాటు పనులు ముందుకు కదలడం లేదు. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటుకు అటవీశాఖ స్థలాలు గుర్తించి, పరిపాలనా పరమైన ఆమోదం పొందింది. కానీ జిల్లా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగర వనాలకు నిర్లక్ష్యపు చీడ!
నర్సీపట్నంలోని ఆరిలోవ అటవీశాఖ నగర వనం దుస్థితి

- అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం

- నిధులు మంజూరు చేసినా ముందుకు సాగని పనులు

- అటవీ శాఖాధికారుల అలసత్వం కారణంగా నెరవేరని లక్ష్యం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

పట్టణ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన నగర వనాల ఏర్పాటు పనులు ముందుకు కదలడం లేదు. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటుకు అటవీశాఖ స్థలాలు గుర్తించి, పరిపాలనా పరమైన ఆమోదం పొందింది. కానీ జిల్లా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలం బయ్యవరంలో అటవీశాఖ నగరవనం ఏర్పాటుకు 50 హెక్టార్ల రిజర్వు అటవీ భూమిని ఎంపిక చేసింది. అక్కడ ఉద్యాన వనం అభివృద్ధి పనుల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు రూ.1.4 కోట్లు ఖర్చు చేసింది గానీ పనులు మాత్రం పూర్తికాలేదు. అరకొర పనులు చేపట్టి వృథాగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బయ్యవరంలో నగర వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించి రూ.60 లక్షలు కేటాయించింది. గత ఏడాది మార్చి నెలలో ఈ పనులు ప్రారంభించిన అటవీఽశాఖాధికారులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎలమంచిలి మండలం ఎర్రవరం గ్రామానికి సమీపంలో వేమగిరి రిజర్వు అటవీ భూముల్లో నగర వనం ఏర్పాటుకు రూ.1.15 కోట్లు కేటాయించారు. నిధులు విడుదలైనా పనుల్లో మాత్రం పురోగతి లేదు. చుట్టూ హద్దులు నిర్ణయించి వదిలేశారు. నర్సీపట్నం నుంచి గొలుగొండ వెళ్లే మార్గంలో గల ఆరిలోవలో రూ.1.23 కోట్లతో నగరవనాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం రోడ్డు ఫార్మేషన్‌ పనులు చేపట్టి నిర్మాణాలు నిలిపి వేశారు. నగర వనాల ద్వారా పట్టణాల్లో పచ్చదనం పెంపుతో పాటు ప్రజలకు వాకింగ్‌ ట్రాక్‌లు, విశ్రాంతి భవనాలు, పిల్లలకు వినోద సౌకర్యాలు అందుబాటులోకి తేవాల్సి ఉండగా, నిధులున్నా పనులు ముందుకు కదలడం లేదు.

కలెక్టర్‌కు తప్పుడు నివేదిక

నగర వనాల ఏర్పాటుకు గత ఏడాది మార్చిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసినా జిల్లా అటవీశాఖాధికారులు పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. కాగా ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అందజేయాల్సిన నివేదికలో మాత్రం జిల్లాలో అటవీశాఖ ద్వారా చేపడుతున్న మూడు నగర వనాల నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు నివేదికలు ఇచ్చేశారు. దీనిపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నగర వనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పనులు జరిపించడంలో శ్రద్ధ చూపకపోవడంతో నగర వనాల అభివృద్ధి లక్ష్యం నీరుగారిపోయిందని స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పర్యావరణ ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:54 AM