Share News

రెండో దశలోనూ కూటమి విజయదుందుభి

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:32 AM

గ్రామ పంచాయతీలకు రెండు దశలో జరిగిన ఎన్నికల్లో కూడా కూటమి మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 70 శాతం పంచయతీల్లో విజయం సాధించారు. మొత్తం 213 గ్రామపంచాయతీలకుగాను రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగలేదు. మిగిలిన 212 పంచాయతీల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని కూటమి బలపరిచిన అభ్యర్థులు 148 పంచాయతీల సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకున్నారు. వీటిలో 111 పంచాయతీల్లో తెలుగుదేశం, 34 పంచాయతీల్లో జనసేన, మూడు పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. ప్రతిపక్ష వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 57 పంచాయతీల్లో విజయం సాధించారు. మొదటి దశ ఫలితాలతో పోలిస్తే.. రెండో దశలో వైసీపీ బలం పుంజుకుంది. ఇక ఏడు పంచాయతీల్లో స్వతంత్రులు సర్పంచులుగా గెలుపొందారు.

రెండో దశలోనూ   కూటమి విజయదుందుభి
ఎస్‌ రాయవరంలో లెక్కింపు కోసం బ్యాలెట్‌ పేపర్‌లను వొలుపుతున్న దృశ్యం

70 శాతం పంచాయతీల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారుల గెలుపు

ఎన్నికలు జరిగిన పంచాయతీలు 213

కూటమి మద్దతుదారులు 148 సర్పంచ్‌ పదవులు కైవసం

టీడీపీ- 111, జనసేన- 34, బీజేపీ- 3..

వైసీపీ మద్దతుదారులు 57 పంచాయతీల్లో గెలుపు

ఏడుచోట్ల స్వతంత్రుల విజయం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి/ న్యూస్‌నెట్‌వర్క్‌)

గ్రామ పంచాయతీలకు రెండు దశలో జరిగిన ఎన్నికల్లో కూడా కూటమి మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 70 శాతం పంచయతీల్లో విజయం సాధించారు. మొత్తం 213 గ్రామపంచాయతీలకుగాను రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగలేదు. మిగిలిన 212 పంచాయతీల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని కూటమి బలపరిచిన అభ్యర్థులు 148 పంచాయతీల సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకున్నారు. వీటిలో 111 పంచాయతీల్లో తెలుగుదేశం, 34 పంచాయతీల్లో జనసేన, మూడు పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. ప్రతిపక్ష వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 57 పంచాయతీల్లో విజయం సాధించారు. మొదటి దశ ఫలితాలతో పోలిస్తే.. రెండో దశలో వైసీపీ బలం పుంజుకుంది. ఇక ఏడు పంచాయతీల్లో స్వతంత్రులు సర్పంచులుగా గెలుపొందారు.

మండలాల వారీగా ఎవరికెన్ని సర్పంచ్‌ పదవులు...

పాయకరావుపేట మండలంలో కూటమి మద్దతుదారులు పైచేయి సాధించారు. మొత్తం 24 పంచాయతీలకుగాను 14 పంచాయతీల్లో పాగా వేశారు. వీటిలో 13చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. ఎనిమిదిచోట్ల వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా, రెండు పంచాయతీల్లో స్వతంత్రులు సర్పంచులు అయ్యారు. కాగా పాయకరావుపేట సర్పంచ్‌గా కూటమి మద్దతుతో టీడీపీ సీనియర్‌ నాయకుడు జూరెడ్డి వెంకట సత్య శివప్రసాద్‌ భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం పోలైన 13,751 ఓట్లలో ప్రసాద్‌ 8,034 ఓట్లురాగా, వైసీపీ మద్దతు అభ్యర్థి కాదా రామకృష్ణకు 3,461 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నక్కపల్లి మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలకుగాను 22 గ్రామ పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు పాగావేశారు. 20 పంచాయతీల్లో టీడీపీ, రెండు చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. మిగిలిన 11 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు.

