ఆక్రమణల అరాచకం
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:15 AM
పెందుర్తి మండలంలో ఆక్రమణదారులకు అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, కొండలు, రహదారులను కబ్జా చేస్తున్నారు.
పెందుర్తిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
యథేచ్ఛగా ఇళ్లు, దుకాణాల నిర్మాణం
తొలగించే క్రమంలో ఉద్యోగులపై దాడి
అక్రమార్కులకు అన్ని పార్టీల మద్దతు
రెవెన్యూ అధికారుల వైఖరిపైనా విమర్శలు
చింతగట్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్
విశాఖపట్నం/పెందుర్తి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలంలో ఆక్రమణదారులకు అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, కొండలు, రహదారులను కబ్జా చేస్తున్నారు. రౌడీషీటర్ల సాయంతో బరితెగిస్తున్నారు. సంఘాల పేరుతో బెదిరిస్తున్నారు. ఆక్రమణలు తొలగింపునకు వచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. చింతలగట్ల గ్రామంలో శనివారం రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడిచేసిన సంఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తి వివరాలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
ఈ మండలంలో గొలుసుకట్టు చెరువులు ఎక్కువ. పట్టణీకరణతో చెరువుల కింద సాగు భూములు ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఆక్రమణదారులు చెరువులను చెరపట్టారు. కొన్నిచోట్ల పేదలు పాకలు వేసుకోగా, మరికొన్నిచోట్ల నేతలే ఆక్రమణలకు పాల్పడ్డారు. గెడ్డలు, వాగులు కబ్జాచేసి ఇళ్లు నిర్మించారు. ఈ క్రమంలో సుజాతనగర్‌లోని గెడ్డలు పూర్తిగా మాయమయ్యాయి. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం కొన్ని భూములు సేకరించింది. నిర్వాసితులకు పరిహారం, ఇళ్ల స్థలాలిచ్చారు. వాటిని కొందరు అమ్ముకున్నారు. కొనుగోలుచేసే వ్యక్తులు సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. చింతగట్లలో కొండలో ఐదెకరాలకు ఒక వ్యక్తి పట్టా ఉందని అధికారులను తప్పు దోవ పట్టించారు. ఇతడికి ఓ కూటమినేత ఒత్తాసు పలికారు. కాగా ఆక్రమణలు పెరగడం, అక్రమార్కుల బరితెగింపునకు రెవెన్యూ అధికారులే కారణమనే విమర్శలున్నాయి. ఇక్కడి తహశీల్దారు కార్యాలయమే దీనికి అడ్డాగా మారిందనే వాదన ఉంది. ఆక్రమణలు తొలగించే సమయంలో దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వచ్చేదని భావిస్తున్నారు. కలెక్ట్టర్ ప్రత్యేక దృష్టి సారించకుంటే ప్రభుత్వ భూములతో పాటు అధికారులకూ రక్షణ ఉండదనే వాదన వినిపిస్తోంది.
దళారీ హవా
అధికారపార్టీకి చెందిన కీలకనేత అనుచరుడొకరు పెందుర్తి తహశీల్దారు కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. అక్కడ ఏ పని కావాలన్నా దళారీ చెప్పాల్సిందే.. ఈ నేపథ్యంలో కిందస్థాయి సిబ్బంది నేరుగా దళారీ ఇంటికి వెళ్లి ప్రసన్నం చేసుకుంటారని, అతడు ప్రతిపనికి రేటు ఖరారుచేసి వసూలు చేస్తాడని సమాచారం. ఎవరి వాటా వారికి ఇస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి వ్యవహారంపై ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇవీ అరాచకాలు
ఫ ‘పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో శనివారం ప్రభుత్వభూమిలో నిర్మించిన ఇళ్లను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగులపై ఆక్రమణదారులు రాళ్లతో దాడిచేశారు. ఇది నేరమని తెలిసినా కొందరు కూటమి నేతలు కేసులు వద్దని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులనూ బెదిరిస్తున్నారు’.
ఫ చినముషిడివాడ చెరువులో ఆక్రమణలు తొలగింపునకు వెళ్లిన మహిళా వీఆర్వో, సిబ్బందిపై దాడి జరిగింది. ఇప్పటివరకు చర్యలు శూన్యం. గత ప్రభుత్వంలో ఓ వైసీపీ నేత నరవ ప్రాంతంలో ఆర్‌ఐ, వీఆర్వోపై దాడిచేశారు. ప్రతిఫలంగా అప్పటి అధికారులు ఆర్‌ఐను బదిలీ చేశారు.
ఫ జెర్రిపోతులపాలెంలో ఓ వైసీపీ నేత గెడ్డను జిరాయితీగా మార్చి అమ్మేశారు. దీనిపై ఇప్పటివరకు చర్యలు లేవు. చింతగట్లలో కూటమిపార్టీల ప్రతినిధి డీపట్టా భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. మరోచోట షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. ప్రభుత్వ భూమిని అమ్మేశారు. ప్రశ్నిస్తే రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తున్నారు. ఈ గ్రామం సర్వేనంబరు 62/1, 80/2లో జలవనరులశాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుని లేఅవుట్ వేశారు.