Share News

పోలవరం నీటి రాక సరే... నిల్వ ఎక్కడ??

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:06 AM

కూటమి నేతలు వచ్చే నెలాఖరుకే పోలవరం ఎడమ కాల్వ ద్వారా నగరానికి గోదావరి నీరు...అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

పోలవరం నీటి రాక సరే... నిల్వ ఎక్కడ??

ఎడమ కాల్వ ద్వారా నెల, రెండు నెలల్లో గోదావరి జలాలు వచ్చేస్తున్నాయంటూ నేతల ప్రకటనలు

స్టోరేజీ, నిర్వహణపై ప్రణాళిక శూన్యం

పూడికతో నిల్వ సామర్థ్యం తగ్గిన జిల్లాలోని రిజర్వాయర్లు

కొత్త రిజర్వాయర్ల నిర్మాణం ఊసే లేదు

ఏమీ లేకుండానే హడావిడిగా ప్రకటనలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కూటమి నేతలు వచ్చే నెలాఖరుకే పోలవరం ఎడమ కాల్వ ద్వారా నగరానికి గోదావరి నీరు...అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఒకవేళ ఇంకో మూడు నాలుగు నెలలకు ఆ నీరు వస్తుందని అనుకున్నా...దానిని నిల్వ చేయడానికి అవసరమైన వనరులు జిల్లాలో లేవు. దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వీటిపై దృష్టిపెట్టిన నాయకులు ఒక్కరు లేరు.

విశాఖపట్నం జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 25 లక్షల మంది ఉ్తన్నారు. నీటి అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. పరిశ్రమలతో పాటు గృహ అవసరాలకు కూడా జీవీఎంసీ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు ఇబ్బడిముబ్బడిగా డేటా సెంటర్లు రాబోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎడమ కాలువ ద్వారా పెద్దఎత్తున నీరు వస్తుందని, అందువల్ల ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు కంటే ముందు ఎడమ కాలువ నిర్మాణ పనులు మొదలెట్టారు. అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. వారు ఎక్కడికక్కడ మట్టి తవ్వేసి వదిలేశారు. ఇప్పుడు వాటిని పూర్తిచేయడానికి తంటాలు పడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పట్టించుకోకుండా ఎడమ కాలువ నీటి సరఫరాపై కూటమి నాయకులు తేదీలు ప్రకటించేస్తున్నారు. మొన్నటివరకు డిసెంబరు నాటికి విశాఖకు పోలవరం (గోదావరి) నీరు వస్తుందన్నారు. అది అయిపోయాక జూన్‌ నెలాఖరు అన్నారు. ఇప్పుడు అది కూడా పూర్తయిపోతోంది. పనులు మాత్రం పూర్తికాలేదు.

వచ్చే నీరు నిల్వ ఎలా..?

ఇంట్లో బోరు తవ్వించుకుంటే అందులో నీటిని నిల్వ చేసి ఉపయోగించుకోవడానికి ట్యాంకు నిర్మించుకుంటాం. అవసరమైనప్పుడు వాడుకుంటాం. పోలవరం ఎడమ కాలువ నీరు కూడా అంతే. అక్కడి నుంచే వచ్చే నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని, అక్కడి నుంచి అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేయాలి. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలుసు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్లు సరిపోవని, కొత్తవి కట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటికి భారీగా నిధులు అవసరం కావడంతో ఎవరూ అటు దృష్టిపెట్టడం లేదు. పోనీ ఉన్న రిజర్వాయర్లనే సమర్థంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు.

ప్రస్తుతం నగరవాసుల తాగునీటి అవసరాలు, పరిశ్రమల కోసం ఏలేరు రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా నీరు వస్తోంది. ఇంకా అనకాపల్లి జిల్లాలోని రైవాడ, విజయనగరం జిల్లాలోని తాటిపూడి, స్థానికంగా ఉన్న మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్ల నీరు ఉపయోగించుకోవడం జరుగుతోంది. అయితే ఈ రిజర్వాయర్ల నిర్వహణ పనులు గాలికి వదిలేసి చాలాకాలం అవుతోంది. వాటిలో పూడిక పేరుకుపోయింది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. నిర్మాణాలు కూడా చాలావరకు పాడయ్యాయి. క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి. భారీవర్షాలు పడినా ఆ నీరు రిజర్వాయర్లలోకి చేరే పరిస్థితి లేదు. వాటిని సరిచేయాల్సి ఉంది. నిధులు భారీగా అవసరం. జల వనరుల శాఖ ఈ విషయం సమావేశాల్లో అడపాదడపా ప్రస్తావిస్తున్నా వాటి నిర్వహణపై యంత్రాంగం, నాయకులు దృష్టి పెట్టడం లేదు. పోలవరం నీరు వచ్చేస్తోందంటున్నారు తప్ప...ఆ నీటిని నిల్వ చేసుకొని, సరఫరా చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఒక్క ముక్క చెప్పడం లేదు. భారీగా వచ్చే నీటిని నిల్వ చేయడానికి, సరఫరాకు ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదు. కొత్త రిజర్వాయర్లు నిర్మించాలి. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకు ముఖ్యంగా డేటా సెంటర్లు ఏర్పాటుచేసే ప్రాంతాలకు నీటిని అందించడానికి పైపులైన్లు వేయాలి. వాటిని రిజర్వాయర్లకు అనుసంధానం చేయాలి. ఈ పనులపై ప్రణాళిక లేదు. అసలు ప్రతిపాదనలే లేవు.

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి

జిల్లా అభివృద్ధి ముఖ్యమని నాయకులు భావిస్తే తక్షణమే నీటి వనరులు, నిల్వ సామర్థ్యం, వాటి పరిస్థితులు, సరఫరా వ్యవస్థలు, భావి అవసరాలపై సమీక్షించి, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలి. ఉన్న రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా తగిన చర్యలు చేపట్టాలి. పోలవరం నీరు వస్తే సరిపోదు. దానిని నిల్వ చేసి, సరఫరా చేయాలి. దానికి అనువైన మౌలిక వసతులు కల్పించాలి.

Updated Date - Jun 21 , 2026 | 01:06 AM