Share News

పరిషత్‌ ఎన్నికల్లో కూటమి తప్పటడుగులు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:49 PM

జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూటమి తప్పటడుగులు వేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు వేసిన పలు కమిటీలు స్థానిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోకపోవడంతోపాటు అభ్యర్థుల ఎంపికలో సమన్వయం చేయలేకపోయారని తెలుస్తోంది.

పరిషత్‌  ఎన్నికల్లో కూటమి తప్పటడుగులు!

ఫలితంగా 3 జడ్పీటీసీలకు పరిమితం

స్థానిక నాయకత్వాన్ని విస్మరించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక

స్థానిక పరిస్థితులపై అవగాహన లేమి

సమన్వయం చేయడంలో కమిటీలు విఫలం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూటమి తప్పటడుగులు వేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు వేసిన పలు కమిటీలు స్థానిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోకపోవడంతోపాటు అభ్యర్థుల ఎంపికలో సమన్వయం చేయలేకపోయారని తెలుస్తోంది. ఫలితంగానే జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు కేవలం 3 మాత్రమే దక్కాయని స్పష్టమవుతున్నది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో గిరిజన ఓటర్లలోనూ చాలావరకు మార్పు వచ్చింది. అయుతే దానిని ఓట్లుగా మలచుకుని అభ్యర్థులను గెలిపించుకోవడంలో కూటమి పార్టీలు విఫలమయ్యాయి.

అభ్యర్థుల ఎంపికలో గందరగోళం

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలోనే కూటమి పార్టీలు గందరగోళంలో పడ్డాయి. ఇదే అంశం విపక్ష వైపీసీకి మేలు జరిగిందని నాయకులు అంటున్నారు. జిల్లాలోని ఏ మండలంలో ఏ పార్టీకి బలం ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. జిల్లాలో కేవలం రెండు (ముంచంగిపుట్టు, జీకేవీధి) జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు జిల్లాపరిషత్‌ చైర్మన్‌ స్థానాన్ని కేటాయించడంతోనే జిల్లాలో జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవాలనే ఆశ లేకుండా పోయిందని పలువురు కూటమి జడ్పీటీసీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి ఒక మండలంలో జడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిగా ఒక పార్టీని బరిలోకి దింపే క్రమంలో ఆ మండలంలోని అధిక సంఖ్యలో ఎంపీటీసీ స్థానాల్లో అదే పార్టీకి చెందిన వారిని నిలబెట్టాలి. అప్పుడే ఎంపీటీసీల ద్వారా జడ్పీటీసీ అభ్యర్థికి సైతం ఓట్లు పడతాయి. కాని జిల్లాలో అందుకు భిన్నంగా జడ్పీటీసీ అభ్యర్థులను బరిలో దించారు. ఉదాహరణకు పాడేరులోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకుగానూ 3 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను పెట్టి, జడ్పీటీసీ స్థానంలో సైతం బీజేపీ అభ్యర్థినే బరిలో దింపారు. అలాగే ముంచంగిపుట్టులోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పెట్టి, జడ్పీటీసీ స్థానం ఆ పార్టీకే ఇచ్చారు. దీంతో ఓటమి తప్పలేదు. వాస్తవానికి ముంచంగిపుట్టు, పాడేరులో జడ్పీటీసీ అభ్యర్థులను టీడీపీ నుంచి బరిలోకి దించితే రెండు స్థానాల్లో గెలుస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా జిల్లాలో పలుచోట్ల కూటమి ధర్మాన్ని సైతం సక్రమంగా పాటించలేదు. కూటమి పార్టీలను సమన్వయం చేయడంలో కమిటీలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉదాహరణకు జీకేవీధి, డుంబ్రిగుడ మండలాల్లో జడ్పీటీసీ స్థానానికి బీజేపీ, జనసేన అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. ఇదే పరిస్థితి ప్రతి మండలంలో ఎంపీటీసీ స్థానాల విషయంలోనూ కొనసాగింది. దీంతో అవకాశం ఉన్నా అభ్యర్థుల ఎంపికలో స్పష్టత లేక ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. వాస్తవానికి కూటమి పార్టీల నేతలను సమన్వయం చేసుకుని, అభ్యర్థుల బలాబలాలను పక్కాగా అంచనా వేసి సీట్లు ఇస్తే.. జిల్లాలో జడ్పీ పీఠంతోపాటు సగానికి సైతం మండలాల్లో ఎంపీపీ పదవులను కూటమి దక్కించుకునేది. అలాగే కూటమి ప్రణాళికలకు భిన్నంగా తమదైన శైలిలో వైసీపీ నేతలు ప్లాన్‌ చేయడంతో జడ్పీ పీఠంతోపాటు సగానికిపైగా మండలాల్లో ఎంపీపీ పదవులను పొందే అవకాశం దక్కింది.

Updated Date - Nov 13 , 2026 | 10:49 PM