మన్యం అందాలు కనువిందు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:33 PM
పర్యాటకులతో మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం పోటెత్తాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ప్రకృతి అందాలు రమణీయంగా కనిపిస్తుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు.
పోటెత్తిన పర్యాటకులు
లంబసింగి, చెరువులవేనం, వంజంగి మేఘాల కొండల వద్ద రద్దీ
పాడేరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పర్యాటకులతో మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం పోటెత్తాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, ప్రకృతి అందాలు రమణీయంగా కనిపిస్తుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో అన్ని పర్యాటక కేంద్రాల్లో సందడి నెలకొంది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల కోలాహలం కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
వంజంగి మేఘాల కొండపై...
పాడేరురూరల్: మండలంలోని వంజంగి మేఘాల కొండకు ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వంజంగి రిసార్ట్స్, హట్ వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాలను పర్యాటకులు ఎంజాయ్ చేశారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో పాడేరులోని హోటళ్లు, లాడ్జిలు, వంజంగి రిసార్ట్స్ కిటకిటలాడాయి. పాడేరులోని ప్రధాన రహదారులు రద్దీగా మారడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆదివారం వంజంగి మేఘాల కొండను 1,547 మంది పర్యాటకులు సందర్శించగా ఎకో టూరిజానికి రూ.84,750 ఆదాయం వచ్చిందని ఆటవీశాఖ డీఆర్‌వో కె.కాళీప్రసాద్ తెలిపారు.