Share News

ఎలమంచిలిలో కూటమి విజయదుందుభి

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:35 AM

ఎలమంచిలి మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయఽఢంకా మోగించారు. చైర్‌పర్సన్‌తోపాటు 25 వార్డుల్లో ఘన విజయం సాధించారు. కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిల్లా రమాకుమారి సుమారు నాలుగు వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొద్దపు తులసీపై గెలుపొందారు. దీంతో ఆమె హ్యాట్రిక్‌ విజేతగా నిలిచారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పట్టణంలో విజయోత్సవాలు నిర్వహించారు.

ఎలమంచిలిలో కూటమి విజయదుందుభి
చైర్‌పర్సన్‌గా గెలుపొందిన రమాకుమారికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి

చైర్‌పర్సన్‌తోపాటు 25 వార్డులు కైవసం

టీడీపీ-12, జనసేన-11, బీజేపీ-2 వార్డుల్లో గెలుపు

ఆరు వార్డులకే పరిమితమైన వైసీపీ

ఒక వార్డులో ఇండిపెండెంట్‌ విజయం

ఎలమంచిలి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

ఎలమంచిలి మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయఽఢంకా మోగించారు. చైర్‌పర్సన్‌తోపాటు 25 వార్డుల్లో ఘన విజయం సాధించారు. కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిల్లా రమాకుమారి సుమారు నాలుగు వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొద్దపు తులసీపై గెలుపొందారు. దీంతో ఆమె హ్యాట్రిక్‌ విజేతగా నిలిచారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో పట్టణంలో విజయోత్సవాలు నిర్వహించారు.

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించడంతో కూటమి నుంచి బీజేపీ తరపున మాజీ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి, వైసీపీ నుంచి బొద్దపు తులసీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా దొడ్డి శాంతి పోటీ చేశారు. మొదటి నుంచి బీజేపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యనే నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీ సాగింది. ఈ నెల ఒకటో తేదీన పోలింగ్‌ నిర్వహించగా, మంగళవారం ఇక్కడి గురవప్ప కల్యాణ మండపంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మునిసిపాలిటీలో 32 వార్డులు వుండగా, ఒక్కో రౌండ్‌కు ఎనిమిది వార్డుల చొప్పున ఓట్ల లెక్కింపు చేపట్టారు. అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రమాకుమారి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచారు. మునిసిపాలిటీలో మొత్తం 36,526 మంది ఓటర్లు వుండగా, 27,913 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో కూటమి (బీజేపీ) అభ్యర్థి పిల్లా రమాకుమారికి 15,129 ఓట్లు ( 54.2 శాతం) వచ్చాయి. వైసీపీ అభ్యర్థి బొద్దపు తులసీకి 11,324 ఓట్లు (40.57 శాతం) వచ్చాయి. దీంతో రమాకుమారి 3,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి దొడ్డి శాంతికి 240 ఓట్లు పడగా, నోటాకు 364 ఓట్లు నమోదయ్యాయి. 856 ఓట్లు చెల్లలేదు.

ప్రతీ రౌండ్‌లో రమాకుమారి ఆధిక్యం

ఓట్ల లెక్కింపును నాలుగు రౌండ్‌లో చేపట్టారు. ఒక్కో రౌండ్‌లో ఎనిమిది వార్డుల ఓట్లను లెక్కించారు. అన్ని రౌండ్లలో కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి రౌండ్‌లో కూటమికి 4,061 ఓట్లు రాగా, వైసీపీకి 3,484 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కూటమికి 4,221 ఓట్లు, వైసీపీకి, 3,356 ఓట్లు, మూడో రౌండ్‌లో కూటమికి 4,667 ఓట్లు, వైసీపీకి 2,991 ఓట్లు, నాలుగో రౌండ్‌లో కూటమికి 2,168 ఓట్లు, వైసీపీకి 1,481 ఓట్లు వచ్చాయి. చైర్‌పర్సన్‌గా గెలుపొందిన రమాకుమారికి ఎన్నికల అధికారులు కె.వరహాలు, ప్రసాదరాజు ధ్రువీకరణపత్రం అందజేశారు.

25 వార్డులో కూటమి గెలుపు

ఆరు వార్డులకే వైసీపీ పరిమితం

మునిసిపాలిటీలో మొత్తం 32 వార్డులు వుండగా.. అన్ని స్థానాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ 12, జనసేన, 11, బీజేపీ 2 వార్డుల్లో గెలుపొందగా, వైసీపీకి ఆరు వార్డులు మాత్రమే దక్కాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్‌ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ 5, 6, 7, 8, 9, 11, 14, 21, 22, 23, 27, 30 వార్డుల్లో, జనసేన అభ్యర్థులు 1, 4, 15, 16, 17, 18, 19, 24, 25, 26, 32 వార్డుల్లో, బీజేపీ 10, 13 వార్డుల్లో, వైసీపీ అభ్యర్థులు 2, 3, 20, 28, 29 వార్డుల్లో గెలిచారు. 12 వార్డు టీడీపీ టికెట్‌ షేక్‌ బీబీకి ఇవ్వగా, కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఆమెను కాదని అత్తిలి సత్యవతిని ఇండిపెండెంట్‌గా పోటి చేయించి మద్దతు ఇచ్చారు. దీంతో అనధికారికంగా బీజేపీ బలం మూడుకు, మొత్తంగా కూటమి బలం 26కు చేరింది. కాగా భారీ పోలీసు బందోబస్తు నడుమ కౌంటింగ్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ సందర్శించారు.

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

మొత్తం ఓటర్లు: 36,526

పోలైన ఓట్లు: 27,913

(పోస్టల్‌ బ్యాలెట్లు కలిపి)

పిల్లా రమాకుమారి: (కూటమి-బీజేపీ): 15,129

బొద్దపు తులసీ (వైసీపీ): 11,324

దొడ్డి శాంతి (కాంగ్రెస్‌): 240

నోటా: 364

చెల్లని ఓట్లు: 856

మెజారిటీ: 3,805 (కూటమి- బీజేపీ)

Updated Date - Nov 04 , 2026 | 01:35 AM