మన్యంలో పనస ఘుమఘుమలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:37 PM
మన్యంలో ఈ ఏడాది పనస విరగ్గాసింది. దీంతో గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా పనసకాయలే కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది పనస అధిక దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు.
ఈ ఏడాది అధిక దిగుబడి
పిందెల నుంచే కొనుగోలుకు ఎగబడిన వర్తకులు
ఇతర ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు వినియోగం
పనస ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతోనే గిరిజనులకు మేలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ఈ ఏడాది పనస విరగ్గాసింది. దీంతో గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా పనసకాయలే కనిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది పనస అధిక దిగుబడి వచ్చిందని రైతులు అంటున్నారు. అయితే ఎటువంటి పెట్టుబడి, శ్రమ లేకుండా తమ ప్రాంతంలో పండే పనసతో ఎంతో కొంత ఆదాయం లభిస్తుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పనస ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తమకు మరింత ప్రయోజనం చేకూరుతుందని గిరిజనులు అంటున్నారు.
పనసకాయలు కంటే గత కొన్నాళ్లుగా పిందెలకే ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. ఇతర ప్రాంతాల్లో పనసతో చేసే ఆహార పదార్థాలను వినియోగిస్తుండడంతో గిరాకీ పెరిగింది. దీంతో మైదాన ప్రాంతాలకు చెందిన వర్తకులు గిరిజన పల్లెలకు వచ్చి స్థానిక రైతుల నుంచి పిందెలను కొనుగోలు చేసి, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అప్పటి డిమాండ్, పిందె పరిమాణాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. అలాగే ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉండడంతో పనసకాయలు పండిన తర్వాత విక్రయించే కంటే పిందెలుగా విక్రయిస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని రైతులు అంటున్నారు. పిందెలను విక్రయించకుండా ఉంచడం వల్ల ఆయా కాయలన్నీ ఒకే సమయంలో పండిపోతే, సకాలంలో వాటిని విక్రయించలేని పరిస్థితుల్లో మొత్తం పాడైపోయి నష్టపోతామని గిరిజనులు తెలిపారు. అందుకనే ఈ ఏడాది ఎక్కువ శాతం పిందెలనే విక్రయించామని చెప్పారు.
మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే మేలు
ఏజెన్సీలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్న పనసకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే తమకు మేలు జరుగుతుందని గిరిజనులు అంటున్నారు. ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడంతో పూర్తిగా వర్తకులు, పర్యాటకులపై ఆధారపడి విక్రయాలు సాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో మండల కేంద్రాలు, పర్యాటక ప్రదేశాల్లో రోడ్డు పక్కన చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చే సుకుని అమ్ముకుంటున్నారు.
పనస ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కలేనా?
ఏజెన్సీలో పెద్ద ఎత్తున పనస ఉత్పత్తవుతున్నప్పటికీ వాటి ఆధారంగా ప్రోసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామని పాలకుల హామీలు కలగానే మిగిలిపోతున్నాయి. ఏజెన్సీలో పనస అధికంగా ఉన్న నేపథ్యంలో పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో వాటి ఆధారిత ప్రోసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తే, గిరిజన రైతులకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ధర సైతం పడిపోని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆ దిశగా పాలకులు కనీసం దృష్టి సారించని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీలో పనసను రోడ్లపై విక్రయించుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.