మన్యంలో కాఫీ ఘుమఘుమలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:56 AM
మన్యంలో ఈ ఏడాది నుంచి మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చెందనున్నాయి. ఏజెన్సీలో రూ.526 కోట్ల వ్యయంతో 2015 నుంచి పదేళ్ల కాల పరిమితితో అమలైన గత కాఫీ ప్రాజెక్టు 2024- 25 ఆర్థిక సంవత్సరంతో ముగిసింది.
ఈ ఏడాది నుంచి మొదలు కానున్న కొత్త కాఫీ ప్రాజెక్టులో మొక్కల పంపిణీ
గతేడాది రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో నూతన కాఫీ ప్రాజెక్టును మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
2015లో మంజూరైన రూ.526 కోట్ల కాఫీ ప్రాజెక్టు 2025లో ముగింపు
కాఫీ తోటల అభివృద్ధిపై కనీసం దృష్టి పెట్టని గత వైసీపీ ప్రభుత్వం
గిరిజన కాఫీ తోటలకు జీవం పోస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ఈ ఏడాది నుంచి మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చెందనున్నాయి. ఏజెన్సీలో రూ.526 కోట్ల వ్యయంతో 2015 నుంచి పదేళ్ల కాల పరిమితితో అమలైన గత కాఫీ ప్రాజెక్టు 2024- 25 ఆర్థిక సంవత్సరంతో ముగిసింది. ఈ క్రమంలో మన్యంలో కాఫీ తోటల అభివృద్ధి, గిరిజన రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గతేడాది ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, కొత్తగా రూ.202 కోట్ల వ్యయంతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేసేందుకు నూతన ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పది వేల ఎకరాల్లో కాఫీ మొక్కలను పంపిణీ చేసేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను గ్రామ స్థాయిలో నర్సరీలను ఏర్పాటు చేసి, అక్కడ మొక్కలను అభివృద్ధి చేసి గ్రామాల్లోని రైతులకు ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కొత్త ప్రాజెక్టులో ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ
గతేడాది మంజూరైన కొత్త కాఫీ ప్రాజెక్టులో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చే స్తారు. ఇందుకు గాను 2026- 27 ఆర్థిక సంవత్సరంలో 10 వేలు, 2028లో 10 వేలు, 2029లో 20 వేలు, 2030లో 30 వేలు, 20231లో 30 వేల ఎకరాలు చొప్పున కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతారు. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగానే గతేడాది 30 వేల ఎకరాల్లో గిరిజన రైతులకు పండ్ల మొక్కలను అందించారు. అలాగే ఈ ఏడాది మరో 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను అందించనున్నారు. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లలో ఏడాదికి 15 వేల ఎకరాల చొప్పున మొత్తం 75 వేల ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు చర్యలు చేపడతారు. వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది కాఫీ రైతులకు మిరియాల సేకరణ అవసరమైన అల్యూమియం నిచ్చెనలు అందిస్తారు. ఈ కొత్త కాఫీ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలో మరో లక్ష గిరిజన రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని ఐటీడీఏ అధికారులు భావిస్తున్నారు.
కాఫీ తోటలకు జీవం పోస్తున్న చంద్రబాబునాయుడు
2014లో సంభఽవించిన హుద్‌హుద్ తుఫాన్‌కు భారీ స్థాయిలో ఏజెన్సీలో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో కాఫీ రైతులను ఆదుకునేందుకు 2015 నుంచి 2025 వరకు లక్ష ఎకరాల కాఫీ తోటల అభివృద్ధికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.526 కోట్లతో ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేకంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చేశారు. అలాగే 2016లో చంద్రబాబునాయుడు మన్యం కాఫీని ‘అరకు కాఫీ’గా ప్రపంచానికి పరిచయం చేసి ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా అదే ఏడాది ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులతో అరకు కాఫీని తాగించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ మరింతగా ప్రాచుర్యం పొందింది. తాను మంజూరు చేసిన కాఫీ ప్రాజెక్టు ముగిసిందని తెలుసుకున్న ఆయన మరో ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు గతేడాది రూ. 202 కోట్లతో కొత్త ప్రాజెక్టును మంజూరు చేశారు. అప్పుడు, ఇప్పుడు సైతం గిరిజన ప్రాంతంలో కాఫీ తోటల అభివృద్ధికి చంద్రబాబునాయుడు ప్రత్యేక చర్యలు చేపట్టడంపై గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.