Share News

యంత్రాంగం అప్రమత్తం

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:39 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

యంత్రాంగం అప్రమత్తం
అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

ముందస్తు చర్యలు చేపట్టాలి

కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం పని చేయాలి

ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నేడు, రేపు విద్యాలయాలకు సెలవు

పాడేరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. రానున్న తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలపై ఆమె సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారీ వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించకుండా, నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తుఫాన్‌ సందర్భంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్‌ విధుల్లో ఉన్న, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అవసరమైన రెయిన్‌ కోట్‌లు, శాటిలైట్‌ మొబైల్‌ ఫోన్లు, ఇతర అత్యవసర సామగ్రిని అందిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. గ్రామాల్లోని రోగులు, గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం పని చేయాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని, అలాగే ప్రజలు తఫాన్‌ పట్ల అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా తుఫాన్‌ విధులు నిర్వహించే సిబ్బందికి అందించే శాటిలైట్‌ మొబైల్‌ ఫోన్లను కలెక్టర్‌ పరిశీలించారు.

నేడు, రేపు విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు

ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు, విద్యాలయాలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు ఎటువంటి సెలవులు ఉండవని, ఎటువంటి హాస్టళ్లు లేని పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే రెండు రోజుల సెలవు వర్తిస్తుందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులు ఈ రెండు రోజులు వసతి గృహాల్లోనే ఉండాలన్నారు. ఆయా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.

జలాశయాల దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సీలేరు: ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సీలేరు కాంప్లెక్సు పరిధిలోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు రాబోయే మూడు రోజుల్లో వరద నీరు పోటెత్తి జలాశయాలు పూర్తిస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని జెన్‌కో అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరద నీరు దిగువకు విడిచిపెట్టే అవకాశం ఉన్నందున జలాశయాల దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు జలాశయాల దిగువ ప్రాంతాల ప్రజలు నదీ ప్రవాహాన్ని దాటవద్దని హెచ్చరించారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో మూడు సార్లు సైరన్లు మోగిస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రెండు రోజుల పాటు నైట్‌ బస్సు సర్వీసులు రద్దు

సీలేరు: విశాఖపట్నం డిపో నుంచి సీలేరు మీదుగా నడిపే నైట్‌ బస్సు సర్వీసులను ఈ నెల 27, 28 తేదీల్లో రద్దు చేసినట్టు విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ మాధురి తెలిపారు. అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం, అలాగే భద్రాచలం నుంచి విశాఖపట్నం నైట్‌ సర్వీసులతో పాటు సీలేరు నైట్‌ హాల్టు బస్సులను రెండు రోజుల పాటు రద్దు చేసినట్టు ఆమె పేర్కొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:39 AM