విమానాశ్రయం సుదూరం
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:22 AM
దేశంలో 135కిపైగా విమానాశ్రయాలు ఉండగా, నగరానికి అత్యంత దూరంగా ఉండేది విశాఖపట్నంలోనే కావడం గమనార్హం.
నగరానికి 46 కి.మీ. దూరంలో భోగాపురం ఎయిర్‌పోర్టు
దేశంలో నగరానికి బాగా దూరంగా నిర్మించినది ఇక్కడే
రాకపోకలకు రవాణా సౌకర్యాలు
మెరుగుపరచాల్సిందిగా విన్నపాలు
కోస్టల్ కారిడార్ నిర్మాణం తక్షణం ప్రారంభించాలని విజ్ఞప్తులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దేశంలో 135కిపైగా విమానాశ్రయాలు ఉండగా, నగరానికి అత్యంత దూరంగా ఉండేది విశాఖపట్నంలోనే కావడం గమనార్హం. ప్రస్తుత నేవీ విమానాశ్రయం సిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉండగా, భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 46 కి.మీ. దూరాన ఉంది. ఢిల్లీలో ఇందిరాగాంధీ విమానాశ్రయం 16 కి.మీ., ముంబైలో ఛత్రపతి శివాజీ విమానాశ్రయం 30 కి.మీ, బెంగళూరులో కెంపెగౌడ విమానాశ్రయం 31 కి.మీ., కోల్‌కత్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 17 కి.మీ., హైదరాబాద్‌లో జీఎంఆర్ విమానాశ్రయం సిటీ సెంటర్‌కు 5 కి.మీ., గుజరాత్‌లో అహ్మదాబాద్ విమానాశ్రయం 8 కి.మీ. దూరాన ఉన్నాయి.
భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయం జూన్ నెలాఖరు లేదా జులైలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అది ప్రారంభమైతే విశాఖ నుంచి అక్కడకు వెళ్లడానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉంది. అనకాపల్లి జిల్లాలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు, ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఫార్మా కంపెనీలు అన్నీ అటే ఉన్నాయి. అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లాలంటే మరింత దూరం. వారిని కూడా దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉంది.
20 రహదారులు నాలుగుకు కుదింపు
భోగాపురం విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తూ తొలుత 20 మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తామని వీఎంఆర్‌డీఏ ప్రకటించింది. ఆ తరువాత వాటి సంఖ్యను పదిహేనుకు కుదించింది. ఆపై ఏడుకు తగ్గించింది. ఇప్పుడు అందులో నాలుగింటిని మాత్రం విమానాశ్రయం ప్రారంభించేసరికి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు.
జాతీయ రహదారిపై నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. అందుకని ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే వాటిని సాధారణ బస్సుల్లానే నడుపుతామని ప్రకటించడంపై ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కొన్ని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ పలు సూచనలు చేసింది.
- భోగాపురం వెళ్లే ప్రయాణికుల కోసం నగరంలో సిటీ పాసింజర్ లాంజ్‌లు నిర్మించాలని కోరుతోంది. ఇవి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జీఎంఆర్ ఏర్పాటుచేస్తేనే బాగుంటుందని చెబుతోంది. రైల్వేస్టేషన్లలో ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేసినట్టే వీటిని కూడా సౌకర్యవంతమైన సీటింగ్, నాణ్యమైన ఆహారం, ఏటీఎం, మెడికల్ షాపు సౌకర్యం కల్పించాలని కోరుతోంది. ఆర్‌కే బీచ్, వుడా పార్క్, సీతమ్మధార, ఇంకా ముఖ్యమైన రెండు మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని సూచించింది.
- కొమ్మాది వరకు ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టును భోగాపురం వరకు పొడిగించాలి.
- కోస్టల్ కారిడార్ నిర్మాణం తక్షణమే ప్రారంభించాలి.
- విశాఖ నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలకు వెళుతున్న సరకు రవాణా కోసం డెడికేటెడ్ కార్గో టెర్మినల్ నిర్మించాల్సి ఉందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కుమార్‌రాజా, నరేశ్‌కుమార్, డీఎస్ వర్మలు విశాఖ ఎంపీకి లేఖలు రాశారు.