Share News

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్‌

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:04 AM

ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్‌

ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

మరో విద్యార్థికి తీవ్ర గాయాలు

భీమునిపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన భీమిలి మండల పరిధిలోని దొరతోట కూడలిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సుమారు 15 మంది నగరంలో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వచ్చారు. వారంతా భీమిలిలోని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెందుర్తికి చెందిన ఆర్‌.గౌతమ్‌ (22), విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన పి.రవికిరణ్‌ (21) బైక్‌పై నేరేళ్లవలస నుంచి తాళ్లవలస ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు చేరే క్రమంలో భీమిలి వస్తున్న 999 మెట్రో సిటీ బస్సును ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ బస్సు ముందు టైరు కింద పడిపోయారు. బస్సు సుమారు పది మీటర్ల దూరం బైక్‌ను ఈడ్చుకుని పోయింది. బైక్‌ను నడుపుతున్న గౌతమ్‌ హెల్మెట్‌ కిందపడి తలకు తీవ్ర గాయమవడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన రవికిరణ్‌కు ఆరిలోవలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రమాదంపై ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు ఎస్‌ఐ సురేశ్‌ దర్యాప్తు చేస్తున్నారని సీఐ దివాకర్‌ యాదవ్‌ తలిపారు. కాగా మెట్రోబస్సు, బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. వాల్తేరు డిపో మేనేజర్‌, విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు తీసుకువచ్చిన కాంట్రాక్టర్‌ స్టేషన్‌కు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారని సమాచారం.

Updated Date - Aug 12 , 2026 | 01:04 AM