Share News

ఆశ్రమాలను గాలి కొదిలేశారు!

ABN , Publish Date - May 02 , 2026 | 11:31 PM

గత కొన్నాళ్లుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను అధికారులు గాలికి వదిలేశారు. బోధన, ఇతర అభ్యాసన ప్రక్రియలు సక్రమంగా జరగడం లేదు. ఫలితంగానే ఆశ్రమాల్లో టెన్త్‌ ఫలితాలు ఘోరంగా దిగజారుతున్నాయి.

ఆశ్రమాలను గాలి కొదిలేశారు!
పాడేరు ఐటీడీఏ కార్యాలయం

బోధనపై కనీస పర్యవేక్షణ శూన్యం

ఫలితమే టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గుదలకు కారణం

ఐటీడీఏ పీవో మొదలు టీడబ్ల్యూ డీడీ, ఏటీడబ్ల్యూవోల వరకు అదే తంతు

రెండేళ్లుగా దుర్భరంగా మారిన గిరిజన సంక్షేమ విద్యాశాఖ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో 117 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులకు చెందిన 72 వేల మంది గిరిజన విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. అందులో 109 ఆశ్రమ పాఠశాలల్లో 5 వేల మంది పదో తరగతి గిరిజన విద్యార్థులున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంటారు. విద్యార్థులు సైతం దసరా, సంక్రాంతి సెలవులు మినహా అన్ని రోజుల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆశ్రమ పాఠశాలల్లోనే ఉంటారు. ఈక్రమంలో వారికి ఉద్దేశించిన ప్రత్యేక బోధనగాని, జనవరిలో ప్రారంభించే వంద రోజుల విద్యా ప్రణాళికను సైతం పక్కాగా అమలు చేయడం పెద్ద కష్టం కాదు. కాని అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో ఆశించిన స్థాయిలో టెన్త్‌లో ఫలితాలు సాధించలేకపోతున్నారని తెలుస్తోంది.

రెండేళ్లుగా ఆశ్రమాలపై పర్యవేక్షణ శూన్యం

ఆశ్రమ పాఠశాలలపై గత రెండేళ్లుగా కనీస పర్యవేక్షణ లేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఆశ్రమ పాఠశాలలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌, మండల స్థాయిలో సహాయ గిరిజన సంక్షేమాధికారుల నిత్యం పర్యవేక్షించేవారు. కాని గత రెండేళ్లుగా ఐటీడీఏ పీవోలు మొదలుకుని టీడబ్ల్యూ, ఏటీడబ్ల్యూ సైతం పర్యవేక్షణను మొక్కుబడి తంతుగా చేస్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా మరింతగా దిగజారుతున్నాయి. గత రెండేళ్లలో తొమ్మిది నెలలు ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీగా ఉంది. అంతకు ముందున్న ఐటీడీఏ పీవో సైతం ఏడాదిన్నర పనిచేసినా గిరిజన సంక్షేమ శాఖ విద్యపై కనీసం దృష్టిసారించలేదు. రెండేళ్లలో సుమారుగా ఏడాది గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగానే ఉంది. ఏడాది క్రితం ఆ పోస్టును భర్తీ చేసినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఉన్నారా? లేదా? అన్నట్టుగా పరిస్థిఽతులున్నాయి. దీంతో ఇక ఆశ్రమాల పర్యవేక్షణ, పరిస్థితులు సరిదిద్దడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలెక్కడా...?

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు ఎక్కడ జరిగిందనేది అర్థం కాక ప్రస్తుత ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది గిరిజన సంక్షేమ ఆశ్రమాలకు చెందిన 5,101 మంది టెన్త్‌ విద్యార్థుల్లో కేవలం 2,192 మందే పాస్‌ కావడంతో ఉత్తీర్ణత 42 శాతంగా నమోదైంది. గిరిజన సంక్షేమ విద్యాశాఖ చరిత్రలో ఇంత దారుణమైన ఫలితాలు గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు సీనియర్‌ ఉపాధ్యాయులు అంటున్నారు. కేవలం ఆశ్రమాల నిర్వహణపైనే దృష్టి సారిస్తూ, బోధనను విస్మరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందువల్లే ఆశించిన స్థాయిలో విద్యాబోధన సాగక ఫలితాలు దిగజారుగుతున్నాయని అంటున్నారు. గిరిజన సంక్షేమ విద్యాశాఖలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు, పరిణామాలను ఉన్నతాధికారులు పక్కాగా గుర్తించి, వాటిని సరి చేసి భవిష్యత్తులోనైనా చక్కని ఫలితాలను సాధించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 02 , 2026 | 11:31 PM