Share News

ఖండాంతరాలకు అరకు కాఫీ ఘుమఘుమలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:12 AM

ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న కాఫీ ఘుమఘుమలు ఖండాంతరాలకు విస్తరించింది. జిల్లా రైతులు పండించిన కాఫీ ‘అరకు కాఫీ’ బ్రాండ్‌గా ప్రపంచ దేశాలకు ఎగుమతులు అవుతోంది.

ఖండాంతరాలకు అరకు కాఫీ ఘుమఘుమలు
ఆర్‌వీనగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధన క్షేత్రం

సీఎం చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ విస్తృత ప్రచారం

జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో సాగు

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన పంట

ప్యారిస్‌లోని అరకు కాఫీ కేఫ్‌కు ప్రత్యేక క్రేజ్‌

నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా..

చింతపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న కాఫీ ఘుమఘుమలు ఖండాంతరాలకు విస్తరించింది. జిల్లా రైతులు పండించిన కాఫీ ‘అరకు కాఫీ’ బ్రాండ్‌గా ప్రపంచ దేశాలకు ఎగుమతులు అవుతోంది. గిరిజన రైతుల కృషి ఫలితంగా ఉత్తమ కాఫీ ఉత్పత్తుల్లో ప్రపంచదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టిన ఘనత అరకు కాఫీకే దక్కిందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్యారిస్‌లో ఏర్పాటుచేసిన ‘అరకు కాఫీ’ కేఫ్‌లో కాఫీని సేవించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అరకు కాఫీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రమోట్‌ చేస్తున్నారు. ప్రపంచంలోనే కాఫీకి ప్రత్యేక స్థానం ఉండడంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ(ఐసీవో) అక్టోబరు ఒకటిన అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహిసస్తోంది. ఈ ఏడాది ‘కాఫీ పరిష్కారంలో ఒక భాగం’, ‘సహకారం ద్వారా శ్రేయస్సును నిర్మించడం’ అనే థీమ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గిరిజన ప్రాంతంలో అటవీశాఖ, కాఫీబోర్డు సంయుక్తంగా 1970లో కాఫీ సాగును ప్రారంభించింది. తొలుత కేవలం 300 హెక్టారుల్లో కాఫీ సాగు ప్రారంభించి రెండేళ్లలో 1,200 హెక్టార్లకు విస్తరించింది. 1976 నుంచి ఏపీఎఫ్‌డీసీ(ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ) కాఫీ సాగును ఏజెన్సీలో పది మండలాల్లో విస్తరించింది. ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ ఆధీనంలో 4,010 హెక్టారుల్లో కాఫీ సాగు జరుగుతోంది. కాఫీ సాగును కాఫీబోర్డు, ఏపీఎఫ్‌డీసీ విజయవంతంగా సాగుచేస్తుండడంతో ఐటీడీఏ రైతులకి కాఫీ పంటను పరిచయం చేసింది. 1974 నుంచి రైతులు కాఫీ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో 2.45 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుచేపడుతున్నారు.

కాఫీ బోర్డు ప్రత్యేక కృషి..

గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీనగర్‌ వద్ద 1976లో కేంద్ర ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం ఏర్పాటైంది. 1982లో ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఇప్పటికి పలు రకాల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేస్తున్నారు. ఆర్‌వీనగర్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే గిరిజన ప్రాంతంలో కాఫీ సాగు అధిక విస్తీర్ణంలో జరుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. ఈ పరిశోధన స్థానం 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతున్నది.

ఫైన్‌ కప్‌ అవార్డుల్లోనూ..

కాఫీబోర్డు ప్రతిష్ఠాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఫైన్‌ కప్‌ అవార్డుల్లోనూ జిల్లా ఆదివాసీ రైతులు సత్తాచాటుతున్నారు. గతంలో గిరిజన ప్రాంతంలో సాఫీ సాగు చేపడుతున్న ఏపీఎఫ్‌డీసీ 12సార్లు ఫైన్‌ కప్‌ అవార్డులను దక్కించుకుంది. ప్రతి ఏడాది పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించి ఫ్లేవర్‌ ఆఫ్‌ ఫైన్‌కప్‌ అవార్డును దక్కించుకుంటున్నారు. 2024లో పెదబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు, 2025లో లంబసింగి పంచాయతీ అసరాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు ఫైన్‌ కప్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.

రైతులను గౌరవించుకుందాం

అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఈ ఏడాది ‘కాఫీ పరిష్కారంలో ఒక భాగం’, ‘సహకారం ద్వారా శ్రేయస్సును నిర్మిచడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పర్యావరణ స్థిరత్వం, ఆర్థిక స్థితి స్థాపకతతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 12.5 మిలియన్ల కాఫీ రైతు కుటుంబాల ప్రగృతికి ఐసీవో దృష్టి సారిస్తున్నది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నది. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌(బీఐఈసీ)లో కాఫీ టేస్టింగ్‌, బ్రూ బార్‌, స్థిరత్వంపై ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పాడేరు మినుములూరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు ప్రత్యేక పోటీలను ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 01 , 2026 | 12:12 AM