Share News

కొత్త జిల్లాలే ప్రాతిపదిక

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:21 AM

గత ప్రభుత్వంలో ఏర్పడిన కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులపై విద్యాశాఖ భారీ కసరత్తు చేసింది.

కొత్త జిల్లాలే ప్రాతిపదిక

ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపుపై విద్యాశాఖ కసరత్తు

ఉమ్మడి జిల్లాలో మంజూరైన పోస్టులు 10,893

మండల, జడ్పీ పరిధిలో 9,950, ప్రభుత్వ పాఠశాలల్లో 943

అనకాపల్లి జిల్లాకు 51.14 శాతం, అల్లూరి జిల్లాకు 27.36 విశాఖకు 21.5 శాతం పోస్టులు

ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

గత ప్రభుత్వంలో ఏర్పడిన కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులపై విద్యాశాఖ భారీ కసరత్తు చేసింది. ఉమ్మడి జిల్లాలో మండల/జడ్పీ/ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పోస్టులు 10,893. వాటిలో జడ్పీ/మండల పరిషత్‌ పాఠశాలల్లో పోస్టులు 9,950, ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులు 943 ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మునిసిపల్‌ పాఠశాలల్లో మంజూరైన పోస్టులకు ఇంకా కసరత్తుచేయాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లా ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఏర్పడి 2022 ఏప్రిల్‌ నుంచి పాలన మొదలైంది. కొత్త జిల్లాలు ఏర్పడినా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎక్కడి వారు అక్కడే పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జోనల్‌ విధానం మేరకు స్థానికతను పరిగణనలోనికి తీసుకోవడం, జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించాలన్న నిర్ణయానికి అనుగుణంగా విద్యాశాఖ కసరత్తు చేసింది. పాఠశాల విద్యకు సంబంధించి మండల/జడ్పీ పాఠశాలలు, ప్రభుత్వ, మునిసిపల్‌ పాఠశాలలున్నాయి. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పాఠశాలలున్నా అవి అక్కడికే పరిమితం.

పోస్టుల విభజన ఇలా...

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులు, పాఠశాలలను పరిగణనలోనికి తీసుకుని మంజూరైన పోస్టులను విభజించారు. మండల/జడ్పీ పాఠశాలలు, ప్రభుత్వ, మునిసిపల్‌ పాఠశాలల్లో మంజూరైన పోస్టులు 10,893గా లెక్కించారు. ఇందులో మండల/ జడ్పీ పాఠశాలల్లో 9,950 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 943 పోస్టులున్నాయి. ఉపాధ్యాయులు, పాఠశాలల మేరకు అనకాపల్లి జిల్లాకు 5,403, విశాఖ జిల్లాకు 2,214, అల్లూరి జిల్లాకు 2,333 పోస్టులు కేటాయించారు. ప్రభుత్వ పరిధిలోని 943 పోస్టుల్లో అల్లూరి జిల్లాకు 647, అనకాపల్లికి 168, విశాఖకు 128 కేటాయించారు. మండల/జడ్పీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కలిపి అనకాపల్లి జిల్లాకు 5,571, అల్లూరి జిల్లాకు 2,980, విశాఖకు 2,342 పోస్టులు కేటాయించాలని ప్రతిపాదించారు.

కేటగిరీ వారీగా...

మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ కేటగిరీలో 5,615 (51.55 శాతం) ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కేటగిరీ వారీగా చూస్తే గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు 295, స్కూలు అసిస్టెంట్‌ కేటగిరీలో గణితం పోస్టులు 708, ఫిజికల్‌ సైన్స్‌ 504, బయాలజీ 528, ఇంగ్లీష్‌ 633, సోషల్‌ స్టడీస్‌ 593, తెలుగు 552, హిందీ 474, పీఈటీ పోస్టులు 376 ఉన్నాయి. వాటిలో మండల/జడ్పీ పోస్టులే ఎక్కువ. ఇంకా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులు 563, డ్రాయింగ్‌ 11, క్రాఫ్ట్‌ 17, ఒకేషనల్‌ 21, సంగీతం మూడు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా అనకాపల్లి జిల్లాకు 5,571 పోస్టులు (51.14శాతం), అల్లూరి జిల్లాకు 2,980 (27.36శాతం), విశాఖపట్నం జిల్లాకు 2,342 (21.5 శాతం) కేటాయించారు. ఇందులో కొన్ని మార్పులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మండల/జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్‌ పాఠశాలలకు మంజూరుచేసిన పోస్టుల వివరాలపై ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపనున్నది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారన్న వివరాలు వెల్లడికాలేదు. గత ఏడాది డీఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేసిన తరువాత మూడు జిల్లాల్లో ప్రతినెలా పలువురు పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పటివరకు మంజూరైన, పనిచేస్తున్న పోస్టుల వివరాలు ప్రభుత్వానికి పంపిన తరువాత సీనియారిటీ మేరకు జిల్లాలు కేటాయించనున్నారు. ఈ మేరకు టీచర్లను ఆప్షన్‌ అడుగుతున్నారు. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 15 , 2026 | 12:21 AM