Share News

రాష్ర్టాభివృద్ధికి అవరోధంగా గొడ్డలి పార్టీ

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:53 AM

రాష్ట్రంలో విధ్వంసాలే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీని శాశ్వతంగా బహిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

రాష్ర్టాభివృద్ధికి అవరోధంగా గొడ్డలి పార్టీ

విధ్వంసాలే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీని బహిష్కరించాలి

కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న కొంతమంది కార్మిక సంఘ నేతలు

రంగులు మార్చే వారిని కార్మికులు దగ్గరకు రానివ్వకూడదు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో విధ్వంసాలే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీని శాశ్వతంగా బహిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పార్టీ అవరోధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్టీల్‌ప్లాంటు అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు పట్టించుకోని వైసీపీ నేతలు...నేడు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గొడ్డలి పార్టీని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటులో పదవీ విరమణ చేసిన కొంతమంది కార్మిక నేతలు...కర్మాగారంపై, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రంగులు మార్చే కార్మిక నాయకులను దగ్గరకు రానివ్వరాదని కార్మికులకు పల్లా పిలుపునిచ్చారు. పదవీ విరమణ చేసిన కార్మికులు ప్లాంటు ప్రగతి కోసం పాటుపడాలని, అంతేగానీ చేటు చేసే విధంగా వ్యవహరించరాదన్నారు. ప్లాంటులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రతి ఒక్కరికీ ఒకేవిధంగా నష్ట పరిహారంతో పాటు పర్మినెంట్‌ ఉద్యోగం ఇస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌, ఎండీ రఫీ, నాయకులు నల్లూరు సూర్యనారాయణ, మొల్లి పెంటిరాజు, బలగ బాలునాయుడు, గాంధీ, సత్యారావు, అడుసుమల్లి దీప్తి, శివప్రసాద్‌ పాల్గొన్నారు.


క్యాంపస్‌లో కలకలం

ఉద్యోగాల పేరిట ఏయూ

ఉద్యోగుల దందాపై అధికారుల ఆరా

మరోవైపు డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు దళారుల ఫోన్లు

డబ్బులు ఇచ్చేస్తాం...ఈ వ్యవహారం ఇంతటితో వదిలేయాలంటూ వేడుకోలు

విశాఖపట్నం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల పేరుతో కొంతమంది ఉద్యోగులు వసూళ్లకు పాల్పడిన వ్యవహారం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై ‘ఏయూలో ఉద్యోగాల పేరిట వంచన’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ అధికారులు ఆరా తీయడంతో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ వ్యవహారం బయటకు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. తమకు డబ్బులు చెల్లించిన అభ్యర్థులకు దళారులు ఫోన్లు చేసి ‘మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం, ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడండి’ అని కోరుతున్నారు. కాదని రోడ్డెక్కితే ‘మాతోపాటు మీరు ఇబ్బందులు పడతారు’ అంటూ బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు.

ఫిర్యాదు రాలేదన్న వర్సిటీ అధికారులు..

ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై అధికారులు శనివారం స్పందించారు. దీనిపై ఇప్పటివరకూ తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు తెలిపారు. ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయం పేరును దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితులు ఎవరైనా తమను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని, వర్సిటీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్సిటీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఖాళీలు ఉంటే వాటిని ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్లు ద్వారా, ఏయూ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులు, మధ్యవర్తులను నమ్మి నిరుద్యోగులు ఎవరూ మోసపోవద్దన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:53 AM