చింతపల్లిలో పుంజుకున్న కూటమి
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:00 AM
చింతపల్లి సబ్ డివిజన్‌లో కూటమి పార్టీలు భారీగా పుంజుకున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి దీటైన పోటీ
సబ్ డివిజన్‌లో చెరో 30 స్థానాలు సొంతం
మార్పుకు శ్రీకారం చుట్టిన ఆదివాసీలు
కూటమి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంతో
విద్యావంతులు, ఉద్యోగుల్లో మార్పు
సోషల్ మీడియాలో వైసీపీతో కలుగుతున్న నష్టంపై అవగాహన
చింతపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
చింతపల్లి సబ్ డివిజన్‌లో కూటమి పార్టీలు భారీగా పుంజుకున్నాయి. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో వైసీపీ, టీడీపీ చెరో 30 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓటింగ్ శాతం సైతం సమానంగా ఉండడం గమనార్హం. 2013వ సంవత్సరం నుంచి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలు మార్పుకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై గిరిజనులు పెంచుకున్న అభిమానంతో వారు కాంగ్రెస్‌కి ఆకర్షితులయ్యారు. వైఎస్ మరణం అనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీకి ఆదివాసీలు దగ్గరయ్యారు. మూడు దఫాలుగా పాడేరు, అరకులోయల నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తూ వచ్చారు. 2013-14, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీలోని 11 మండలాల్లో ఆదివాసీలు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థులు కేవలం 5 శాతం మాత్రమే విజయం సాధించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలో లేకపోయినప్పటికీ అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను శతశాతం దశలవారీగా నెరవేరుస్తూ ఆదివాసీల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారు. రెండేళ్లలో రూ.వేల కోట్ల నిధులు వెచ్చించి, తారు రోడ్లు, నీటి పథకాలు ఏర్పాటు , పక్కా గృహాలను మంజూరు చేసింది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ విత్తనాలు, ఎరువులను 90శాతం రాయితీపై అందజేస్తున్నది. కాఫీకి స్వయంగా ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గమనిస్తున్న ఆదివాసీల్లో క్రమంగా మార్పు వస్తున్నది. ప్రతిపక్షంలోనున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని గిరిజనులు భావిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో వైసీపీ కనుమరుగైపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విద్యావంతులు, ఉద్యోగుల్లో మార్పు
గిరిజన ప్రాంతంలో విద్యావంతులు, ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తున్నది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉద్యోగులు బ్యాలెట్ ద్వారా కూటమి మద్దతుదారులకు అధికంగా ఓట్లు వేశారు. విద్యావంతులైన యువత టీడీపీ, జనసేనకు దగ్గరవుతున్నారు. ప్రధానంగా జీవో నంబరు-3 వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కోల్పోవలసి వచ్చిందని, కనీసం దేశ అత్యున్న న్యాయస్థానంలో వైసీపీ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ సైతం వేయలేకపోయిందనే చర్చ గిరిజన ప్రాంతంలో ప్రారంభమైంది. గిరిజన ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పటికి మౌనంగా ఉండిపోయారే తప్ప ప్రభుత్వంపై కనీసం ఒత్తిడి తీసుకు రాలేకపోయారని గిరిజన యువకులు అంటున్నారు. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు అరకులోయలో చంద్రబాబునాయుడు గిరిజనులకు శతశాతం ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించేందుకు జీవో నంబరు-3 పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆదివాసీలు ఎన్నుకుని తప్పు చేశారని విద్యావంతులైన యువత, ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో భూబదలాయింపు చట్టానికి పూర్తి భద్రత ఉందని, జీవో నంబరు-3 తరహాలో ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రత్యామ్నాయం తీసుకొస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు నెలల క్రితం స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ప్రతిపక్ష హోదాలోనున్న వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని విద్యావంతులు, ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆదివాసీలకు అవగాహన కల్పిస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో దీటైన పోటీ
సబ్ డివిజన్ పరిధిలో జరిగిన మొదటి దశ సర్పంచ్ ఎన్నికలను పరిశీలిస్తే వైసీపీకి కూటమి అభ్యర్థులు దీటైన పోటీ ఇచ్చారు. మూడు మండలాల్లో 66 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. సర్పంచులుగా టీడీపీ మద్దతుదారులు 30 మంది, వైసీపీ మద్దతుదారులు 30మంది విజయం సాధించారు. ఓటింగ్ శాతం కూడా రెండు పార్టీలకు 45.45శాతం వచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కొయ్యూరు మండలంలో టీడీపీ సత్తా చాటింది. చింతపల్లి మండలంలోనూ కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సాగిన అన్నపూర్ణదేవి వైసీపీ జడ్పీటీసీ అనూషదేవికి బలమైన పోటీ ఇచ్చింది. 20 స్థానంలో కూటమి తొమ్మిది, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. జీకేవీధిలో జడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ స్థానాలను వైసీపీ సొంతం చేసుకున్నప్పటికీ కూటమి ఓటు బ్యాంక్ గతంలో పోల్చుకుంటే గణనీయంగా పెరిగింది. 2029 ఎన్నికలు నాటికి గిరిజన ప్రాంతంలో ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి బలమైన పునాది పడుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు.