Share News

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:25 PM

ఉమ్మడి అల్లూరి జిల్లాలో గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేలా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచన

ఐవీఆర్‌ఎస్‌లో తగిన వృద్ధి లేకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి

పాడేరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి జిల్లాలో గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేలా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా ప్రగతిపై సోమవారం సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌ సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. ఏడాది పొడవునా గిరిజన రైతులకు ఆదాయాన్ని సమకూర్చేలా ఉద్యానవన, వ్యవసాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయానుబంధ రంగాల అభివృద్ధిని సమాంతరంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము అందాలని, రబీ సీజన్‌లో యురియా, తదితరాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పంటల సాగు చేస్తున్న రైతులకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను అందించి భూమి సారం మొదలుకుని పంటల దిగుబడి పెరిగి, రెట్టింపు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రైతులు లబ్ధి పొందేలా కృషి చేయాలన్నారు. కాఫీ సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు కాఫీ తోటల్లో అంతర పంటలను ప్రోత్సహించాలని, ప్రతి మండలంలో మినీ స్టోరేజ్‌ రూమ్‌లను నిర్మించాలన్నారు. రైతులకు ఆధునిక పద్ధతులను అలవాటు చేసేందుకు అవసరమైన శిక్షణలు, క్షేత్ర పర్యటనలు అవసరమని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, రాయితీలు, సబ్సిడీలు పొందేలా చూడాలన్నారు. పంట కుంటలు, కాల్వల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని, పాడి, పౌలీ్ట్ర పరిశ్రమల అభివృద్ధి, పీఎం కర్మయోగిలో నమోదు పెంచాలని, బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే సంఖ్య పెరగాలన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ప్రతి స్పందన స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ శాతం తగ్గడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దాని శాతం పెంచేలా అధికారులు చర్యలు చే పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా ఉద్యాన వనాధికారి కె.బాలకర్ణ, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి జయరాజ్‌, పోలవరం, అల్లూరు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై వారి నుంచి ప్రతిస్పందనను ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా స్వీకరిస్తున్నదన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించడంతో పాటు చక్కని సేవలను అందించాలన్నారు. భూముల మ్యుటేషన్లు, అటవీ హక్కులు కల్పించే క్రమంలో ఎటువంటి ప్రలోభాలు, లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ వేగవంతం చేసి, ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని, పీజీఆర్‌ఎస్‌లో భూ సమస్యలపై వచ్చే వినతులపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే పట్టాదారు పాసు పుస్తకాలను నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని, ఈ క్రమంలో భూ యాజమాని పేర్లు తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌, డీఆర్‌వో పి.అంబేడ్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:25 PM