జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:41 PM
జిల్లాకు సంబంధించి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను అధికారులు విధిగా సాధించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాకు సంబంధించి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను అధికారులు విధిగా సాధించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనులు చేపడుతున్న క్రమంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతూ ప్రగతిని సాధించాలన్నారు. ప్రధానంగా జిల్లాలో సంపూర్ణత అభియాన్ 2.0 సూచికలను పక్కాగా అమలు చేయాలని, ఇందులో భాగంగా విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. మాతా శిశు మరణాలను అరికట్టాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, స్వయం ఉపాధి, వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని, మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. జిల్లా అభివృద్ధి కేవలం గణాంకాలు మాత్రమే కాకుండా సామాన్యుడి జీవితంలో మార్పును తీసుకుని రావాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమ లక్ష్యాలను విధిగా చేరుకోవాలన్నారు. ఈక ార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.పూజ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ విద్యాసాగరరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కృష్ణమూర్తినాయక్, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాలికల గురుకులం సందర్శన
స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకులాన్ని కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం సందర్శించారు. అక్కడ బాలికలకు కల్పిస్తున్న వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు. చక్కగా చదువుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ ఉన్నారు.