కోటవురట్ల మండలంలో అత్యధిక పంచాయతీల్లో కూటమి మద్దతుదార్లు విజయం సాధించారు. మండలంలో 25 గ్రామపంచాయతీలకుగాను ఏకగ్రీవాలతో కలిపి 15 పంచాయతీల్లో టీడీపీ, ఒకచోట జనసేన మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందగా, తొమ్మిది పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

కోటవురట్ల మండలం రామచంద్రపాలెంలో నాంబారు రాంబాబు (టీడీపీ) తొమ్మిది ఓట్ల మెజారిటీతో తమరాన వెంకటరమణ (టీడీపీ రెబల్‌)పై గెలుపొందారు.

ఎస్‌.రాయవరం మండలంలో కూటమి మద్దతుదారులు సర్పంచులుగా ఘన విజయం సాధించారు. మొత్తం 28 పంచాయతీలకుగాను ఏకగ్రీవాలతో కలిపి 23 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. వీటిలో 20 పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులు విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో, ఇండిపెండెంట్లు మూడు పంచాయతీల్లో గెలిచారు.

ఎలమంచిలి మండలంలో మొత్తం 17 పంచాయతీలకుగాను పది పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. వీరిలో నలుగురు తెలుగుదేశం, ఆరుగురు జనసేన పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఆరు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలవగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మేజర్‌ పంచాయతీ ఏటికొప్పాక సర్పంచ్‌గా మహాకూటమి పేరుతో అన్నం వెంకటరావు (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీ చే1,200 ఓట్ల మెజార్టీతో యన్నంశెట్టి సన్యాసిరావు(టీడీపీ)పై భారీ విజయం సాధించారు.

ఎలమంచిలి మండలంలో కూటమి తన ఆధిక్యతను మరోసారి ప్రదర్శించింది. మొత్తం 17 గ్రామ పంచాయతీలకుగాను పది పంచాయతీల్లో (టీడీపీ 4, జనసేన 6) కూటమి బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారు. ఆరు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందగా, మేజర్‌ పంచాయతీ ఏటికొప్పాకలో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు.

అచ్యుతాపురం మండలంలో 34 పంచాయతీలకుగాను కూటమి మద్దతుదారులు (టీడీపీ 12, జనసేన 8, బీజేపీ 2) మొత్తం 22 పంచాయతీల్లో సర్పంచులుగా గెలిచారు. మిగిలిన 12 పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మండలంలోని కొన్ని పంచాయతీల్లో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగా వైసీపీ లబ్ధిపొందిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

మునగపాక మండలంలో కూటమి బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధించారు. మొత్తం 26 పంచాయతీలకుగాను కూటమి 20 పంచాయతీల (టీడీపీ 11, జనసేన 9) సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకుంది. ఐదు పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

రాంబిల్లి మండలంలో 26 పంచాయతీలు వుండగా.. కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవితోపాటు రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 25 పంచాయతీలకుగాను 20 పంచాయతీల్లో (టీడీపీ 15, జనసేన 4, బీజేపీ 1) సర్పంచ్‌ పదవులను కూటమి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఐదుచోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు.

ఫొటోరైటప్‌:

29ఎకెపి రూరల్‌-1- మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

రెండో దశ పోలింగ్‌ ప్రశాంతం

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ సరళిని ఆమె పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగిందని, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించామన్నారు.

ఫొటోః29ఎన్‌కేపీ10: మేడేటి భాగ్యలక్ష్మి, నక్కపల్లి సర్పంచ్‌

నక్కపల్లిలో నవశకం

రెండు దశాబ్దాల తరువాత పంచాయతీలో పాగా వేసిన తెలుగుదేశం

నక్కపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన నక్కపల్లి పంచాయతీలో దాదాపు రెండు దశాబ్దాల తరువాత తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నక్కపల్లిలోని రెండు స్థానాలను వైసీపీ గెలుచుకున్నప్పటికీ సర్పంచ్‌ ఎన్నికల్లో ఎన్నికల్లో కూటమి మద్దతుతో పోటీ చేసిన మేడేటి భాగ్యలక్ష్మి విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేడేటి శంకర్‌ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన భార్య భాగ్యలక్ష్మిని సర్పంచ్‌ బరిలో దించారు. హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు కూటమి నాయకులంతా ఐకమత్యంతో పనిచేశారు. దీంతో భాగ్యలక్ష్మి తన సమీప ప్రత్యర్థి వైసీపీకి మద్దతుతో పోటీ చేసిన ఎం.భవానీపై 1,111 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Updated Date - Nov 30 , 2026 | 01:32 AM